September 30, 2026

అమరావతిని నేను వ్యతిరేకించడం లేదు

  • రాజధానిని మార్చాలనుకోవడం అజ్ఞానం
  • విలాసవంతమైన భవనాలకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టవద్దు
  • మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టండి
  • విలాసవంతమైన భవనాలకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టవద్దు
  • వేల కోట్లు అప్పులు తెచ్చిదానిని ఉత్తరాంధ్ర, సీమ ప్రజల మీద భారం మోపడం సమంజసం కాదు
  • పాస్టర్ ల మీద జగన్ కన్నా, చంద్రబాబుకు వారిపై ప్రేమ ఎక్కువైంది
  • ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి
  • సిగ్గులేని పార్టీ వైసీపీ
  • మతం మారినా క్యాస్టిజాన్ని ఎందుకు తీసుకువెళుతున్నారు?
  • సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే పార్టీ నాశనం
  • చంద్రబాబూ, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ మహా నటులే
  • 12 ఏళ్ళలో గ్రీన్ ఫీల్డ్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటైనా తెచ్చారా?
  • కుల పిచ్చి, మత పిచ్చి పార్టీలకు ఓటు వేయాలా?
  • “గీతం”పై చంద్రబాబుకు అంత ప్రేమ ఎందుకు?
  • కాంగ్రెస్ కు మద్దతివ్వడం అంటే.. వైసీపీది సిగ్గులేనితనం
  • ఉత్తరాంధ్ర నుంచే పాదయాత్ర ప్రారంభిస్తా
    -మాజీ ఎంపి వేణుంబాక విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: కొత్తగా పెట్టబోయే తమ పార్టీ అమరావతిని వ్యతిరేకించడం లేదు. ఈ సమయంలో వ్యతిరేకించడం మూర్ఖత్వం. అయితే వృధా ఖర్చులతో ప్రజా ధనం దుబారా చేయకూడదన్నదే తమ వాదన అని మాజీ ఎంపి వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. టీడీపీ, వైసీపీ రెండూ కుటుంబపార్టీలేనని, చంద్రబాబు తన కొడుకు లోకేష్‌ను సీఎం చేయాలని.. జగన్‌కు తన కుటుంబసభ్యులకు పగ్గాలివ్వాలన్న తపన తప్ప ఎవరికీ రాష్ట్రంపై ప్రేమ లేదన్నారు.

ఉత్తరాంధ్రకు రెండు కుటుంబపార్టీలు అన్యాయం చేశాయన్న ఆయన, తాను ఉత్తరాంధ్ర నుంచే పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు తనను వాడుకుని, అధికారం వచ్చిన మూడు నెలలోనే కూరలో కరివేపాకులా వాడుకుని పక్కనపెట్టారన్నారు. వైసీపీని సజ్జల నాశనం చేస్తున్నారని, తనపై కుట్రలు చేసి బయటకు పోయేలా చేసిన సజ్జల ఇంతకింత అనుభవిస్తారని శపించారు. విశాఖలో గీతం అక్రమాలకు చంద్రబాబు ఎందుకు కొమ్ముకాస్తున్నారని ప్రశ్నించారు.

వేణుంబాక విజయ సాయి రెడ్డి ప్రెస్ మీట్ లో ఇంకా ఏమన్నారంటే…వైసీపీ, టీడీపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్రాన్ని అడగవు. ఈ రెండు కుటుంబ పార్టీలు. విభజన హామీలను నెరవేర్చకపోయినా, కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, ఈ రెండు కుటుంబాలు కేంద్రాన్ని అడగవు. రెండు పార్టీలవారూ మాట్లాడరు. విభజన చట్టంలో పేర్కొన్నట్టు.. ఉత్తరాంధ్రకు, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వడం లేదు కానీ, కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించడానికి టీడీపీ సదా సిద్ధంగా ఉంది. పదవులు అనుభవిస్తున్నారు తప్పితే.. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సినవి తీసుకురావడం లేదు.

ఈ రెండు పార్టీలు..2029 ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ ఎన్డీఏతో, వైసీపీ ఇండి కూటమితో పొత్తులు పెట్టుకుని జత కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. వారికి సిద్ధాంతాలు లేవు, పదవులే ముఖ్యం. చంద్రబాబుక, తన కొడుకును ఎలా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నదే లక్ష్యం. జగన్ మోహన్ రెడ్డికి కూడా, తన తదనంతరం తన కుటుంబ సభ్యులను ఎలా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నదే లక్ష్యం. అంతేకానీ, రాష్ట్ర అభివృద్ధి వీరికి పట్టదు. గత 12 ఏళ్ళలో వైఎస్ఆర్సీపీ, కూటమి పాలనలో… గ్రీన్ ఫీల్డ్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటి కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు.

