– సర్కారు ఒకటంటే సచివుడు మరొకటా?
– సర్కారు-సచివుడు వేర్వేరా?
– జగన్ జమానాలో కర్నూలుకు లోకాయుక్త-హెచ్చార్సీ తరలింపు
– హెచ్చార్సీ-లోకాయుక్త ఆఫీసులను అమరావతిలో ఏర్పాటుచేస్తామన్న కూటమి ప్రభుత్వం
– ఆ మేరకు తాజాగా హైకోర్టుకు తన వైఖరి స్పష్టం చేసిన ప్రభుత్వం
– అఫిడవిట్ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ ఆదేశం
– కర్నూలులోనే కొనసాస్తామన్న మంత్రి టిజి భరత్
– లోకేష్‌తో మాట్లాడానని వ్యాఖ్య
– సర్కారు నిర్ణయానికి సచివుడు ఎలా భిన్నంగా మాట్లాడరంటున్న కూటమి నేతలు
– ఇలాంటి వ్యాఖ్యలు మంత్రులపై ప్రభుత్వానికి పట్టులేదని సంతేతాలు వెళ్లే ప్రమాదం
– ఇటీవల తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలు ఆమోదిస్తారంటూ యాదాద్రిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలు
– భరత్ వ్యాఖ్యలు వైసీపీకి కొత్త ఆయుధం అందిస్తున్నాయన్న వ్యాఖ్యలు
-వైసీపీకి భయపడాల్సిన పనిలేదని నేతల స్పష్టీకరణ
( మార్తి సుబ్రహ్మణ్యం)
‘‘లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటుచేయాలని రాష్ట్రప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి చట్టసవరణ చేసి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది’’.
– ఈనెల 13న హైకోర్టులో డీఎస్‌ఎస్వీ ప్రసాద్‌బాబు, నర్రా శ్రీనివాసరావు వేసిన పిటిషన్ల వాదన సందర్భంలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనానికి, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.ప్రణతి ఇచ్చిన సమాధానం ఇది. స్పందించిన ధర్మాసనం, దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
‘‘లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతికి తరలించం. ఆ రెండు కర్నూలులోనే ఉంటాయి. మంత్రి లోకేష్‌తో ఈ విషయం చర్చించా’’.
– ఈనెల 15న మీడియాతో కర్నూలులో పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే ప్రభుత్వ న్యాయవాదులు కోర్టులకు నివేదిస్తుంటారు. అందులో వారి వ్యక్తిగత అభిప్రాయాలకు తావు ఉండదు. ప్రభుత్వ నిర్ణయాలనే కోర్టులకు అఫిడవిట్ రూపంలో ఇస్తారు. ఆ మేరకు వాదిస్తుంటారు. అడ్వకేట్ జనరల్ నుంచి గవర్నమెంట్ ప్లీడరు, స్పెషల్ గవర్నమెంట్ ప్లీడరు వరకూ ప్రభుత్వ నిర్ణయాలనే స్పష్టం చేస్తుంటారు. సూటిగా చెప్పాలంటే ప్రభుత్వ న్యాయవాదులంతా ప్రభుత్వ వాదనకు గొంతుకలు. ఒక అంశంపై వారు కోర్టులో ఏదైనా వాదించారంటే, అని ప్రభుత్వ అభిప్రాయమని లెక్క.
మంత్రులంటే ప్రభుత్వంలో భాగస్వాములు. ప్రభుత్వం ఒక వైఖరి, ఒక నిర్ణయం తీసుకుంటే మంత్రులు దానికి కట్టుబడి ఉండాల్సిందే. వాటిపై వ్యక్తిగత అభిప్రాయాలకు తావుండకూడదు. ఒకవేళ ఏ మంత్రైనా అందుకు భిన్నంగా మాట్లాడితే.. సదరు మంత్రికి ఆ అంశంపై అవగాహన లేకపోయి అయినా ఉండాలి. లేక తన రాజకీయ మనుగడ కోసం ప్రభుత్వ విధానాలను ఫణంగా పెట్టయినా మాట్లాడి ఉండాలి. అది మంత్రి రాజకీయ మనుగడ వరకూ అక్కరకొచ్చినప్పటికీ.. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. అధికారంలో ఉన్న పార్టీ పరువు తీయడమే కాదు. మంత్రులపై ప్రభుత్వానికి అదుపు లేదన్న ప్రమాద సంకేతాలు పంపేందుకు కారణమవుతుంది.
