– హిందూ సమాజ సంఘటన కోసం ఆర్ ఎస్ ఎస్ కృషి
– ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే
“సంఘటిత భారత్ సమర్ధ భారత్. సంఘటిత భారత్ స్వాభిమాన భారత్. సంఘటిత భారత్ సమగ్ర భారత్. అటువంటి సంఘటిత భారత్ ను రూపొందించడంలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి. ఇదే ఈ హిందూ శక్తి సంగమం సందేశం’’ అని ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే అన్నారు.
ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అయితే, భారత్ కు హిందూ సమాజం ఆధారం. ఆ హిందూ సమాజ సంఘటన కోసం ఆర్ ఎస్ ఎస్ 90ఏళ్ళకు పైగా కృషి చేస్తున్నది అని ఆయన అన్నారు. నల్గొండలోని
ఎన్.జి. కళాశాల మైదాన ప్రాంగణంలో `హిందూ శక్తి సంగమం’ పేరుతో జరిగిన జిల్లా మహా సాంఘిక్ సార్వజనికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ మనదైన సంస్కృతి సంప్రదాయాలు, జీవన విధానం ఆధారం ప్రగతిని సాధించడానికి వచ్చిన ఈ అవకాశాన్ని మాత్రం ఉపయోగించుకోవడంలో మనం వెనుకబడిపోయామని ఆయన విచారం వ్యక్తం
చేశారు.ఈ సమయంలోనే జపాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఎంతో అభివృద్ధిని, స్వావలంబనను సాదించగలిగాయని గుర్తుచేశారు. అయితే బాగా ఆలస్యమైన ఇప్పుడు మన దేశం కూడా స్వాభిమానపూరిత ఆలోచనతో అడుగులు వేయడం ప్రారంభించిందని సంతోషం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్య సమర కాలంలో దేశంలో వ్యక్తమైన దేశభక్తి, స్వాభిమాన భావాలు ఆ తరువాత మాయమయ్యాయని హోసబలే అన్నారు. దీనికి కారణం విదేశీ పాలన పోయినా మనలో విదేశీ బానిస బుద్ధి మిగిలిపోయిందని, విదేశీ విద్యావిధానం ద్వారా తరతరాలుగా మనను మనమే కించపరచుకున్నామని, అందుకే ప్రగతి సాధించలేకపోయామని అన్నారు. అధికార వ్యామోహంతో సమాజంలో వేర్పాటువాదాన్ని, విభజనను ప్రేరేపించే శక్తులు పెరగడం వల్ల ఇలా జరిగిందని విచారం వ్యక్తంచేశారు.
కానీ స్వాభిమానంతో కూడిన ఆలోచన, కార్యాచరణ వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అతి తక్కువ కాలంలోనే మనకు అనుభవపూర్వకంగా తెలిసిందని ఆయన అన్నారు. యోగా దినోత్సవం జరుపుకోవాలని
భారత్ పిలుపునివ్వగానే ప్రపంచంలోని దాదాపు అన్నీ దేశాలు ముందుకువచ్చాయని, కోవిడ్ కష్ట కాలంలో భారత్ ఉచితంగా వాక్సిన్లు అందించడం ద్వారా అనేక దేశాలను ఆదుకుందని ఆయన గుర్తుచేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సాంస్కృతిక జాగృతికి ప్రతీక అని అన్నారు.
భారత్ తన శక్తిసామర్ధ్యాలను గుర్తించి అందుకు తగినట్లుగా ముందుకు సాగితే అద్భుతాలు సాధిస్తుందని, విశ్వగురువు అవుతుందని ఆర్ ఎస్ ఎస్ మొదటినుండి చెప్తునే ఉందని, నేడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీలు, సంస్థల్లో భారతీయులదే అగ్రస్థానమని అన్నారు. ప్రాచీన సంస్కృతీ సభ్యతలే భారత్
గుర్తింపు. ఈ సాంస్కృతిక విలువలను జీవితంలో ఎంతవరకు ఆచరిస్తున్నామన్నది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. కులం, ప్రాంతం, భాష, మొదలైన విభేదాలను పక్కన పెట్టి మనమంతా హిందువులమానే విషయాన్ని గుర్తించాలి. కానీ విచిత్రమేమిటంటే విభజన వాదాన్ని రెచ్చగొట్టే విధానం సెక్యులర్ గా గుర్తింపు పొందుతుంటే, సమైక్య, సంఘటిత వాదాన్ని గుర్తుచేయడం మతతత్వం, కమ్యూనల్ అవుతోందని హోసబలే అన్నారు. ఇక్కడ జన్మించి, ఈ దేశ సంస్కృతిని గౌరవించి, సొంతంచేసుకుని, ఆచరించేవారంతా హిందువులేనని ఆయన అన్నారు.
ప్రాచీన సంస్కృతి, అపారమైన శక్తి సామర్ధ్యాలు కలిగిన హిందూ సమాజం ఆ సంగతి మరచిపోవడం వల్లనే వెనుకబడింది. ప్రలోభాలకు గురిచేసి అన్య మతస్తులు మాటమార్పిడులు చేస్తున్నా, అక్రమ చొరబాటుదారులు ఇక్కడ తిష్ట వేసుకుని అరాచకం సృష్టిస్తున్నా సాధారణ హిందూ సమాజం నిద్రలోనే మునిగి ఉంది. దేశ సైన్యాధిపతి చనిపోతే సంతోషం వ్యక్తంచేస్తున్నవారు మన మధ్యనే ఉన్నారు. వారంతా
`చదువుకున్నవారు’, `మేధావులుగా’ చెలామణి అవుతున్నవారే. ఇటువంటి ధోరణులను అరికట్టడంకోసం హిందువులలో చైతన్యం, జాగృతి అవసరం. దాని కోసమే ఆర్ ఎస్ ఎస్ కృషి చేస్తున్నాదని దత్తాత్రేయ హోసబలే అన్నారు. తన శక్తిని మరచిపోయిన హనుమంతుని వంటి హిందూ సమాజానికి ఆ శక్తిని గుర్తుచేసిన జాంబవంతుడు చేసిన పనినే ఆర్ ఎస్ ఎస్ చేస్తున్నాదని ఆయన అన్నారు.
హిందూ జనశక్తి జాగరణకు శాఖా కార్యక్రమం. దేశం మొత్తంలో 50వేలకు పైగా శాఖలు నడుస్తున్నాయి. వీటి ద్వారా భేదభావాలు, హెచ్చుతగ్గుల భావాలు లేని హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడమే ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంతం, లక్ష్యం, తపస్సు. దేశం మొత్తంలో లక్షన్నరకు పైగా సేవా కార్యక్రమాలను
స్వయంసేవకులు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా సంఘటిత, సమర్ధ సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఆర్ ఎస్ ఎస్ చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ హోసబలే తన ఉపన్యాసాన్ని ముగించారు.
కార్యక్రమంలో ప్రముఖ కంటివైద్య నిపుణులు డా. కస్తూరి నందు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అలాగే ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణామూర్తి, నల్గొండ జిల్లా సంఘచాలక్ ఇటికాల కృష్ణయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.