– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరిక
– కవిత దీక్షకు ఐఎన్ఎల్ డీ మద్దతు
– భారీ ఎత్తున తరలివచ్చిన బీసీ సంఘాల నాయకులు
– 72 గంటల నిరాహారదీక్ష కు అడ్డుతగిలిన ప్రభుత్వం
– హైకోర్టు ఆదేశాలతో సోమవారం సాయంత్రం దీక్ష విరమణ
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే రణరంగాన్ని సృష్టిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఇది రాజకీయ పోరాటం కాదని, బీసీల ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటమని స్పష్ట చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులో ముస్లీంలకు కూడా వాటా ఉందన్న అనుమానం ఉన్న దృష్ట్యా దాన్ని ఆపుతున్నామని బీజేపీ నాయకులు చెబుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ముస్లీంలకు 10 శాతం రిజర్వేషన్లకు సపరేట్ బిల్లును పెడుతామని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాలని సూచించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం సోమవారం ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. దీక్షకు వేలాది మంది ప్రజలు, ఆయా కుల సంఘాలు, ప్రజా సంఘాలు హాజరై మద్ధతు ప్రకటించారు. హర్యానకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనువడు అర్జున్ సింగ్ చౌతాలా దీక్షకు హాజరై ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగునప్పుడే తెలంగాణ బాగుంటుందని తెలిపారు. ప్రతీ ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి. అందరికీ ఆర్థిక అవకాశాలు, సమాజంలో గౌరవం దక్కాలని, సమాజంలో సగభాగం ఉన్న బీసీలకు రాజకీయంగా సమప్రధాన్యత దక్కాలి అని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం యాథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి మెడలు వంచడంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం అసెంబ్లీలో రెండు బిల్లులను ఆమోదింపజేసిందని గుర్తు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్రానికి పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకుందామని చూస్తోందని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమేమో ఇది రాష్ట్రానికి సంబంధించి బిల్లు అని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది విరమణ కాదు విరామం మాత్రమే..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్తే, ప్రభుత్వం అనేక సాకులతో దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం సాయంత్రం ధర్నా చౌక్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. తాము 72 గంటల దీక్షకు అనుమతి కోరితే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు దీక్షను వాయిదా వేయాలని హైకోర్టుకు సూచించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు 72 గంటల నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. తెలంగాణ జాగృతి క్రమశిక్షణ గల సంస్థ అని కోర్టు ఆదేశలను గౌరవిస్తూ 72 గంటల నిరాహారదీక్షను విరమిస్తున్నానని ప్రకటించారు.
కాగా, ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సలాం అని ఐఎన్ఎల్డీ నాయకుడు అర్జున్ సింగ్ చౌతాలా అన్నారు. “ఒక వ్యక్తి, ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత పోరాటం చేయడం లేదు.. ఒక న్యాయమైన డిమాండ్ కోసం ఎమ్మెల్సీ కవిత పోరాడుతున్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాటంలో మేము భాగస్వాములవుతాం. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో పోరాడినా… హైదరాబాద్ లో పోరాడినా అండగా ఉంటాం. దేశంలో వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందన్నారు