గడిచిన 12 ఏళ్ళలో రూ. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు గానీ రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం ఖర్చు పెట్టలేదు. గత 12 ఏళ్ళలో ఈ రెండు కుటుంబాలు సాధించింది ఏదైనా ఉందంటే- 64 లక్షల మంది నిరుద్యోగులను తయారు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ఈ రెండు పార్టీలు విఫలం అయ్యాయి. విశాఖలో డేటా సెంటర్ పై క్రెడిట్ కోసం.. రెండు పార్టీలు పోటీ పడుతూ డబ్బా కొట్టుకుంటున్నాయే గానీ, ఇక్కడ పారిశ్రామికాభివృద్ధికి మాత్రం పాటు పడింది లేదు. వీరి స్వార్థానికి, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారు.

ఏ రాయి అయితేనేమీ.. పళ్ళు ఊడగొట్టుకోవడానికి అన్నట్టు.. వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరుల్ని రెండు పార్టీలూ దోచుకుంటున్నాయి. ఈ పరిస్థితులు చూశాకైనా.. ఇక ఈ రాష్ట్ర యువతే తమ భవిష్యత్తును నిర్దేశించుకోవాలి. కుల పిచ్చి, మత పిచ్చి పార్టీలకు ఓటు వేయాలా.. వద్దా.. అన్నది. ఈ రెండు పార్టీలను ఓడించడానికి, యువతరం కదిలి రావాలి. గళం విప్పాలి. యువతరం నుంచే ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ముఖ్యమంత్రులు రావాలి. యువత కోరుకున్న సమ సమాజ స్థాపన జరగాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి.

రాష్ట్రంలో ఇంతవరకు అధికారానికి దూరమైన సామాజికవర్గాలు అధికారంలోకి రావాలి. రాష్ట్రంలో రెండు వర్గాలు రాష్ట్ర విభజన నుంచి అధికారాన్ని అనుభవిస్తున్నాయి. విభజన తర్వాత, ఒకటి కమ్మ, రెండు క్రిస్టియన్ సామాజికవర్గాలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నాయి. నేను పెట్టబోయే పార్టీ.. నేను సీఎం అవటానికి కాదు. యువతను అధికారంలోకి తెచ్చేందుకే..

ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా యూనివర్సిటీకి బదులుగా గీతం యూనివర్సిటీని అభివృద్ధి చేయాలనే కాంక్ష చంద్రబాబు నాయుడుకి ఉంది. గతంలో గీతం యూనివర్సిటీ ఛైర్మన్ గా ఉన్న స్వర్గీయ మూర్తి గారు మాట్లాడుతూ.. ఆంధ్రా యూనివర్సిటీ ఒక దయ్యాల కొంప అని చులకనగా మాట్లాడారు. ఇందులో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, కట్టమంచి రామలింగారెడ్డి గారు వంటి ప్రముఖులు యూనివర్సీటీలో వివిధ హోదాల్లో పనిచేశారు. అటువంటి యూనివర్సిటీని దయ్యాల కొంప అని ఎలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గీతం యూనివర్సిటీ జపం చేస్తున్నారో కారణం అందరికీ తెలుసు.

వైఎస్ఆర్సీపీ అధికారంలో నుంచి దిగాక, 54-79 ఎకరాల భూమి, అంటే 5 వేల కోట్ల రూపాయల విలువచేసే భూములను చంద్రబాబు ప్రభుత్వం గీతం యూనివర్సిటీ కు ధారాదత్తం చేసింది నిజం కాదా? ఆ భూమి విలువ రూ. 5 వేల కోట్లు ఉండదు. వెయ్యి కోట్లే నని గీతం ప్రస్తుత ఛైర్మన్, టీడీపీ ఎంపీ భరత్ స్వయంగా చెప్పారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అయితే, వెయ్యి కోట్లకు గాను మీరు ప్రభుత్వానికి ఎంత కట్టారని ప్రశ్నిస్తున్నా.

