– పదేళ్లు ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్ కే ఉంటుంది
– కొడంగల్ నివాసంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్” జిల్లా సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కొడంగల్: వచ్చే పదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మేరకు తనకు కొడంగల్ ప్రజలు బలమివ్వాలని అభ్యర్ధించారు. నేను రాష్ట్రాన్ని చూసుకుంటా. ఇక్కడ కొడంగల్‌ను కంచె వేసుకుని కాపాడుకునే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు. మరో పదేళ్లు ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్‌లోనే ఉంటుంది. పదేళ్లలో కొడంగల్ అభివృద్ధి కావాలి. ఎకరం కోటిరూపాయల ధర పలకాలి అని పిలుపునిచ్చారు.
రేవంత్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. అమిత్ షా పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడారు. మహాత్మా గాంధీని చంపినవారిని ప్రోత్సహించేలా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయి.అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించడం వల్లే దేశంలో సామాజిక పరివర్తన జరిగింది.ప్రజలు కనిపించని దేవుడిగా అంబేద్కర్ ను కొలుస్తున్నారు.ప్రతీ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుని ఆయనను ఆరాధిస్తున్నారు.
అలాంటి మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతీ చోట సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతున్నాం.ముఖ్యమంత్రిగా నాకు ఈ బలం… ఈ శక్తి మీరిచ్చింది.అసెంబ్లీకి వస్తే వినాల్సి వస్తుందని, వింటే పడాల్సి వస్తుందని కేసీఆర్ రావడంలేదు. వచ్చినవాళ్లకు ఓనమాలు కూడా రావు. చెప్పినా నేర్చుకోరు.సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు ఉండాల్సిన అధికారం కొడంగల్ కు పోయిందని వాళ్లకు దుఃఖం.
అందుకే కొడంగల్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారు. రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. కొడంగల్ ను కంచె వేసుకుని కాపాడుకునే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు. పదేళ్లు ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్ కే ఉంటుంది. పదేళ్లలో కొడంగల్ ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ కొంతమందిని రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని, భూసేకరణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు అక్కడ ఏర్పాటు చేసే కంపెనీల్లో ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది.పరిశ్రమలు మన దగ్గర లేకపోవడం వల్లే మన ప్రాంత ప్రజలు వలసలు వెళుతున్నారు. ఇక్కడకు పరిశ్రమలు వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మీ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చి మీ కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా తాపత్రయం.
వచ్చే ఐదేళ్లలో మరో పదివేల కోట్లతో కొడంగల్ ను అద్దంలా తీర్చిదిద్దాలన్నది నా కోరిక, మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు.నాయకుడిగా మీ ప్రేమ నాకు చాలు. డీజిల్ కు పైసలు వసూలు చేసినవాళ్లు ఇవాళ కొడంగల్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే అందరం మునిగిపోతాం.కొడంగల్ భూముల విలువ ఎకరానికి కోటి పెరగాలంటే ఇక్కడ అభివృద్ధి జరగాలి. అభివృద్ధికి అడ్డుపడి ఆపాలని చూసే ఇంటి దొంగలను కొడంగల్ ప్రజలు వదలరు.