ఇప్పుడు మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాల తరలింపు వ్యవహారంలో సరిగ్గా అదే జరుగుతోంది. జగన్ జమానాలో అమరావతి నుంచి కర్నూలుకు తరలించిన మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తను తిరిగి అమరావతికి తరలించేందుకు.. చంద్రబాబు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. ఆ మేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది, చీఫ్ జస్టిస్ ఉన్న ధర్మాసనానికి నివేదించారు. అందుకు స్పందించిన చీఫ్ జస్టిస్.. దానికి సంబంధించి అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించారు. అంటే ప్రభుత్వం ఆ రెండు సంస్ధలను కర్నూలు నుంచి.. అమరావతికి తరలించడానికి నిర్ణయించిందన్న విషయం, మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.
పోనీ అసలు ఇది ఇప్పుడే కొత్తగా తెరపైకి వచ్చిన అంశం కూడా కాదు. చాలాకాలం నుంచి కోర్టులో నలుగుతున్నదే. ఆ రెండు సంస్ధల కార్యాలయాలు.. కర్నూలులో ఏర్పాటుచేయడం చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ, డాక్టర్ మద్దిపాటి శైజల 2021లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. హెచ్చార్సీలో సిబ్బంది నియామకం, ఫిర్యాదుల స్వీకరణ యంత్రాంగానికి సంబంధించి ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియషన్ కూడా పిల్ దాఖలు చేసింది. ఈ కేసులను డీఎస్‌ఎస్వీ ప్రసాద్‌బాబు, నర్రా శ్రీనివాసరావు వాదిస్తున్నారు.
కాగా ఈనెల 13న హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా, ఇద్దరు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ.. రాజధాని అమరావతిలో ఏర్పాటుకానున్న జస్టిస్ సిటీలో అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయసంబంధిత సంస్థలను ఏర్పాటుచేయాలని నిర్ణయించిందని, ఇప్పటివరకూ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. దానితో న్యాయవాదులు డీఎస్‌ఎస్వీ ప్రసాద్‌బాబు, నర్రా శ్రీనివాసరావు వాదనకు స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి.. ఆ కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని, ధర్మాసనానికి నివేదించారు.
ఇదీ..హెచ్చార్సీ, లోకాయుక్త తరలింపు వ్యవహారం! అయితే మంత్రి టిజి భరత్ మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడటం, సర్కారుకు సంకటంగా పరిణమించింది. వాటిని తరలించేది లేదంటూ మంత్రి భరత్ చేసిన ప్రకటన, ప్రభుత్వ పరువు తీసినట్టయింది. కేవలం తన రాజకీయ ఉనికి కాపాడుకునేందుకే, ఆయన ఆ ప్రకటన చేసినట్లు కనిపించింది. కోర్టులో ఉన్న ఒక కీలక అంశం విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న అంశంపై.. ముఖ్యమంత్రి-అడ్వకేట్ జనరల్ చర్చించిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకుని, దానిని కోర్టుకు తెలియచేసి.. జడ్జిల ఆదేశాల ప్రకారం అఫిడవిట్ ఇస్తుంటారు. ఇది ఎవరికయినా తెలిసిన విషయమే. కానీ మంత్రివర్గంలోని మంత్రిగారికి మాత్రం ఈ విషయం తెలియకపోవడమే వింత.
నిజానికి ఇది ప్రభుత్వ నిర్ణయమే కాబట్టి.. మంత్రివర్గ సభ్యుడైన భరత్ కూడా ఆ కోణంలోనే మాట్లాడాలి. ‘ఇది కోర్టులో ఉన్న అంశం కాబట్టి తాను మాట్లాడకూడద’నయినా స్పష్టం చేసి ఉండాల్సింది. అందుకు భిన్నంగా.. ఆ రెండు సంస్థలు ఇక్కడే ఉంటాయని, తాను లోకేష్‌తో మాట్లాడానని చెప్పడం ఎంతవరకూ సమంజసమన్న ప్రశ్న పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
హైకోర్టులో ఉన్న ఈ అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడి.. నిర్ణయం తీసుకోవలసి ఉంటుందే తప్ప, ఇందులో లోకేష్‌కు ఏం సంబంధం? ఇది ఆయనను కూడా అనవసరంగా ఇరికించడమే కదా అన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
‘అంటే ఆ రెండు సంస్థలనూ తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినా, తాను మాత్రం రాయలసీమ పరిరక్షకుడిగా వ్యతిరేకిస్తున్నానని రాయలసీమ వాసులకు చెప్పే రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అంటే పార్టీ ప్రయోజనాలు ఎటుపోయినా, మంత్రి గారి రాజకీయ మనుగడ ఇబ్బందిలో పడకూడదన్నమాట’ అని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.
