– కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
భీమవరం : రాష్ట్రంలో ఉన్న ‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌పై పారిశ్రామికవేత్తలకు పూర్తి నమ్మకం ఏర్పడటం వల్లే విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో ఊహించిన దాని కంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలోని బిజెపి కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖలో నిర్వహించిన 30వ సీఐఐ సమ్మిట్ భారీ విజయవంతమైందని, 12 రంగాలలో రూ. 13 లక్షల కోట్లకు పైగా భారీ పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి 613 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకున్నారని తెలిపారు.
ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 16 లక్షల 25 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అత్యధికంగా ఇంధన రంగం, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని విధాలా సహకరిస్తున్నారని, మౌలిక సదుపాయాల కల్పనకు లక్షలాది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారని కేంద్రమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే కూటమి ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని మొదటినుంచి తాము చెప్పామని, ఇప్పుడు అదే జరుగుతొందని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, యూఏఈ, లండన్ వంటి దేశాల్లో, మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం ఫలించిందని తెలిపారు. గత ప్రభుత్వ వైఖరితో రాష్ట్రం నుండి తరలివెళ్లిన పరిశ్రమలు కూడా తిరిగి వస్తామని ఎంఓయూలు చేసుకున్నాయని శ్రీనివాస వర్మ వెల్లడించారు.
ఉక్కు రంగంలో భారీ వృద్ధి, ఉపాధి అవకాశాలు
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉక్కు శాఖలో రాష్ట్రానికి పెద్ద పీట లభించిందని శ్రీనివాస వర్మ సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాట పట్టించేందుకు కేంద్రం నుండి 11,500 కోట్ల భారీ ప్యాకేజీ సాధించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనకాపల్లి జిల్లా ముతుకూరు వద్ద సుమారు రూ. 1.4 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది అని, విజయనగరం జిల్లా గుర్ల మండలం, కెళ్లా గ్రామంలో రూ. 8,570.50 కోట్ల వ్యయంతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను నిర్మించేందుకు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు.
ఈ ప్లాంట్ల ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి పెంచేందుకు దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దేశ జిడిపిలో ఉక్కు ఉత్పత్తి కీలకంగా వ్యవహరిస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు అధిక ప్రాధాన్య ఇస్తున్నారని ఆయన తెలిపారు.
విశాఖ డేటా సెంటర్లకు, ఏఐ టెక్నాలజీస్‌కు కేంద్రం
విశాఖపట్నం త్వరలో డేటా సెంటర్లకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీస్‌కు కేంద్రంగా రూపుదిద్దుకోనుందని మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. మొత్తం రూ. 3.53 లక్షల కోట్లు రూపాయల పెట్టుబడులతో ప్రముఖ కంపెనీలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడి ₹1.33 లక్షల కోట్లు, రిలయన్స్ 1000 మెగావాట్ల (ఎండబ్ల్యూ) అధునాతన డేటా సెంటర్ ₹ 1.10 లక్షల కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ 1000 మెగావాట్ల (ఎండబ్ల్యూ) డేటా సెంటర్ ₹ 1.10 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నెలకొల్పనున్నారు అని ఆయన అన్నారు. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ, పునరుత్పాదక శక్తి రంగాలలో గణనీయమైన వృద్ధికి దోహదపడతాయి శ్రీనివాస వర్మ అన్నారు