రాష్ట్ర విభజనకు కారకులైనవారు కాంగ్రెస్ వారు, దేశ విభజనకు కారకులైన వారు కాంగ్రెస్ వారు, జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టింది కాంగ్రెస్ వారు. అలాంటి వారితో పొత్తు పెట్టుకునేందుకు వైసీపీ ఈరోజు ప్రయత్నిస్తుందంటే ఎంత సిగ్గులేని పార్టీనో అర్థం చేసుకోవాలి. జీవితకాలంలో, మరో నూరేళ్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండదు. అటు చంద్రబాబూ, ఇటు జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ మహా నటులే. ఈ రాష్ట్రంలో ఉన్న కోటి 50 లక్షల కుటుంబాలను దోచుకుని, వారి వారసుల గురించి ఆలోచిస్తున్నారే గానీ, రాష్ట్రంలో ఉన్న యువతరం గురించి ఆలోచించడం లేదు. యువతకు రాజకీయ సాధికారత సాధించపెట్టాలన్న ఆలోచన వారికి లేదు.

వైఎస్ఆర్సీపీ- టీడీపీ.. రెండు పార్టీలు ఆయా అంశాలపై నిత్యం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. డీఎస్సీ గానీ, ఏపీపీఎస్సీగానీ, మిగతా అంశాలపైనగానీ.. వీటిపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ డివిజన్ ఆఫ్ పవర్స్ గురించి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పారు. శాంతిభద్రతలు అంటే పోలీసు వ్యవస్థ రాష్ట్ర పరిధిలో ఉంటుంది. అంటే, రాష్ట్రంలోని పోలీసులమీద, ఈ రెండు కుటుంబాలకు నమ్మకం లేదా?, నమ్మకం లేకపోతే శాంతి భద్రతలు, పోలీసు వ్యవస్థను కేంద్రానికి అప్పగించమని కోరుతున్నాను.

విజయవాడ ప్రెస్ మీట్ లో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో 5 అంశాలను చెప్పాను. ఆ తర్వాత అనంతపురంలో మరో 5 అంశాలను చెప్పాను. ఇక్కడ మరో 5 అంశాలు వివరిస్తాను. అవి ఏమిటంటే..

1-సీఆర్డీఏ పరిధిలోని- అమరావతిని నేను వ్యతిరేకించడం లేదు. అమరావతి సరైన రాజధానా? కాదా? అనేది ఇప్పుడు అప్రస్తుతం. అమరావతి రాజధానిపై దాదాపు రూ. 70 వేల కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టాం. ఇంకా, రాజధానిపై పునరాలోచించడం అవివేకం.

మన రాజధాని అమరావతి. రాజధానిని మార్చాలనుకోవడం అజ్ఞానం అనేది నా అభిప్రాయం. రాజధాని అమరావతిపై, ఇంకా అప్పులు చేసి అనవసర ఖర్చులు పెట్టవద్దు. మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టండి కానీ, విలాసవంతమైన భవనాలకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టవద్దు. అన్ని కులాలు, మతాలు, మల్టీ ఎథికల్ సొసైటీగా అమరావతిని మార్చండి.. అన్నదే నా ఉద్దేశం. వేల కోట్లు అప్పులు తెచ్చి, దానిని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల మీద భారం మోపడం సమంజసం కాదు.

జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నారు. అది చేయలేదు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అది మావిగన్ కాదు. మాయదారి గన్ కాదు. అయిపోయిందేదో అయిపోయింది. ఊరంతా ఒక దారి అన్నట్టు.. వైసీపీ మావిగన్ తీసుకొచ్చింది.చంద్రబాబు అమరావతి మీద ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి, యూటర్న్ తీసుకుని వెనక్కి తగ్గారు. ఈ పరిస్థితులకు వైసీపీ ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.

విశాఖపట్నాన్ని.. మన దేశ ఆర్థిక రాజధాని బొంబాయి తరహాలో అభివృద్ధి చేయాలి. అంత పొటెన్షియాలిటీ ఉన్న నగరం విశాఖ. ఈ రెండు కుటుంబాలు విశాఖకు, చేసింది ఏమీ లేదు. వైజాగ్ ను రాజధానిగా చేస్తామని చెప్పి మాట తప్పింది వైసీపీ.యూ టర్న్ తీసుకుని, మావిగన్ అని, మాయదారి గన్ అని మాట్లాడారు.

ఉత్తరాంధ్ర రీజినల్ డెవలప్ మెంట్ అథారిటీ అనేది మన పార్టీ అధికారంలోకి వస్తే.. ఏర్పాటు చేస్తాం. ఉద్దానం కు తాగు నీరు తెచ్చి కిడ్నీ సమస్యను పరిష్కరిస్తాం. గోదావరి నుంచి సముద్రంలో కలిసే 4 వేల టీఎంసీలను ఉత్తరాంధ్రకు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతం ఉన్న 1200 టీఎంసీలను 3000 టీఎంసీలకు పెంచి రాష్ట్రంలోని ప్రతి ఎకరాను సస్యశ్యామలం చేయడమే మన ప్రభుత్వం లక్ష్యం.

ఏజెన్సీలో మైనింగ్ ను నిషేధిస్తాం. భారతదేశంలో మన సంస్కృతిని నాశనం చేసేందుకు, ఆదివాసీలను మత మార్పిడులతో ఎవరైతే ప్రలోభాలకు గురి చేస్తున్నారో, బలవంతంగా మత మార్పిడులు చేశారో.. వారందర్నీ తిరిగి వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తాం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదు అన్న హామీ కేంద్రం ఇప్పటి వరకూ ఇవ్వలేదు. చిత్తశుద్ధి లేని రెండు కుటుంబ పార్టీలు ఆ వైపు ఎటువంటి ప్రయత్నమూ చేయడం లేదు. మూసివేసిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉంది.రాయలసీమ రీజినల్ డెవలప్ మెంటు అథారిటీ ఏర్పాటు చేసి, ఏడాదికి రూ. 12 వేల కోట్లు అదనంగా స్పెషల్ గ్రాంటు ఏర్పాటు చేస్తాం. 5 ఏళ్ళు అమలు చేస్తాం.

ఉత్తరాంధ్ర, రాయలసీమ.. మిగతా ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేస్తాం. రాయలసీమలో కనీసం 50 టీఎంసీల సామర్థ్యం నిల్వ చేసే పరిస్థితి లేదు. ఉత్తరాంధ్రలో 25 టీఎంసీల నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు లేవు. అందుకే, గోదావరి నుంచి సముద్రంలో వృథాగా కలిసే నీటిలో, మన ప్రభుత్వం వచ్చాక, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇతర పథకాల ద్వారా.. 600 టీఎంసీలను ఉత్తరాంధ్రకు తీసుకొస్తాం. ఉత్తరాంధ్రకు 600 టీఎంసీలు, రాయలసీమకు కనీసం 1000 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు నిర్మిస్తాం.

సర్.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. భారతీయ పౌరులు ఓట్లు తొలగిస్తున్నారని కొన్ని పార్టీలు హడావిడి చేస్తున్నాయి. నిజమైన వారివా..లేక.. బంగ్లా.. బర్మా.. పాకిస్తాన్ వాళ్ళవి తొలగిస్తున్నారా..? అన్నది ఆలోచించాలి. విదేశీ పౌరులు ఇక్కడ ఉంటే, భారతీయ పౌరసత్వం లేకున్నా కూడా వారి ఓట్లు తీయకూడదని కాంగ్రెస్ మాట్లాడుతుంది. దీనికి వైసీపీ మద్దతు ఇవ్వడం అవివేకం.

ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ వాదనకు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కూడా సర్ విషయంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ చేస్తున్నది తప్పు అని మాట్లాడుతున్నాడు. టీడీపీకి, వైసీపీకి ఏమైంది? వీరికి జాతీయతా భావం లోపించిందా? దేశం పట్ల గౌరవం, భక్తి వారికి లేవు. భారతీయ పౌరులకు ఓటు ఉండాలి. కానీ, భారతీయ పౌరసత్వం లేని వారికి ఓటు ఉండాలని వాదించడం అవివేకం. యువతరాన్ని ఉత్తేజపరిచే ఉద్దేశంతో నా పాదయాత్ర ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభిస్తాను.

నన్ను మొదటి 3 నెలల్లోనే పక్కన పెట్టారు

మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడతారని నమ్మకం ఉంటేనే.. మీరు ఓటెయ్యండి లేకపోతే ఓటు వేయవద్దు.ఆంధ్రప్రదేశ్ లో 6 ఏళ్ళలో 4 శాతం మత మార్పిడులు పెరిగాయన్నది అధికారిక గణాంకాల ద్వారానే చెప్పాను. 2019-2024 వరకు ఢిల్లీ వ్యవహారాలు నేను చూశాను. సీఎంవోలో నేను చక్రం తిప్పానని అంటే అది అవాస్తవం. అధికారంలోకి వచ్చే వరకే నన్ను వాడుకున్నారు. ఆ తర్వాత కూరలో కరివేపాకులా నన్ను తీసేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు, సీఎంవోలో జరిగిన విషయాలకు నాకు సంబంధం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, సీఎంవోలో నేను జీరోనే.

