Suryaa.co.in

Andhra Pradesh

నవంబర్ 1-8 వరకు విశాఖపట్నంలో ఐసీఐడీ సదస్సు

• ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సదస్సు..హజరుకానున్న 80 దేశాల ప్రతినిధులు
• రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు ప్రత్యేక ఆహ్వానం
• ఈ ఏడాది హెరిటేజ్ అవార్డుకు ప్రతిపాదనల్లో ప్రకాశం బ్యారేజ్
• ఈ ఏడాది పట్టిసీమ రీస్టార్ట్ చేసి కృష్ణాడెల్టాకు సాగునీరు
• నాగార్జున సాగర్ కుడి కాల్వకు తాగునీటి కోసం 5 టిఎంసీలు విడుదల
• దెబ్బతిన్న పోలవరం డయాఫ్రం వాల్ పున: నిర్మాణంపై ఉన్నతస్థాయి సమీక్ష
– రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు

విజయవాడ : వ్యవసాయరంగంలో నీటి ఎద్దడిని సమర్ధవంతంగా ఎదుర్కోవటం అనే అంశంపై విశాఖపట్నంలో ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 8 వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా 25వ అంతర్జాతీయ ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) సదస్సును నిర్వహిస్తున్నట్లు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. విజయవాడలోని జలవనరుల శాఖామాత్యుల క్యాంప్ కార్యాలయంలో గురువారం ఐసీఐడీ సదస్సు నిర్వహణపై గురువారం మంత్రి అంబటి రాంబాబు పత్రికా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముందుగా ఐసీఐడీ సదస్సు బ్రోచర్ ను మంత్రి విడుదల చేశారు. అనంతరం జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలు నీటి ఎద్దడి, నీటి యాజమాన్యం, నీటి వినియోగం తదితర అంశాలపై ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఐసీఐడీ మేథోమధనం జరుగుతుందని, ఈ ఏడాది నవంబర్ లో మన దేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఈ సదస్సు నిర్వహించటం గర్వకారణమన్నారు.

ఐసీఐడీ సదస్సును కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. 1951లో మనదేశం ప్రోద్భలంతో 11 దేశాల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఐసీఐడీ సదస్సు 1966లో మన దేశంలో నిర్వహించారని, మరలా 57 సంవత్సరాల తరువాత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చొరవతో ఈ ఏడాది మన వైజాగ్ లో నిర్వహించటం గొప్ప విషయమన్నారు. ఈ సదస్సుకు ప్రధానమంత్రి, రాష్ట్రపతులను ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు.

ఈ క్రమంలో ఐసీఐడీ సదస్సును ఘనంగా నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సదస్సుకు దాదాపు 80 దేశాల నుంచి 500 మందికి పైగా విదేశీ ప్రతినిధులు, మన దేశం నుంచి 700 మంది ప్రతినిధులు పాల్గొననున్నారని తెలిపారు.

సదస్సులో నీటి పారుదల, డ్రైనేజీపై ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. వ్యవసాయరంగంలో నీటి ఎద్దడిని ఎదుర్కోవటం అనే అంశంపై ప్రధానంగా నిపుణులు చర్చిస్తారని వివరించారు.

ఐసీఐడీ సదస్సులు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక దేశంలో నిర్వహించటం ఆనవాయితీ అని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. 2020లో జరగాల్సిన అంతర్జాతీయ సదస్సు కరోనా విపత్తు వల్ల ఆలస్యంగా గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిందని, ఈ సదస్సులో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ (ధవళేశ్వరం) వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ అవార్డు స్వంతం చేసుకుందన్నారు.

ఈ ఏడాది హెరిటేజ్ అవార్డుకు ప్రకాశం బ్యారేజీ పేరును ప్రతిపాదనలు పంపామని తెలిపారు. . నీటి యాజమాన్యంలో మెరుగైన పద్దతులు పాటించిన దేశాలకు ప్రోత్సాహకంగా అవార్డులు అందచేస్తారని చెప్పారు. ఇప్పటి వరకు మన దేశానికి 14 అవార్డులు వస్తే వాటిలో 4 అవార్డులు మన రాష్టానికే రావటం అభినందనీయమన్నారు.

నాగార్జున సాగర్ కుడికాల్వకు తాగునీటి ఎద్దడి నివారణ లో భాగంగా 5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పులిచింతల నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తే భవిష్యత్ లో ఇబ్బందులు రావచ్చు అని పట్టిసీమను రీస్టార్ట్ చేసి కృష్ణా డెల్టాకు నీరు అందించనున్నామని చెప్పారు.

గోదావరి నది వరద నీరు పోలవరం వద్ద 5 లక్షల క్యూసెక్ లు స్పిల్ వే నుంచి కిందకు వెళుతున్నాయని చెప్పారు. పోలవరం డయాఫ్రం వాల్ యూ ఆకారంలో ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలా లేదా కొత్తగా డయాఫ్రం వాల్ నిర్మాణం చేయాలా అనే అంశాలను పరిశీలించి ఉన్నతస్థాయిలో ఒక నిర్ణయం తీసుకోనున్నామని మంత్రి తెలిపారు.

సమావేశంలో జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, ఇంజనీర్ ఇన్ ఛీప్ (ఇరిగేషన్) సి. నారాయణ రెడ్డి, ఐసీఐడీ రాష్ట్ర కో ఆర్డినేటర్ కె. యల్లారెడ్డి, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE