Suryaa.co.in

Andhra Pradesh

ఇంధన సామర్థ్య రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు

– దక్షిణాది రాష్ట్రాలకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ సూచన
– 60 క్లస్టర్లలో వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయనున్న బీఈఈ
– ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు డెస్టినీగా ఆంధ్రప్రదేశ్‌
– సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమగ్రాభివృద్ధికి గ్రోత్‌ ఇంజిన్‌లా అమరావతి రాజధాని
– అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్న మిషన్‌ లైఫ్‌ లక్ష్యాలు

అమరావతి : సహజ వనరుల సంరక్షణ, సమగ్రాభివృద్ధికి గ్రోత్‌ ఇంజిన్‌లాంటి ఇంధన సామర్థ్య రంగంలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు దక్షిణాది రాష్ట్రాల్లో అపారమైన అవకాశాలున్నాయని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) సెక్రటరీ మిలింద్ దేవ్ రా అన్నారు.

ఇంధన సామర్థ్యంలోనూ పెట్టుబడులకు ఎర్రతివాచీ పరిస్తే.. ఆ పెట్టుబడులు భవిష్యత్తులో ప్రతి రాష్ట్రానికి అత్యుత్తమ ఆర్థిక వనరులుగా మారనున్నాయని దేవ్‌రా స్పష్టం చేశారు. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) అమలు చేస్తున్న మిషన్‌ లైఫ్‌ కార్యక్రమం.. దేశంలోని సహజ వనరుల సంరక్షణకు కీలకంగా వ్యవహరించనుందని స్పష్టం చేశారు.

సమగ్రాభివృద్ధికి గ్రోత్‌ ఇంజిన్‌లా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రోడ్‌మ్యాప్‌కు మిషన్‌లైఫ్‌ దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అన్ని స్టేట్‌ డిజిగ్నేటెడ్‌ ఏజెన్సీలు (ఎస్‌డిఎ)లు ఇంధన సామర్థ్యం, మిషన్‌ లైఫ్‌ లక్ష్యాలపై దృష్టి సారించాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) పిలుపునిచ్చింది. పారిశ్రామిక రంగంతో పాటు పట్టణాభివృద్ధి, నిర్మాణం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే అపారమైన సామర్థ్యాల్ని సొంతం చేసుకోవడంతో పాటు రాష్ట్రం అంతర్జాతీయంగా గుర్తింపుపొందేందుకు అవకాశాలు ఉన్నాయని బీఈఈ సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు గ్రోత్‌ ఇంజిన్‌ అయిన రాజధాని అమరావతి.. అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతోందనీ.. ప్రపంచమంతా.. ఏపీ రాజధాని వైపు చూస్తోందని బీఈఈ సెక్రటరీ మిలింద్ దేవ్ రా చేశారు. ఏపీతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలు అమలు చేస్తున్న బీఈఈ కార్యక్రమాల స్థితిగతులు, ప్రస్తుతం మిషన్‌లైఫ్‌ అమలు ప్రభావం తదితర అంశాలపై బీఈఈ డైరెక్టర్లు, తదితర అధికారులు వివరణాత్మకంగా చర్చించారు.

అనంతరం.. బీఈఈ సెక్రటరీ మాట్లాడుతూ దేశమంతటా ఇంధన సామర్థ్యం ద్వారా సాధించిన ముఖ్యమైన ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాల్ని ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు పొందే అద్భుత ప్రతిఫలాల గురించి వివరించారు.

2030 నాటికి 1.5 ట్రిలియన్లకు…

ఇంధన సామర్థ్యం, విద్యుదీకరణలో వార్షిక పెట్టుబడులను 2030 నాటికి 1.5 ట్రిలియన్లకు పెంచేందుకు ప్రపంచ మార్కెట్‌లో అపారమైన అవకాశాలున్నాయని మిలింద్‌ తెలిపారు. ఇంధన సామర్థ్య నిర్వహణ కోసం ప్రతి ఏటా 840 యూఎస్‌ డాలర్లు కేటాయించబోతున్నారని వివరించారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో, బీఈఈ అవలంబించిన ఇంధన శక్తి సామర్థ్య చర్యల ద్వారా అక్షరాలా ర.1,60,721 కోట్ల విలువైన ప్రయోజనాల్ని భారత్‌ పొందిందనీ.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయ ప్రోత్సాహాన్ని అందించిందని వెల్లడించారు.

