– చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాకే తెలంగాణలో టిడిపి జెండా పీకేసింది
– చంద్రబాబు చెప్పే అబద్దాలు లై డిటెక్టర్లు కూడా పసిగట్టలేవు
– విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో వైఎస్ఆర్ ఎంపీ ల కృషి ఫలించింది
– ఎగుమతుల్లో ఎగువన ఏపి
-ట్విట్టర్ లో ఎంపి విజయసాయిరెడ్డి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినం నాడైనా చంద్రబాబు ఎన్టీఆర్ కు చేసిన ‘నమ్మక ద్రోహం’పై పశ్చాతాపం వ్యక్తం చేయలేదని వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై శనివారం నాడు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2 రూపాయల కిలో బియ్యం రద్దుపైనా, లిక్కర్ కంపెనీలు విదిలించిన 2 వేల కోట్లకు కక్కుర్తిపడి నిషేధం ఎత్తేయడంపైన జవాబు చెప్పే దమ్ముందా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
తెలంగాణలో టీడీపీని పాతరేసిన చంద్రబాబు ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో విజయోత్సవాలు నిర్వహిస్తారట అని ఎద్దేవా చేశారు. పార్టీ స్థాపించన చోట ఒక్క ఎమ్మెల్యే, కార్పోరేటర్ ఎందుకు గెలవలేక పోయారని చెప్పారు.చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికాకే కదా తెలంగాణాలో టిడిపి జెండా పీకేసిందని ప్రశ్నించారు. 40 ఏళ్లు పూర్తి టీడీపీ మరో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
చంద్రబాబు చెప్పే అబద్ధాలను లై డిటెక్టర్లు కూడా పసిగట్టలేవని చెప్పారు.నంగినంగిగా, నిజాలు తప్ప ఇంకేవీ తెలియవన్నట్టుగా ఉంటాయి దళారి మాటలని మండిపడ్డారు. 240 లిక్కర్ బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు హయాంలో అని అసెంబ్లీ సాక్షిగా జగన్ మోహన్ రెడ్డి ఆధారాలు చూపారని గుర్తు చేశారు. అయినా టిడిపి వాళ్లు పాడిన పాటే పాడుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, పార్టీలు కూడా చూడకుండా అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తోందని ఆయన కొనియాడారు. అదీ కూడా ఏ పథకం.. ఎప్పుడు అమలు చేసేది ముందే ప్రకటిస్తోందని వెల్లడించారు. ఇందులో భాగంగా 2022-23 సంక్షేమ క్యాలెండర్ ను సీఎం జగన్ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఇది పేద వర్గాలకు వెల్ఫేర్ క్యాలెండర్ గా అభివర్ణించిన ఆయన, చంద్రబాబుకు ఫేర్ వెల్ క్యాలెండర్ అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఏడాదంతా సంక్షేమ సంబరం ప్రతి నెలా పండుగ,జగన్ ప్రభుత్వం ఈ సంవత్సరం దాదాపు రూ.55 వేల కోట్లు నేరుగా లబ్ధిదారులకు అందించబోతోందని ఆయన వెల్లడించారు. పరోక్షంగా మరో రూ.17,305 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి వివిధ పథకాలతో కూడిన సంక్షేమ క్యాలెండర్ను సీఎం జగన్ ప్రకటించారని చెప్పారు.
విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు చేసిన కృషి ఫలించిందని ఆయన వెల్లడించారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని చెప్పారు. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి భూమిని కూడా గుర్తించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు రాజ్యసభలో స్పష్టం చేశారని ఆయన వెల్లడించారు..
ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటిందని చెప్పారు. నీతిఆయోగ్ విడుదల చేసిన ఎగుమతుల సంసిద్ధత సూచీ-2021లో మెరుగైన పనితీరుతో ప్రతిభ కనబరిచిందని వెల్లడించారు. 2020లో 20వ స్థానంలో ఉన్న ఏపీ 2021లో 9వ స్థానానికి ఎగబాకిందని చెప్పారు. ఎగుమతుల వృద్ధిలో దేశంలోనే 2వ స్థానం సాధించిందని ఆయన అన్నారు.