– జనసేన నేతపై చేయి చేసుకోవడానికి సీరియస్ గా పరిగణించిన కమిషన్
– సుమోటోగా కేసు నమోదు
– సీఐ తో పాటు ఐదు మందికి నోటీసులు జారీ
తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తికి చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్ పై మానవ హక్కుల కమిషన్ సీరియస్. జనసేన పార్టీకి చెందిన నేతపై తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చేతితో కొట్టిన ఘటన గత బుధవారం చోటుచేసుకున్న సంగతి విధితమే.జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారు దుమారం సృష్టించారు.
వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇందుకు ప్రతిగా శ్రీకాళహస్తిలో బుధవారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కళ్యాణ మండపం సమీపంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టె సాయి మహేష్‌తో పాటు ఇతర నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమయ్యారు.
పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకుని నాయకులందరినీ బలవంతంగా టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో టౌన్ సీఐ అంజుయాదవ్ జనసేన నాయకుడు సాయిపై అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె రెండు చెంపల మీద కొట్టింది.
ఈ ఆకస్మిక పరిణామంతో బిత్తరపోయిన జనసేన నాయకులు సిఐ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో పలువురు జనసేన నాయకులపై టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను వివిధ దిన పత్రికలో ప్రచురించబడిన ఫోటోలను మానవ హక్కుల సంఘం పరిశీలించి సుమోటో కేసుగా నమోచేసింది. ఇందుకు సంబంధించి ప్రతివాదులైన ఐదు మందికి నోటీసులు జారీ చేశారు. ఈనెల 27 వ తేదీలోగా అందుకు సమాధానం ఇవ్వాలని అందులో ఆదేశించారు.