– జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన శాటిలైట్ కోఆర్డినేట్స్ సర్వేనే ఇప్పుటికీ ఎందుకు అమలు చేస్తున్నారు?
– కేంద్రం రూ.400 కోట్ల రాయితీలు ఇస్తే దాన్ని తీసుకుంటారు
– కానీ సర్వే అద్భుతం అని చెప్పలేరా?
– మా ప్రభుత్వ విధానంలో నడుస్తూ మాపై విమర్శలా?
– సాయిప్రసాద్ మాట్లాడిన విషయాలు తప్పయితే రేపు ఆయన్ను సీఎస్ గా నియమించకండి
– మధ్యప్రదేశ్ లో ఇళ్లు కట్టుకుంటే మోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఫొటోలతో రెండు రాళ్లు పెట్టారు
– మరి వాళ్లను మీరు ప్రశ్నించగలరా?
– జగన్ పేరు చూడటం ఇష్టం లేకపోతే రాయి వెనక్కి తిప్పుకోవచ్చుగా?
– ఆయన పేరు తీసేయడానికి రూ.15 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు?
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల సర్వేను తామే చేసినట్లు క్రెడిట్ చోరీ చేయడంపై వైయస్.జగన్ ప్రశ్నలకు బదులివ్వకుండా.. ఎదురుదాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ తీరుపై మాజీ మంత్రి పేర్నివెంకట్రామయ్య (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైయస్.జగన్ హయాంలో వంద శాతం కచ్చితత్వంతో తొలిసారి భూసర్వే చేపడితే.. దాన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ తిరిగి ఆయనపైనే విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. భూసర్వేతో పాటు, పాస్ బుక్స్ విషయంలోనూ రెవెన్యూమంత్రి పచ్చి అబద్దాలు చెబుతున్నారని
వైఎస్సార్సీపీ హయాంలో చేపట్టిన భూసర్వే క్రెడిట్ ను కూటమి సర్కార్ చోరీ చేయడంపై వైయస్. జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే.. దానికి సమాధానం ఇవ్వకుండా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంస్కారహీనంగా అవాకులు, చవాకులు పేలారు. వైయస్.జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పాస్ బుక్ పై ఆయన ఫొటోతో పాటు రాజముద్ర కూడా ఉంది. జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ కొడితే ఏమీ రావట్లేదన్నారు. ఇప్పుడు మేం కొడితే వస్తోందిగా?
(అంటూ.. పాస్ బుక్పై క్యూఆర్ కోడ్ కొడితే భూమి వివరాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, గూగుల్ మ్యాప్స్ వస్తున్న వీడియోను ప్రెస్మీట్లో ప్రదర్శించారు).
ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న పాస్ బుక్లో భూమి దారి చూపడానికి సర్వే చేయకుండా గూగుల్ కోఆర్డినేట్స్ ఎలా వస్తున్నాయి? గతంలో మా ప్రభుత్వం చేసిన సర్వేలో నమోదు చేసిన వివరాలే ఇప్పుడు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో మాత్రమే ఇప్పుడు కోఆర్డినేట్స్ వస్తున్నాయి. ఆయన చేసిన సర్వే వాడుకుని ఆయనపైనే బురద జల్లుతున్నారు.
రెవెన్యూ మంత్రికి భూసర్వే గురించి ఏం తెలుసు? 1802లో దేశంలో మొదటి భూసర్వే చేశారు. అప్పుడు గ్రేట్ ట్రిగోనామెట్రికల్ సర్వే (జీటీఎస్) చేశారు. మళ్లీ 1926లో మొదలుపెట్టి 1932లో పూర్తి చేశారు. ఏపీ మినహా చాలా రాష్ట్రాల్లో రీసెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం జరిగిన ఆ సర్వేనే అనుసరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేయించిన సర్వే నుంచి ఇప్పటివరకూ రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ (ఆర్ఎల్ఎర్) పేరుతో వివరాలు వస్తున్నాయి.
