Suryaa.co.in

Andhra Pradesh

అగ్రి గోల్డ్ భూములను స్వాహా చేసిన వారెందరో..

  • వారందరినీ ఈ ప్రభుత్వం పట్టుకుంటుందని ఆశిస్తున్నా
  • జోగి రమేష్ ఒక్కడే కాదు… సొంతానికి అగ్రిగోల్డ్ భూములు కాజేసిన వారి జాబితా పెద్దదే
  • గతంలో సిఐడి లో ఉన్నతాధికారిగా పని చేసిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, షాద్ నగర్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సాక్షాధారాలున్నాయి
  • పోలీసుల సహకారంతోనే గంజాయి సరఫరా
  • ఉండి ప్రాంతంలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక ప్రైవేటు టీముల ఏర్పాటు
  • ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

ఉండి: సొంతానికి అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేసిన వారి జాబితా పెద్దదిగానే ఉంటుందని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అగ్రిగోల్డ్ భూములను కాజేసిన రాజకీయ నాయకులతో సహా అధికారులందరినీ ఒకరి తరువాత మరొకరిని ఈ ప్రభుత్వం అదుపులోకి తీసుకొని శిక్షిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. అగ్రి గోల్డ్ భూములను స్వాహా చేసిన వారిలో మాజీ మంత్రి జోగి రమేష్ ఒక్కడే కాదని, ఎంతోమంది రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నారన్నారు.

గత ప్రభుత్వ హయాంలో సిఐడి విభాగంలో ఉన్నతాధికారి గా పనిచేసిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి, షాద్ నగర్ ప్రాంతంలో అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసిన వ్యక్తితో , సేల్ డీడ్ క్యాన్సల్ చేయిస్తానని బెదిరించి, అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను దండుకున్నట్లుగా సాక్ష్యధారాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ భూముల అమ్మకాలలో చోటు చేసుకున్న అక్రమాలను బయటకు రావాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ గతంలో, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు వాగారని విమర్శించారు. నా గురించి అసెంబ్లీలోనే వరస్ట్ గా మాట్లాడితే, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముసిముసిగా నవ్వుకున్నారు. నన్ను లుచ్చా అన్నందుకు అచ్చా అని మంత్రి పదవి ఇచ్చారు.

మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని జోగి రమేష్, ఆయన తనయుడు అగ్రిగోల్డ్ భూములను కాజేశారు. జోగి రమేష్ భార్య ఏడుస్తుంటే బాధనిపించిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఊర్లో వాళ్లంతా వారిని వెధవలు అని తిట్టిపోసిన ప్రతి భార్య కు.. తన భర్త, కుమారుడు మంచివారిగానే కనిపిస్తారని, అది తల్లి మనసు గొప్పతనం అని పేర్కొన్నారు.

ఆడుదాం ఆంధ్ర పేరిట అవినీతి నిజమే

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరిట అవినీతి జరిగిన మాట నిజమేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కొనుగోలు చేసిన బ్యాట్లను ముట్టుకుంటేనే విరిగిపోయాయని గుర్తు చేశారు. బ్యాట్ తో బంతిని కొడితే విరిగిపోవడం మాట దేవుడెరుగు… పట్టుకుంటేనే విరిగిపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అప్పట్లోనే నేను రచ్చబండ కార్యక్రమంలో ద్వారా చెప్పానని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రజలందరి చేత ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆటలను ఆడించినట్లుగా దొంగలెక్కలను చూపించారన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలలో ఎక్కడా కూడా క్రీడా ప్రాంగణాలు లేవని, మరి ఎక్కడ ఆడించారని ప్రశ్నించారు. క్రీడా మైదానాలన్నీ పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంటే, ఇప్పుడు వాటిని తొలగించి క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు.

ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మాజీ మంత్రి రోజా, కృష్ణ దాస్ లపై క్రీడా సంఘాల ప్రతినిధులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైన విషయాన్ని విలేకరులు రఘురామ కృష్ణంరాజు దృష్టికి తీసుకువచ్చారు. దానితో ఆడుదాం ఆంధ్ర బడ్జెట్ 100 నుంచి 150 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారని, అందులో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం అంతా ఓ గోల్మాల్ అని పేర్కొన్న ఆయన, ఇందులో ఎవరి పాత్ర ఏమిటి అన్నది తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

పసి పిల్లలపై కూడా గంజాయి మత్తులోనే హత్య, హత్యాచారాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కొంత పోలీసుల సహకారంతోనే గంజాయి సరఫరా జరుగుతోందన్నది నా నిశ్చితాభిప్రాయమని తెలిపారు. స్కూళ్ల వద్ద బడ్డీ కొట్టులు ఏర్పాటుచేసి, ఆ బడ్డి కొట్టు ల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE