అసెంబ్లీ నా-జ్ఞాపకాలు
(శ్రీపాద శ్రీనివాస్)
అది 2004..ఏప్రియల్ 14 రాత్రి 10 గంటల సమయం….
విశాఖపట్నం వైపు నుండి తొండంగి.. యు.కొత్తపల్లి.. సామర్లకోట..పెద్దాపురం…గోకవరం మీదుగా ” రాజమండ్రి” చేరుకుంది ” వైఎస్సార్ గారి జైత్ర యాత్ర….
నాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వైఎస్సార్ చేపట్టిన యాత్రే “జైత్ర యాత్ర..
మొత్తం జైత్రయాత్ర నిర్దేశిత లక్ష్యం 5500 కి.మి. 168 అసెంబ్లీ .. 38 పార్లమెంట్ నియోజక వర్గాలను 20 రోజుల్లో కవర్ చేసే విధంగా రూపొందించబడి ” ఏప్రియల్ 5 వ తేదీ, 2004 నాడు తెలంగాణ లోని ” చేవెళ్ల” నుండి ప్రారంభం కాబడింది.
నాటి జైత్రయాత్రలో వైఎస్సార్ గారి టీమ్ లో ఆయన వ్యక్తిగత కార్యదర్శి రవిచంద్ గారితో నేను ఉన్నాను..
అప్పటికే (14.04.2004) రాత్రి పది గంటలు అవ్వడంతో ఎన్నికల నిబంధనల దృష్ట్యా రాజమండ్రిలో ప్రసగించ కుండానే వైఎస్సార్ గారి ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్కడ నుండి అనపర్తి వరకు కేవలం ” అభివాదాలు, సైగలతోనే” ఆయన ప్రచారం ఆ రోజుకి అయ్యింది అనిపించారు.
అనపర్తిలో తగిన పొడినేల దొరక్క పోవడంతో “గొల్లల మామిడాడ” దేవాలయం పక్కన ఒక ఖాళీ స్థలంలో, వైఎస్సార్ తో సహా మా బృందానికి తాత్కాలిక టెంట్స్ వేసి బస కల్పించబడింది…
ఆ రాత్రి అంతా నాలో ఒక కలవరం…సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. దానికి కారణం… రాజమండ్రిలో వైఎస్సార్ గారు ప్రసంగించకుండానే ప్రచారం ముగిసింది.
పార్లమెంట్ కు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గెలుపునకు ఈ సంఘటన ప్రతిబంధకం అవుతుందేమో అని ఒకటే సంకోచం నన్ను దహించి వేసింది. ఎందుకంటే అరుణ్ కుమార్ గారిని అమితంగా అభిమానించే వాడిని నేను.
ఈ సంఘటన కారణంగా వైఎస్సార్ గారి టీమ్ లో నేను బాగా డీలా పడిపోయాను. పైగా అసెంబ్లీకి పోటీపడి ఇప్పటికే రెండుసార్లు అరుణ్ కుమార్ గారు దెబ్బతిన్నారు.
మొదటిసారి అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు కూడా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో ” పి.వి” గారు అరుణ్ కుమార్ గురించి పెద్దగా ప్రస్తావనలు చేయలేదు.
ఆ ఎన్నికల్లో అరుణ్ కుమార్ గారు స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఒకవేళ ” పి.వి” గారు అరుణ్ కుమార్ గారి గురించి ఓ నాలుగు ముక్కలు చెప్పివుంటే దాని ప్రభావం కచ్చితంగా ఎన్నికల ఫలితంపై పడేది.
నెమ్మది నెమ్మదిగా తెల్లవారింది. ఉదయం 7.30 కి (15.04.2004) గొల్లల మామిడాడ నుండి వైఎస్సార్ ఎన్నికల ప్రచార యాత్ర ” జైత్ర యాత్ర” యధావిధిగా ప్రారంభం అయ్యింది….
కానీ నాటి ఆయన బృందంలో సభ్యుడైన నేను మాత్రం కలవరపాటుతో ముభావంగానే ఉన్నాను. రాజమండ్రిలో జరిగిన సంఘటన కారణంగా! ఈ కారణంగా బ్రేక్ ఫాస్ట్.. ఆ తరువాత లంచ్ కూడా సరిగ్గా చేయలేక పోయాను.
ఆ రోజు (15.04.2004) రాత్రి 9 గంటల సమయానికి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు చేరుకుంది జైత్రయాత్ర. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేస్తున్నది వట్టి వసంత్ కుమార్గారు. అక్కడ ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత “చిన్నపాటి విరామంలో” ఓ జర్నలిస్ట్” వైఎస్సార్ గారిని ప్రశ్నించారు
” రాజమండ్రిలో మీరు ప్రసంగం చేయలేదు.. అక్కడ అరుణ్ కుమార్ గారితో పాటు అక్కడ అసెంబ్లీ అభ్యర్థుల విజయంపై ప్రభావం పడబోతోంది” అంటూ…
ఆ పక్కనే వున్న నేను వైఎస్సార్ గారు ఏం చెబుతారో అని నా చెవిని ఆటు వేసాను ఆసక్తితో.
” నా దగ్గర సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి..అంతేకాదు ప్రజల స్పందన చూస్తుంటే కూడా “కోస్తా ప్రాంతంలోనే” అత్యధిక మెజార్టీతో అరుణ్ కుమార్ గారు గెలవబోతున్నారు. అలాగే అసెంబ్లీ అభ్యర్దులు కూడా.. ..” అని వైఎస్సార్ గారు సమాధానం చెప్పారు. వైఎస్సార్ గారి ధీమాతో కూడిన మాటలకు వెంటనే నేను ఊరట చెందాను.
మనసు కుదుటపడటంతో అప్పుడు గుర్తుకు వచ్చింది ఆకలి నాకు… తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని ఆటు ఇటు చూస్తున్నా.
అంత ఆకలిలో కూడా ” వట్టి వసంత్ కుమార్ ” గారి కేసి కాస్తంత గర్వంతో చూసా.. “”/చూశారా అరుణ్ కుమార్ గారి గురించి” వైఎస్సార్ గారు ఏమన్నారో అని అర్దం వచ్చే భావనతో…
ఎందుకంటే అరుణ్ కుమార్ గారి విషయమై “వసంత్ కుమార్” గారికి నాకు మధ్య పరాచికంతో వాదోపవాదాలు చాలా జరుగుతూ ఉండేవి