– ఈ ప్రభుత్వం రావడంలో నేను కీలక పాత్ర పోషించా
– నాలాగే షాక్ తగిలినా కార్యకర్తలు తట్టుకునే ధైర్యంతో ఉండాలి
– కార్యకర్తలపై జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు ఎత్తివేయాలి
– కాలువలు, డ్రైన్లు, చెరువుల ఆక్రమణలను తొలగిస్తామని మంత్రి నారాయణ పేర్కొనడం హర్షణీయం
– ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు
ఉండి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈనెల 20వ తేదీ నాటికి కొన్ని, దసరా నాటికి పూర్తిగా పంపిణీ చేయనున్నట్లు ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. 15 పదవుల కోసం 30 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
‘‘ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడంలో, ఈ ప్రభుత్వం రావడంలో నేను కీలక పాత్ర పోషించాను. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాకు మంత్రి పదవి వస్తుందని అందరు పేర్కొన్నారు. కానీ నాకు రిక్త హస్తమే మిగిలింది. నాలాగే షాక్ తగిలినా , తట్టుకునే ధైర్యాన్ని కార్యకర్తలు కలిగి ఉండాల’’న్నారు.
కాలువలు, డ్రైన్లు, చెరువులు ఆక్రమణలను తొలగిస్తామని మంత్రి నారాయణ పేర్కొనడం హర్ష ణీ యమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. బుడమేరు ఆక్రమణలను తొలగించి 9000 క్యూసెక్కుల నుంచి 37వేల క్యూసెక్కుల ప్రవాహం ప్రవహించే విధంగా వెడల్పు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారని తెలిపారు.
బుడమేరు వెడల్పు చేసినప్పటికీ, వాటితోపాటు కొల్లేరు, ఉప్పుటేరుల విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. బుడమేరు ప్రవాహాన్ని తగ్గట్టుగా కొల్లేరును, ఉప్పుటేరు సామర్థ్యాన్ని పెంచాలన్నారు. ఉప్పుటేరు సామర్థ్యం పెంచకపోతే సమీప గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, అటవీ సంరక్షణ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. బుడమేరు, తమ్మిలేరు, కొల్లేరు నుంచి ప్రవాహం వచ్చి మన దగ్గర సముద్రంలో కలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి శాశ్వత ముంపు సమస్య పరిష్కారం కోసం సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు.
మూడు నెలల క్రితమే కాలువల ఆక్రమణల ప్రక్షాళన చేపట్టాం
ఉండి నియోజకవర్గ పరిధిలో మూడు నెలల క్రితమే కాలువల ఆక్రమణ ప్రక్షాళన చేపట్టామని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. కాలువల పక్కన ఆక్రమణలను ఉండి, పాముల పర్రు లలో చేపట్టడం జరిగింది. ఉండి, చెరుకువాడ ఆక్రమణలు, ఆకివీడు ఐ భీమవరం రోడ్డు పక్కన కాలువలను 80 శాతం పూడ్చేశారు. అవన్నీ తొలగించాం.
కాలువల ఆక్రమణలను తొలగించాలని చట్టాల్లో ఉన్నప్పటికీ, మంత్రి నారాయణ పేర్కొనడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ఉండి నియోజకవర్గంలో కాలువల ఆక్రమణలను తొలగించడానికి ప్రభుత్వం సహకారం అందించిందన్నారు. కాలువల ఆక్రమణలో ఇల్లు కోల్పోయిన వారికి ఇప్పటికే కొంతమందికి ప్లాట్లు ఇచ్చారని, ఇవ్వని వారికి ప్లాట్లను అందజేస్తామన్నారు. డ్రైనేజీ, పంట కాలువ, మురికి కాలువను హుండీలో ఆక్రమించారన్నారు.
కాలువలను ఆక్రమించే కాంక్రీట్ వాల్ నిర్మించారని, దీంతో 500 ఎకరాలకు నీళ్లు అందడం లేదన్నారు. గత పది ఏళ్లుగా ఇలాగే జరుగుతోందని, దాన్ని తొలగించడం జరిగిందన్నారు. పూర్తిస్థాయి ప్రవాహం వస్తే ఇల్లు మునిగిపోతాయన్నారు. కాలువలను బ్రిటిష్ అధికారులు భవిష్యత్ తరాల కోసం డిజైన్ చేశారన్నారు. చాలాచోట్ల కాలువలు అక్రమనలకు గురికావడం వల్ల ముంపుకు గురికావాల్సి వస్తుందన్నారు.
ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో కాలువలు, డ్రైన్లలో పూడిక తీయడం జరుగుతోందన్నారు. డ్రైన్లలో పూడిక తీస్తామని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. అది కూడా అవసరమైతే తప్పనిసరి పరిస్థితుల్లో మేమే చేపడుతామని తెలిపారు. ముఖ్యమంత్రి ని కలిసినప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు.
డిసెంబర్ నాటికి కాలువలు, డ్రైన్ల ఆక్రమణలను తొలగిస్తాం
ఈ ఏడాది డిసెంబర్ నాటికి కాలువలు, డ్రైన్ల ఆక్రమణలను తొలగిస్తామని రఘు రామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపు పై చర్యలు తీసుకుంటామని ప్రకటించిన మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
ఆకివీడు, భీమవరంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, భీమవరంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు వల్ల ఉండి నియోజకవర్గంలోని 4 మండలాలలో మూడు మండలాలకు అందుబాటులో ఉంటుందన్నారు.
ఆకివీడులో మూడు డయాలసిస్ యంత్రాల ఏర్పాటు ద్వారా మరో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు డోనర్లు ఉన్నారని, ఐఎంఏ అధికారులు ఆపరేషన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉండి నియోజకవర్గం కేంద్రంలో 16 పీహెచ్సీ కేంద్రాలు నిర్మాణ దశ నుంచి నిర్మాణ దశను పూర్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్ఆర్జిఎస్ నిధుల ద్వారా పీహెచ్సీ కేంద్రాలను నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు, ఒకవేళ లక్ష, లక్షన్నర రూపాయలు తక్కువ అయితే స్థానికులే వాటిని సమకూర్చి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రెడీ అయ్యారన్నారు.
పాలకోడేరు, ఉండి, ఆకివీడు, కాళ్ళ పిహెచ్సి కేంద్రాలలో అన్ని మందులు ఉన్నాయన్నారు. రోడ్డు పక్కనే ఉన్న మొదలను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. పరిమళ మంచినీటి పైప్లైన్ త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు.