– రాజధాని పేరుతో వేల కోట్లు అప్పులు
– అమరావతి పేరుతో లక్ష ఎకరాలను సేకరిస్తారా?
– భూములిచ్చిన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు
– హైకోర్టు, శాసనసభ, సచివాలయం నిర్మిస్తే, దాని చుట్టూ రాజధాని అభివృద్ది చెందుతుంది
– ముప్పై ఏళ్ళు అయినా చంద్రబాబు చెబుతున్న హంగులతో కూడిన అమరావతి పూర్తి కాదు
జగన్‌ను జైలుకు పంపేందుకే లిక్కర్ స్కాం సృష్టి
– మెడికల్ కాలేజీలను తీసుకుంటే, మా ప్రభుత్వం వస్తే వాటిని రద్దు చేసి, ప్రభుత్వరంగంలోనే నడుపుతామని చెబితే తప్పా?
– మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
తాడేపల్లి:మేం రాజధాని అమరావతి కాదని ఎప్పుడూ చెప్పలేదు. ఈ రోజు లక్ష కోట్ల రూపాయలను అమరావతి కోసం ఖర్చు చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. దీనిలో 52 వేల కోట్ల రూపాయల అప్పు. ఇలా ప్రజాధనం వృధా చేయడం ఎందుకు? గుంటూరు-విజయవాడ మధ్యలో 500 ఎకరాలు తీసుకుంటే రాజధానికి సరిపోతుందని వైయస్ జగన్ చెప్పారు.
రాజధాని పేరుతో వేల కోట్లు అప్పులు తెచ్చి పెడుతున్నారు. ఉన్న ప్రాంతాలను రాజధానులుగా ఎంపిక చేసుకుంటారా? లేక రాజధానిని సృష్టిస్తారా? అమరావతి పేరుతో లక్ష ఎకరాలను సేకరిస్తారా? హైకోర్టు, శాసనసభ, సచివాలయం నిర్మిస్తే, దాని చుట్టూ రాజధాని అభివృద్ది చెందుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడుతుంటే, లక్షల కోట్లు అప్పుల పాలు చేస్తున్నారు.
అమరావతికి భూములిచ్చిన రైతులు నేడు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. చివరికి కొత్తగా వేసిన హైవే రోడ్డును కూడా తవ్వితే కానీ నీరు బయటకు పోలేదు. దీనిని బట్టి అమరావతి ఎంత లోతట్టుప్రాంతమో తెలిసిపోతోంది. అమరావతికి చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పిదం ఇది అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు.
ఈ మూడున్నర ఏళ్ళు కాదు, ముప్పై ఏళ్ళు అయినా చంద్రబాబు చెబుతున్న హంగులతో కూడిన అమరావతి పూర్తి కాదు. అమరావతిని ఒక ఏటిఎంగా చంద్రబాబు మార్చుకున్నాడు. మెబిలైజేషన్ అడ్వన్స్లు ఇవ్వడం, దానిలో కమీషన్లు దండుకుంటున్నారు.
రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా సీఎం చంద్రబాబు అల్లిన కట్టుకథే లిక్కర్ స్కాం. వైయస్ జగన్‌ను అరెస్ట్ చేసి, జైలుకు పంపాలనే నీచమైన ఆలోచనల నుంచి సృష్టించిందే ఈ లిక్కర్ స్కాం. అని మాజీ మంత్రి, అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అల్లిన ఈ కట్టుకథలకు మరికొన్ని పిట్టకథలను జత చేయడమే సిట్ చేస్తున్న పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి అధికారం లోకి రాగానే సీఎంగా చంద్రబాబు అబద్దాల పునాదుల మీద లిక్కర్ స్కాంను ప్రారంభించారని ధ్వజమెత్తారు. రాజకీయంగా చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా, వెంటనే లిక్కర్ స్కాంలో అరెస్ట్‌లు అంటూ ఎల్లో మీడియా ద్వారా హోరెత్తించడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడని అన్నారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎవరైనా ప్రశ్నిస్తే, వారిపై అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై దాదాపు ఎనిమిది వందల కేసులు పెట్టారు. పదుల కొద్ది మందిని జైలుకు పంపారు.
చంద్రబాబు ప్రారంభించిన ఈ లిక్కర్ స్కాం కట్టుకథలో సిట్ ఇప్పటి వరకు కనీసం ఆధారాలను కూడా చూపలేకపోయింది. ఎవరు పడితే వారి ఇళ్ళలో సోదాలు చేయడం, కీలక ఆధారాలు దొరికాయంటూ లీకులు ఇచ్చి, నిరాధారమైన కథనాలను ప్రచారంలోకి తేవడం, బురదచల్లడం సిట్ పనిగా మారింది.
తాజాగా రెండు కంపెనీల అడ్రస్‌లు ఒకే బిల్డింగ్‌లో ఉన్నాయంటూ, కంప్యూటర్లు దొరికాయంటూ, ఫైల్ స్వాధీనం, హార్డ్ డిస్క్‌లు సీజ్ అంటూ విచిత్రమైన కథనాలను రాయించారు. రామోజీ గ్రూపుల్లో సవాలక్ష కంపెనీలు ఉన్నాయి. వీటి ఆఫీసులు ఎక్కడున్నాయి? ఒక వ్యక్తి ఒకటే కంపెనీ నడపాలని రూల్ ఏమైనా ఉందా? కనీస పరిజ్ఞానం లేకుండా ఇలాంటి కథనాలు రాయడం, అదేదో భారీ తప్పిదనం అన్నట్లుగా ప్రచారం చేయడం జరుగుతోంది.
దేశంలో ఏ కంపెనీలోకి వెళ్ళినా కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు, ఫైళ్ళు ఉంటాయి. అవి ఉండటం నేరమా? వాటిల్లో ఏదైనా తప్పు ఉంటే చూపించండి. కొందరు ఉద్యోగుల్ని బెదిరించి వారిచేత వాంగ్మూలాలు తీసుకుని కొంతమందిని అరెస్ట్ చేశారు. వారి ఫోన్‌కాల్ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారో… వారందరినీ పిలిచి విచారించడం, ఇంతకు మించి చేసేదేముందీ? బేవరేజెస్ కార్పోరేషన్‌కు కార్టన్లు సప్లై చేసేవాళ్ళను, లారీలు సప్లై చేసే వారిని, వాటి మెయింటెనెన్స్ చూసేవారిని కూడా చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.
కేసిరెడ్డి అరెస్ట్ నేపథ్యంలో రూ.11 కోట్ల నగదు సీజ్ చేశామని గతంలో వెల్లడించారు. అయితే ఈ సొమ్ము ఎక్కడిదో తేల్చారా అని న్యాయస్థానం ప్రశ్నిస్తే సిట్ అధికారులు తెల్లముఖం వేశారు. తమ కట్టుకథలు న్యాయస్థానం ముందు బయటపడిపోయాయని కంగారు పడ్డారు.
చివరికి న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్ కూడా తప్పులు తకడకగా ఉండటం సిట్ చేస్తున్న దర్యాప్తులోని డొల్లతనంను బయటపెట్టింది. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకుంటూ, వారు ఎవరిపేరు చెబితే వారిని లిక్కర్ స్కాం దోషులుగా చెబుతూ, ఎటువంటి ఆధారాలు లేకపోయినా కూడా అరెస్ట్ చేస్తూ సాగిస్తున్న డ్రామాలు న్యాయస్థానాల ముందు దాగడం లేదు.
మొదట్లో రూ.50 వేల కోట్లు, తరువాత రూ.30 వేల కోట్లు, ఆ తరువాత రూ.18వేల కోట్లు అన్నారు. చివరికి రూ.2000 కోట్ల పైచిలుకు అన్నారు. సీజ్ చేసింది మాత్రం కేవలం రూ.11 కోట్లు. ఈ సొమ్ము కూడా ఎలా వచ్చిందో కూడా చెప్పలేని స్థితిలో సిట్ ఉంది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు. అలా చేయడాన్ని అడ్డుకుంటామని మాజీ సీఎం వైయస్ జగన్ చాలా స్పష్టంగా తమ విధానాన్ని చెప్పారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కొనేవారు తొందరపడి తీసుకుంటే, మా ప్రభుత్వం వస్తే వాటిని రద్దు చేసి, ప్రభుత్వరంగంలోనే నడుపుతామని చెబితే తప్పా?