ఇదే సమయంలో కర్బన ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గించడంతో పాటు దేశ స్థిరమైన ఆర్థికాభివృద్ధి లక్ష్యాలకు దోహదం చేశాయని అన్నారు. ఈ ఇంధన ఆదాయం ఏటా 249.88 బిలియన్‌ యూనిట్ల విద్యుత్, 23.85 మిలియన్‌ టన్నుల ఆయిల్‌ థర్మల్‌ ఎనర్జీకి సమానమని తెలిపారు. మొత్తం 44.43 మిలియన్‌ టన్నుల చమురు ఆదాకు కూడా సమానమైనీ.. ఇది దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యుత్‌ సరఫరాలో 6 శాతం వాటా కలిగి ఉన్నట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని బీఈఈ సెక్రటరీ ఉద్ఘాటించారు.

సీఎం చంద్రబాబు సహకారమందిస్తున్నారు..

అక్షర క్రమంలోనే కాకుండా.. అభివృద్ధిలోనూ విజన్ తో ముందుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం.. పెట్టుబడులకు స్వర్గధామంగా మారే దిశగా అడుగులు వేస్తోంది. గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఆకర్షించేలా అద్భుత వనరులున్న రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో.. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

ఇంధన వనరుల పొదుపు సామర్థ్య నిర్వహణలో భాగంగా ఏపీ ప్రభుత్వం బీఈఈకి అందిస్తున్న సహాయ సహకారాలు అద్భుతమని సెక్రటరీ వెల్లడించారు. సంపూర్ణ మద్దతుని అందిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఇంధన సామర్థ్య నిర్వహణని వేగవంతం చేస్తూ.. ఏపీలోని ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ని సరఫరా చెయ్యాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న సీఎం దూరదృష్టికి బీఈఈ అమలు చేస్తున్న విధానాలు ప్రధాన ప్రభావాన్ని చూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

మిషన్‌లైఫ్‌ కార్యక్రమాలకు పూర్తి మద్దతునందిస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయం, ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ సహకారంతో దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీడియా అడ్వైజర్‌ రూపొందించిన మిషన్‌లైఫ్‌ పోస్టర్‌ సీఎం ఆవిష్కరించడం.. పర్యావరణ పరిరక్షణ, ఇంధనవనరుల పొదుపుపై ఆయనకున్న చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తోందన్నారు. ఇంధన సామర్థ్యం, స్థిరమైన అభివృద్ధికి సహకారం అందించేలా ఏపీ ఎనర్జీ విభాగం నిబద్ధతతో పనిచెయ్యడం.. ఈ కార్యక్రమాలు సఫలీకృతం కావడానికి కీలకమని అన్నారు.

ఎనర్జీ ఎఫిషియన్సీలో అవకాశాలు పుష్కలం..

పరిశ్రమలు, వ్యవసాయం, గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధి, పురపాలక రంగాల్లోనే కాకుండా.. ఇంధన సామర్థ్యంలోనూ పెట్టుబడులకు గణనీయమైన అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన అంశాల్ని బీఈఈ వెల్లడించింది. ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాల్ని, సంపదని సృష్టిస్థాయని బీఈఈ అంచనా వేస్తోంది. ఇంధన సామర్థ్యంలో గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీలో విభిన్నమైన అవకాశాలున్నాయి. ఎనర్జీ ఎఫిషియన్సీలో పెట్టుబడులు పెట్టేందుకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే కీలకంగా మారనుంది.

అమరావతిలో అపారమైన అవకాశాలు…

ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా.. రాష్ర ప్రభుత్వం కొత్త రాజధాని అమరావతి నిర్మాణాభివృద్ధి చేస్తున్న సమయంలో మిషన్‌లైఫ్‌ లక్ష్యాలు మరింత ఊతమివ్వనున్నాయి.పర్యావరణ అనుకూలమైన, ఇంధన–సమర్థవంతమైన ప్రమాణాలను నెలకొల్పడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి బీఈఈ కార్యక్రమాలు ఉపయుక్తం కానున్నాయి.

అంతేకాకుండా.. రాజధాని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా.. అంతర్జాతీయ ప్రాముఖ్యతని సంతరించుకునేందుకు అమరావతికి అపారమైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. కాప్‌26లో ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో విద్యుత్‌ వినియోగం, ఆర్థిక వ్యవస్థని ప్రోత్సహించేందుకు 2021 నవంబర్‌లో మిషన్‌లైఫ్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో పర్యావరణాన్ని పునర్నిర్మించేందుకు మిషన్‌లైఫ్‌ కార్యక్రమాన్ని విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తోందని బీఈఈ సెక్రటరీ తెలిపారు.

అన్నింటా అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

ఎల్‌ఈడీ స్ట్రీట్‌ లైటింగ్‌ ప్రాజెక్టు, ఉజాలా పథకం అమలు, ఇంధన పొదుపుని ప్రోత్సహించేలా వ్యవసాయ పంపులు, ఫ్యాన్‌లని ప్రోత్సహిస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల నిర్వహణకు గానూ అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు 2016-17 ప్రపంచ బ్యాంక్ టాప్ ర్యాంకింగ్ సాధించడంతో పాటు 2015,2016,2017 లో జాతీయ అవార్డులు రావడం అభినందనీయం.

తదనంతరం ఈ రంగంలో రాష్ట్రపతి అవార్డు కూడా సాధించడం కూడా మంచి పరిణామమని మిలింద్ దేవ్ రా అభినందించారు. 2014 నుంచి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంపొందించడంలో రాష్ట్రం కీలకంగా ఉందన్నారు. మిషన్‌ లైఫ్‌లో భాగంగా ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా.. ఇంధన పొదుపు ప్రయత్నాలు ఏపీలో మరింత బలోపేతం కానున్నాయని నొక్కివక్కాణించారు.

పర్యావరణ స్పృహతో కూడిన జీవనశైలిని ప్రోత్సహిస్తూ, రాష్ట్ర ఇంధన భద్రత, పెట్టుబడుల ఆకర్షణను పెంపొందిస్తూ.. ఈ పరంపర కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని బీఈఈ కోరింది. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంపూర్ణ మద్దతుని రాష్ట్రం అందిస్తోందని బీఈఈ సెక్రటరీ ధృవీకరించారు.

60 క్లస్టర్లలో వడ్డీ రాయితీ పథకాలు..

ఇంధన పొదుపుని దేశంలోని అన్ని రాష్ట్రాలు, నగరాలు అవలంబించేందుకు బీఈఈ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫార్మా, కెమికల్స్‌ ఫౌండ్రీ టెక్స్‌టైల్, ఫోర్జింగ్, బ్రిక్స్, పేపర్, రిఫ్రాక్టరీ మొదలైన 60 క్లస్టర్లలో వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయనుంది. కొన్ని దక్షిణాది రాష్ట్రాల క్లస్టర్‌లను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.

బీఈఈ ఈ తరహాలో ఎస్‌డీఏ కార్యక్రమాల్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఫౌండ్రీ, ఫోర్జింగ్, స్టీల్‌ రీ రోలింగ్, పేపర్‌ రంగాల్లో బీఈఈ ఇంధన పొదుపు కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయి. దేశంలోని కీలక రాష్ట్రాలతో పాటు.. అత్యంత అనుకూలమైన.. ప్రోత్సాహకర ప్రభుత్వంగా పేరొందిన ఏపీ.. ఈ విభాగంలో ప్రధాన పాత్ర పోషించి.. ఇంధన సామర్థ్యంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలుస్తుందని బీఈఈ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ తరహా ప్రాజెక్టులు సమర్థవంతంగా విజయవంతమవ్వడంతో.. మరింత చురుగ్గా వ్యవహరిస్తూ.. ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పన, జీవన ప్రమాణాల్ని పెంపొందించడం, భావితరాలకు పర్యావరణ, సహజ వననుల్ని సంరక్షించి.. వాతావరణ మార్పుల్ని పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం గ్లోబల్‌ రోడ్‌మ్యాప్‌ రూపొందించేందుకు బీఈఈ సంపూర్ణ సహకారం అందించనుంది.

– ఎ.చంద్రశేఖర్‌రెడ్డి
(బీఈఈ సదరన్‌ స్టేట్స్‌/యూటీ సలహాదారు)

LEAVE A RESPONSE