తక్కెళ్లపాడులో తాము భూసర్వే పైలట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టామని మీరు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని ఎందుకు కొనసాగించట్లేదు?. జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన శాటిలైట్ కోఆర్డినేట్స్ సర్వేనే ఇప్పుటికీ ఎందుకు అమలు చేస్తున్నారు?
వైయస్సార్సీపీ ప్రభుత్వ హాయంలో చేయించిన భూముల సర్వేపై లక్షల అర్జీలు వస్తున్నాయని చెప్తున్న వారు ఈ రెండేళ్లలో వాటిని ఎందుకు తీర్చలేదని అడుగుతున్నాం. జగన్ చేయించిన సర్వే ఆధారంగా ఇచ్చిన పాస్ పుస్తకాల్ని ప్రభుత్వం తప్పుబడుతోంది. కానీ ఏప్రిల్ నుంచి తమ పాస్ పుస్తకాలు ఇవ్వడం మొదలుపెట్టాక అసలు పండగ మొదలు కాబోతోంది. 1932 వరకూ జరిగింది మ్యానువల్ సర్వే. గొలుసులతో చేసిన సర్వే అది. చైన్ ను మనుషులు లాగిన విధానంపై ఆధారపడి ఆ సర్వే జరిగింది. కాబట్టి అది కచ్చితమైన సర్వే కాదు. 5 శాతం తప్పొప్పులు ఉంటాయి.
కానీ జగన్మోహన్ రెడ్డి చేయించిన సర్వే 0.99 శాతం కచ్చితమైనది. శాటిలైట్ ద్వారా చేయించిన సర్వే అది. రాష్ట్రంలో 70 బేస్ స్టేషన్లు పెట్టి జియో కోఆర్డినేట్స్ ద్వారా ఈ సర్వే చేయించారు. జగన్ పూర్తి చేయని చోట సర్వే చేయాలన్నా, ఆయన పెట్టిన బేస్ స్టేషనన్లు, రోవర్లు వాడాల్సిందే. ఆయన దారిలోనే నడుస్తూ ఆయన్ను విమర్శించడం మీ కుసంస్కారం. వైయస్.జగన్ చేశారనే కారణంతో భూసర్వేను మీరు పక్కన బెట్టలేదుగా.. దాన్నే ఇప్పటికీ వాడుతున్నారు.
వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసిన సాయిప్రసాద్.. తాను ఆ పోస్టులోకి రాక ముందు ఈ సర్వేపై అనుమానాలు ఉన్నాయని, కానీ పోస్టులోకి వచ్చాక క్షేత్రస్ధాయిలో పరిశీలన చేశాక గుంటూరు జిల్లాలో రైతులతో మాట్లాడితే దాని కచ్చితత్వం తెలిసిందని చెప్పారు. ఆయన మాట్లాడిన విషయాలు తప్పయితే రేపు ఆయన్ను సీఎస్ గా నియమించకండి.
జగన్ రూ.700 కోట్లు పెట్టి రాళ్లు వేశారని ఆరోపిస్తున్న చంద్రబాబు.. ఆయన పేరు తీసేయడానికి రూ.15 కోట్లు ఖర్చు పెడుతున్నారు. జగన్ పేరు చూడటం ఇష్టం లేకపోతే రాయి వెనక్కి తిప్పుకోవచ్చుగా. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని ఇళ్లు కట్టుకుంటే ప్రధాని మోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ఫొటోలతో రెండు రాళ్లు పెట్టారు. మరి వాళ్లను మీరు ప్రశ్నించగలరా?
జగన్ హయాంలో భూసర్వే బాగా జరిగిందని కేంద్రం రూ.400 కోట్ల రాయితీలు ఇస్తే దాన్ని తీసుకుంటారు. కానీ సర్వే అద్భుతం అని చెప్పలేరా? ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేస్తే ఇన్సెంటివ్స్ ఇస్తామని కేంద్రం చెప్పిన విషయాన్ని ప్రస్తుత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. గతంలో అసెంబ్లీలోనే చెప్పారు. నిన్న జగన్ ప్రెస్ మీట్ తర్వాత మాత్రం మాటమార్చి ఈ చట్టాన్ని వాడుకుని దోపిడీ చేశారని చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు.