– ప్రైవేట్ హాస్పిటల్ లు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత పై వెనక్కి తగ్గాలి
– ఆరోగ్య శ్రీ నిలిపివేయడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
– మానవీయ కోణంలో హాస్పిటల్ యాజమాన్యాలు ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్ధరించాలి
– హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య పరిమితి ఐదు లక్షల నుండి పది లక్షల పెంచడంతోపాటు గడిచిన 21 నెలలు 1779 కోట్ల రూపాయలను ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ లకు ప్రభుత్వం చెల్లించింది.
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికి పైగా పెంచింది. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్య శ్రీ లో చేర్చి పేదలకు ఇబ్బందులు లేకుండా మరిన్ని వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది.కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా 487.29 కోట్ల రూపాయలు పేదలకు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
2014-23 నవంబర్ వరకు సగటున నెలకు 57 కోట్ల రూపాయలు హాస్పిటల్ లకు చెల్లించగా 2023 డిసెంబర్ నుండి 2024 డిసెంబర్ వరకు సగటున 75 కోట్లు ప్రభుత్వం చెల్లించింది.
మా మంత్రి దామోదర రాజనర్సింహ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు రోజుల్లోనే 100 కోట్లు ప్రైవేట్ హాస్పిటల్ లకు విడుదల చేశారు. ఆ డబ్బులు హాస్పిటల్ ఖాతాలో జమ అయ్యాయి. పెండింగ్ డబ్బులు విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృశ్య హాస్పిటల్ యాజమాన్యాలు అర్థం చేసుకోవాలి. హాస్పిటల్ యాజమాన్యాలు మానవీయ కోణంలో వెంటనే ఆరోగ్య శ్రీ సేవలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్న.