– కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ అంటే గౌరవం ఇదేనా?
– ఇందిరమ్మ పాలనలో ఇచ్చిన భూములు లాక్కుంటే కాంగ్రెస్ సీనియర్లు ప్రశ్నించరా?
– దళిత, గిరిజన, బలహీన వర్గాల భూములపై ఎందుకు గద్దల లాగా వాలుతున్నారు?
– రెండున్నరేండ్లలో 10వేల ఎకరాల దళితుల, ఎస్టీల భూములు లాక్కున్నడు
– ఇంకా 40వేల ఎకరాల భూములు లాక్కుంటడట
– సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్లు రేవంత్ ఆలోచనలన్నీ భూముల పైనే
– నాటి ఇందిరమ్మ పాలనలో భూములు ఇస్తే నేడు లాక్కుంటున్నారు
– పచ్చటి పొలాల్లో పరిశ్రమలు పెడతామంటూ.. ఎందుకు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు
– ప్రధాన ప్రతిపక్షంగా మేము పరిగి రైతుల వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడం అప్రజాస్వామికం
– అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజం
హైదరాబాద్: పరిగి నియోజకవర్గంలో దళిత, గిరిజన బలహీన వర్గాల భూములను ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కుల పేరిట గుంజుకునే ప్రయత్నం చేస్తున్నది. రైతుల పక్షాన పోరాడటానికి బిఆర్ఎస్ వెళ్తుంటే అరెస్టులు చేసి, నిర్బందాలకు గురి చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వం అంత భయపడుతున్నది? ప్రజాస్వామ్యం అనే ఏడో గ్యారెంటీ ఇస్తున్నాం. ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తం అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బలహీన వర్గాల గొంతుకగా మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు?
మా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అరెస్టు చేసి గంటకో పోలీసు స్టేషన్ కు పంపుతున్నారు.ఎందుకు అంత భయబ్రాంతులకు గురి చేస్తున్నారు? రైతుల గోస వినడానికి కళ్లాపూర్ దగ్గర మీటింగ్ పెట్టుకున్నం. ఉదయానే పోలీసులు వెళ్లి టెంటులు చింపి, రైతులను, మహిళలను అరెస్టు చేసారు. అక్కడికి వస్తే కేసులు పెడతాం అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేకుండా చేయడమేనా ప్రజాపాలన?
రేవంతు పరిస్థితి పిచ్చోడు చేతిలో రాయిలా అయిపోయింది. ఎప్పుడు ఏం చేస్తడో తెల్వదు, ఎవరి మీద రాయి విసురుతడో తెల్వది. మూసీ పేరిట అపార్టమెంట్లు కూల్చుతడు. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చుతడు. యూనివర్సీటీ భూములు లాక్కుంటడు. వ్యవసాయ మార్కెట్ భూములు లాక్కుంటున్నడు లగచర్ల లాంటిదే పరిగిలో చేస్తున్నరు. దళిత, బలహీన వర్గాల భూములను ఎందుకు లాక్కుంటున్నారు? దళిత, గిరిజన బలహీన వర్గాల భూముల మీద దండ యాత్ర చేస్తున్నడు రేవంత్ రెడ్డి.
నాడు పట్టాలు ఇస్తామని చెప్పి, నేడు పట్టాలు లాక్కుంటున్నడు. రేవంత్ రెడ్డి వచ్చిన రెండున్నరేండ్లలో 10వేల ఎకరాల దళితుల, ఎస్టీల భూములు లాక్కున్నడు. పరిశ్రమలు పెడతాం అని నోటిఫికేషన్లు ఇచ్చి, ఇంకా 40వేల ఎకరాల భూములు లాక్కుంటడట. ఎందుకు భూముల మీద దండ యాత్ర చేస్తున్నవు అని అడగడానికి వెళ్తున్నం. ముఖ్యమంత్రి, స్పీకర్ ఉండి వికారాబాద్ జిల్లాకు శాపం అయ్యింది. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు అయ్యింది. ఎస్సీ, ఎస్టీల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నరు.
నువ్వు అడ్డుకోవాలని చూసినా మా పోరాటం ఆగదు. బాజాప్త రైతుల వద్దకు వెళ్తం, వాళ్ల పోరాటానికి భాసటగా నిలుస్తం. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతది అన్నట్లు, రేవంతు రెడ్డి ఆలోచనలు అన్ని భూమి చుట్టే తిరుగుతున్నయి. లగ చర్ల అంటడు, హెచ్ సీ యూ అంటడు, హిల్ టీపీ అంటడు, నాదర్ గుల్ భూములు అంటడు, ఇవాళ పరిగిలో భూములు లాక్కుంటడు.
పాలన చేయిమంటే భూముల మీద పడ్డడు.
నాటి ఇందిరమ్మ భూములు ఇస్తే, నేటి ఇందిరమ్మ పాలనలో పేదల భూములు లాక్కుంటున్నడు. ఎక్కడ అసైండ్ భూమి ఉంటే అక్కడ గద్దల్లా వాలుతున్నారు. తుమ్మల నేను చెప్పిందే చెప్పారు. అందుకు ధన్యవాదాలు. కేసీఆర్ ఆలోచనలతో ఫౌండేషన్ వేసింది మేము, నిధులు ఇచ్చింది మేము.
రెడీగా ఉన్న భూములను ఇండస్ట్రీలకు ఇస్తం, పక్కన పంచాయతీలో ఉన్న దిల్ భూములను మార్కెట్ యార్డుకు ఇస్తం అంటడు. 11 ఏళ్లుగా హైకోర్టులో కేసు క్లియర్ కాలేదు. మీరు రైతు పక్షపాతి అయితే ఇక్కడే టెండర్ పిలిచి అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మించండి.
చిల్లర కార్యక్రమాలు మానండి భూముల వెంట పడకండి. 22ఏ నిషేధిత జాబితా రివ్యూ చేసి తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని ,పరిగి రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పటి దాకా మా పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నాం.