కాగా హెచ్చార్సీ, లోకాయుక్త తరలింపు వ్యవహారం వైసీపీకి బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. చంద్రబాబునాయుడు రాయలసీమ ద్రోహి అని, రాయలసీమ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించి, అన్నింటినీ అమరావతికి తరలిస్తున్నారన్న ఆరోపణలకు తెరలేపింది. ఆ రెండు సంస్థలనూ కర్నూలులోనే కొనసాగించాలన్న డిమాండుకు పదును పెడుతోంది.
ఈ క్రమంలో వైసీపీకి కొత్త ఆయుధం అందివ్వకుండా, ఎదురుదాడి చేయాల్సిన మంత్రి భరత్.. వైసీపీ విమర్శలకు వివరణ ఇచ్చుకునేలా మాట్లాడటంపై, టీడీపీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కాగా జగన్ జమానాలో పేరుకు న్యాయరాజధాని కర్నూలు అని ప్రచారం చేసినప్పటికీ.. కర్నూలుకు హైకోర్టు తరలించే ఆలోచన లేదని.. ప్రభుత్వం స్వయంగా కోర్టుకు వివరణ ఇచ్చిన అంశాన్ని గుర్తుచేసి, ఎదురుదాడి చేయాల్సిన మంత్రి.. తాను ఇరుక్కుని, ప్రభుత్వాన్ని ఇరికించడం చర్చనీయాంశమయింది.
తెలంగాణ ఎమ్మెల్యే లేఖలపై నోరుజారిన మంత్రి వాసంశెట్టి
ప్రభుత్వంతో చర్చించకుండా, మంత్రివర్గ సమావేశాల దృష్టికి తీసుకువెళ్లకుండా మంత్రులు చేసే వ్యాఖ్యలు, ఇచ్చే ప్రకటనలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నాయి. ఇటీవల కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ యాదాద్రి వెళ్లినప్పుడు, మీడియాతో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాయి. టీటీడీలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఎందుకు ఆమోదించడం లేదన్న మీడియా ప్రశ్నకు.. త్వరలో ఆమోదిస్తామని, మరో రెండు నెలలో టీటీడీ కొత్త బోర్డు ఏర్పాటవుతుందని సమాధానం చెప్పారు.
అయితే ఈ అంశంపై టీటీడీ ఈఓ శ్యామలరావు చాలా రోజుల క్రితమే స్పష్టత ఇచ్చారు. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఆమోదించే యోచన లేదని, డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు. తర్వాత చంద్రబాబునాయుడు-తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ సందర్భంలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. కానీ తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఆమోదించకూడదన్న నిర్ణయానికే.. ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడింది.
ఇటీవలి కాలంలో తిరుమల వచ్చిన ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా, ఈ అంశం ప్రస్తావిస్తూ చేసిన హెచ్చరిక వివాదంగా మారింది. ‘‘మేం ఆంధ్రావాళ్లకు.. మా హైదరాబాద్‌లో ఉండవద్దు. ఇక్కడినుంచి వెళ్లిపోండి అంటే మీరెలా బాధపడతారు? అలాగే దేవుడి దర్శనానికి వచ్చే మా నియోజకవర్గ భక్తులకు, మా లేఖలు ఆమోదించమని అంటే మేమెంత బాధపడతాం. దీనిపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే, మేమే మా అసెంబ్లీలో తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంద’’ని చేసిన హెచ్చరిక కలకలం సృష్టించింది.
మరొక కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ‘మేం యాదాద్రి, భద్రాచలం ఆలయాలకు ఆంధ్రా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను గౌరవిస్తున్నప్పుడు, మీరు మా తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను ఎందుకు గౌరవించరు’ అని నిలదీశారు.
ఇలాంటివేమీ తెలుసుకోకుండా, ఒక అంశానికి సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా చేసే సొంత వ్యాఖ్యలు బూమెరాంగవుతుంటాయి. నిజానికి తెలంగాణ ఎమ్మెల్యేల టీటీడీ లేఖలు ఆమోదించడమనేది, ముఖ్యమంత్రి తీసుకోవలసిన నిర్ణయం. పోనీ మీడియా ఇలాంటి ఇరకాట ప్రశ్నలు సంధిస్తే, ‘ఇది ప్రభుత్వంలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం. క్యాబినెట్‌లో దీనిపై చర్చిస్తా’మని చెప్పాలే తప్ప.. తన సొంత నిర్ణయం ప్రకటిస్తే, తర్వాత అభాసుపాలుకావలసి వస్తుంది. మరో రెండు నెలలో టీటీడీ బోర్డు వేస్తారని మంత్రి వాసంశెట్టి ప్రకటించిన పదిరోజులకే, టీటీడీ బోర్డు వేయడం ప్రస్తావనార్హం.