• గుజ్జుల నర్సయ్య సార్ ఆశయాలను కొనసాగిస్తాం
• నాలాంటి ఎంతోమంది కార్యకర్తలను తయారుచేసిన గొప్ప వ్యక్తి నర్సయ్య సార్
• నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తెగించి సంఘ్ కార్యకలాపాలు కొనసాగించిన ధీశాలి
• గుజ్జుల నర్సయ్య సార్ సంస్మరణ సభలో బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలని ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల నర్సయ్య సార్ తపించేవారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. గుజ్జుల నర్సయ్య సార్ శిష్యుడిగా ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తానని, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు విశ్రమించబోనని ఉద్ఘాటించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధ్యాయ వ్రుత్తిని కొనసాగిస్తూనే సంఘ్ కార్యకలాపాలను విస్తరించేందుకు తెగించి పనిచేశారని కొనియాడారు. గుజ్జుల నర్సయ్య సార్ తనలాంటి ఎంతోమంది కార్యకర్తలను తయారు చేయడమేకాకుండా సమాజానికి స్పూర్తిదాయకమైన సేవలందించారని పేర్కొన్నారు.
ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు గుజ్జుల నర్సయ్య సార్ సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ జీ, ఏబీవీపీ జాతీయ సహ సంఘటన కార్యదర్శి ఎన్.బాలక్రిష్ణాజీ, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు పారుపల్లి శంకర్, వరంగల్ జిల్లా కార్యవాహ పెద్దిరెడ్డి మల్లారెడ్డి, గుజ్జుల నర్సయ్య కుమారుడు గుజ్జుల రఘురాం, ధర్మపత్ని గుజ్జుల రాజ్యలక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ గుజ్జుల నర్సయ్య సార్ తో తనకున్న అనుబంధాన్ని, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అందులోని ముఖ్యాంశాలు…
వరంగల్ సభలో గుజ్జుల నర్సయ్య సార్ ఆశీర్వాదం తీసుకునే అవకాశం వచ్చింది. ప్రతి కార్యకర్త గుజ్జుల నర్సయ్యకు సన్నిహితుడిగా మారారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ, యశ్వంత్ రావులను చూడలేదు. నర్సయ్య సార్ ను చూడగానే వాళ్లే గుర్తుకొస్తారు.
నర్సయ్య సార్ శిష్యుడిని… కమిట్ మెంట్ తో, సిద్ధాంతంతో, క్రమశిక్షణతో సార్ పనిచేసే వారు. ఆయనే మాలోంటి వాళ్లందరికీ మార్గదర్శి. నర్సయ్య సార్ లెక్చరర్ గా పనిచేసినవన్నీ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనే. అయినప్పటికీ తెగించి పనిచేస్తూ సంఘ్ కార్యకలాపాలను విస్తరింపజేసిన ధీశాలి. ఎంతోమంది నాలాంటి కార్యకర్తలను తయారు చేసిన నర్సయ్య సార్ జోలికి రావాలంటేనే నక్సల్స్ కూడా భయపడేవారంటే ఆయన ఎంతటి గొప్పవారో అర్ధం చేసుకోవాలి. సమాజానికి స్పూర్తిదాయకమైన సేవలందించాలని, నేను చనిపోయిన తరువాత కూడా నాపై కాషాయ జెండా కప్పాలని భావించే నాలోంటోళ్లందరికీ ఆదర్శనీయుడు నర్సయ్య సార్…
నర్సయ్య సార్ ప్రసంగాలు ఆలోచింపజేసేవిగా, భావోద్వేగానికి గురయ్యేలా, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేలా ఉండేవి. చిన్న పిల్లలను కూడా ఆప్యాయంగా పిలిచే గొప్ప వ్యక్తి నర్సయ్య సార్. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం. నర్సయ్య సార్ నిత్యం ‘‘తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి… నేను కళ్లారా చూడాలి. దాని కోసమే నేనింకా బతికున్నా’’ అని పదేపదే చెప్పేవారు. మా నర్సయ్య సార్ ఆశయం నెరవేరడానికి, ఆ లక్ష్య సాధన కోసం పనిచేయడానికే సిద్దమైన. కేంద్రంలో మాదిరిగా తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా నేను విశ్రమించబోనని మాట ఇస్తున్నా. నర్సయ్య సార్ ఆశయాలను కొనసాగించడంతోపాటు వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం ప్రకటించాలని కోరుకుంటున్నా. నర్సయ్య సార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.