– కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను కూడా చేస్తా
– కిషన్రెడ్డి వల్లే బీజేపీకి అప్రతిష్ఠ
– నా గెలుపులో రాష్ట్ర పార్టీ నేతల ప్రమేయం లేదు
– గోషామహల్ ప్రజల పుణ్యానే గెలుస్తున్నా
– ఢిల్లీ వాళ్లు పిలిచి మాట్లాడితే మళ్లీ బీజేలో చేరతా
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరేది లేదు
– పార్టీకి రాజీనామా చేసినందుకు సీఎం యోగి ననన్ను తిట్టారు
– గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని.. ఈ విషయంలో ఎవరేమి చేసుకుంటారో చేసుకోండంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ చేశారు. నేను రాజీనామా చేయను. ఏం పీకుతారో పీక్కో,ండి..కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేను కూడా చేస్తా.. కిషన్రెడ్డి వల్లే పార్టీ భ్రష్టుపట్టింది అని తేల్చి చెప్పారు.
తనను వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని.. రాష్ట్ర స్థాయి బీజేపీ తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చే అవకాశమే లేదు. తాను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందా? బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవచ్చునని అన్నారు.
కొంతమంది పార్టీ పెద్దలకు భయపడి ఏమీ అనలేకపోతుండవచ్చు. వారికి పదవి భయం ఉండవచ్చు. కానీ తనకు ఎలాంటి పదవి ఆశ లేదని స్పష్టం చేశారు. తాను చేసే ప్రతి వ్యాఖ్య కార్యకర్తలకు మద్దతుగా ఉంటుందని రాజాసింగ్ అన్నారు.
తన వైఖరి భిన్నంగా ఉంటుందని.. పార్టీ పెద్దలు ఎప్పుడు తప్పు చేసినా, తాను కచ్చితంగా ఎదురు తిరిగి ప్రశ్నిస్తానని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, అందుకోసం ఎవరితోనైనా పోరాడతానని అన్నారు.
తనకు ఢిల్లీ పెద్దలు తరుచూ ఫోన్ చేసి మాట్లాడతారని, తనకు అధిష్ఠానం పెద్దల ఆశీర్వాదం ఉందని వెల్లడించారు. వాళ్లను కలిసి పార్టీలో జరిగిందంతా చెబుతానని అన్నారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని, కానీ సెక్యులర్ వాదిని మాత్రం కానని వ్యాఖ్యానించారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరేది లేదని స్పష్టం చేశారు.
పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు, సీఎం యోగి ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేసి తిట్టారని అన్నారు. తాను చేసే కామెంట్స్ పార్టీపై కాదని, కొందరు నేతలపై మాత్రమే. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, ఢిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.