విశాఖలో ఒక ఫ్లాటు తప్ప నాకు సెంటు భూమి లేదు. ఉత్తరాంధ్ర ఇన్ చార్జీగా ఉండగా, నేను ఎవరినీ చేయి చాచి ఒక్క రూపాయి కూడా అడగలేదు. జీవీఎంసీ ఎన్నికల్లో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. నేను జీవీఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపించాను. ఈరోజు స్థానిక నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. వారిని జీవీఎంసీ ఎన్నికల్లో చేతనమైతే ఆ పార్టీ వారిని గెలిపించమనండి.

నాకు ఒక్కతే కుమార్తె, నా కుమార్తె అరబిందో కుటుంబం కోడలు. 25 ఏళ్ళ ముందే స్థాపించిన సంస్థ అరబిందో. ఉత్తరాంధ్రలో వారికి 9 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వారు సంస్థ కోసం కొనుగోలు చేసిన ఆ భూములన్నీ నావే, నేనే కొన్నాను అని అప్పట్లో వైఎస్ఆర్సీపీ దొంగ నాయకులు నా మీద దుష్ప్రచారం చేసి, ఆ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డికి చెప్పి నన్ను బయటకు పంపారు. ఆ ఫలితాన్ని ఈరోజు ఆ పార్టీ అనుభవిస్తుంది.

మద్యం కేసుకు సంబంధించి..నా పాత్ర లేనేలేదు. అధికారంవచ్చాక, నన్ను మొదటి 3 నెలల్లోనే పక్కన పెట్టారు. మద్యం స్కాంకు కర్త, కర్మ, క్రియ.. అన్నీ రాజ్ కెసిరెడ్డే. ఎవరైనా నా పేరు చెబితే.. నన్ను ఇరికించే ప్రయత్నమే తప్ప.. మరొకటి కాదు. అధికారం వచ్చాక, నన్ను బలి పశువును చేశారు. వైసీపీ కోసం అహర్నిశలు కృషి చేసిన నన్ను, నేను విశాఖలో భూ దందాలు చేశానని, స్థానిక నాయకులతో కుమ్మక్కై సజ్జల రామకృష్ణారెడ్డి నాపై దుష్ప్రచారం చేయించారు. ఆయన కర్మకు ఆయనే పోతాడు. ఆయన వల్లే పార్టీ నాశనమవుతుంది. ఒక వ్యక్తి వల్ల, ఆయన స్వార్థానికి ఒక పార్టీ నాశనమవుతుందంటే బాధే తప్ప మరొకటి కాదు.

ఎవరైనా, మతం మారితే.. ఎస్సీలుగానీ, ఇతర సామాజిక వర్గమైనా.. రిజర్వేషన్లు వర్తించవని నేను కాదు.. సుప్రీం కోర్టు చెప్పింది. రెడ్డి క్రైస్తవుడిగా మారి క్రైస్తవ రెడ్డి అవుతున్నారు,అలానే కమ్మ, కాపులు జార్జి నాయుడు, మరో నాయుడు అవుతున్నారు. మతం మారినా క్యాస్టిజాన్ని ఎందుకు తీసుకువెళుతున్నారు?. రెడ్డి గానీ, కమ్మ గానీ, కాపు గానీ క్షత్రియులు గానీ క్రిస్టియన్ గా మారితే వారి కులం పోతుంది అనేది నా అభిప్రాయం.

జగన్ కి ఫాస్టర్ల మీద ఉన్న ప్రేమ కన్నా, చంద్రబాబుకు వారిపై ప్రేమ ఎక్కువైంది. చంద్రబాబుకు ఆ అధికారం ఎవరిచ్చారు?. ప్రజల సొమ్మును, మీరు మత విశ్వాసాల కోసం, వారి ఓట్ల కోసం ఖర్చు పెట్టే అధికారం మీకు ఎరవిచ్చారు? ప్రజల సొమ్మును మతం కోసం, కులం కోసం ఖర్చు చేయడం తప్పు.

Total Visitors: 2,830,253