– సీఎం రేవంత్ సవాల్ కు కేటీఆర్ సై
హైదరాబాద్: మూసీ పక్కన మూడు నెలలు ఉండేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడె ంట్ కేటీఆర్, సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌కు ప్రతిసవాల్ విసిరారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని అన్నారు.
కేటీఆర్, హరీశ్ రావు మూడు నెలల పాటు మూసీ పరీవాహక ప్రాంతంలో ఉండాలని, అక్కడ ఉంటే కనుక వారు చెప్పినట్లు తాను నడుచుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారికి అక్కడ భోజన సదుపాయాలు కల్పించాలని, అద్దె కూడా తానే చెల్లిస్తానన్న విషయం తెలిసిందే. ఈ సవాల్‌ను కేటీఆర్ స్వీకరించారు.
నాగోల్‌లోని మురుగు శుద్ధి కేంద్రాన్ని మాజీ మంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాడు రూ.386 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం 31 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించేందుకు సిద్ధమైందన్నారు. వారసత్వ సంపదలను కాపాడుతూనే అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని పేర్కొన్నారు. రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిలు నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
మూసీ నిర్వాసితులకు ఇస్తున్న ఇళ్లు కూడా కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లే అన్నారు. మూసీ పక్కన మూడు నెలల పాటు ఉండాలని తనకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారని, ఆయన సవాల్‌కు తాను సిద్ధమే అన్నారు. దమ్ముంటే మూసీ నది లోతు పెంచి, కోల్‌కతా వంటి నగర నిర్మాణం చేయాలన్నారు. మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారి తరఫున న్యాయపోరాటం చేస్తామన్నారు.మరి రేవంత్ సవాల్‌ను కేటీఆర్ స్వీకరించిన నేపథ్యంలో సీఎం రేవంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.