– రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి
– లేదంటే పదవులు వదులు కోవాలి
– రూ.1800 కోట్ల డిండి పనులు రేవంత్ తమ బావమరిదికి ఇచ్చుకున్నాడు
– తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టు దగ్గర ధర్నా చేయడం విచిత్రం
– సర్కార్ నడుపుతున్నారా ? సర్కస్ నడుపుతారా ?
– తెలంగాణ నీటిని ఆంధ్రాకు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు
– మీకు పెళ్లిళ్లు, పేరంటాలు, ఢిల్లీ ప్రయాణాలు తప్ప ఏపీకి వెళ్లి ఎందుకు ప్రశ్నించలేదు
– ఆంధ్రాలో గురువు, తెలంగాణలో శిష్యుడు సీఎంలుగా ఉన్నారు. శిష్యుడికి సలహాదారు ఆంధ్రా నుండి వచ్చిన ఆదిత్యనాథ్ దాస్
కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కనాడు కూడా ఎందుకు ప్రశ్నించరు ?
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డిలకు కృష్ణా జలాలే శరణ్యం. సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్.కేసీఆర్ నాయకత్వంలో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ నీటిని ఆంధ్రాకు వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో తాత్కాలిక ఒప్పందంలో కృష్ణా జలాల్లో కేంద్రం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రా వ్యవహరిస్తున్నది.ఎలాంటి ఇండెంట్లు లేకుండా ఆంధ్రాకు నీటిని తరలిస్తున్నారు .. తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. గత రెండేళ్లలో ఏపీ అతి ఎక్కువగా నీళ్లను తరలిస్తే, తెలంగాణ అతి తక్కువగా వాడుకున్నది.
అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు ఎందుకు డిమాండ్ చేయడం లేదు.. నల్లగొండ, పాలమూరు జిల్లాలో పంటలు చేతికి వచ్చే దశలో ఉన్నాయి. .. నోటికాడికి వచ్చే బుక్క నేలపాలవుతుంది .. రైతుల కష్టార్జితం నాశనం అవుతుంది. సర్కార్ నడుపుతున్నారా ? సర్కస్ నడుపుతారా ?
కేంద్రం పరిధిలో ఉన్న కేఆర్ఎంబీ తెలంగాణకు చేస్తున్న అన్యాయం గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్కనాడు కూడా ఎందుకు ప్రశ్నించరు ? తెలంగాణకు సాగునీటిలో జరుగుతున్న అన్యాయం మీద ఒక్కనాడు ఎందుకు అడగరు?
ఏపీ ప్రభుత్వం ఇంటర్ బేసిన్ ట్రాన్స్ ఫర్ కు వ్యతిరేకంగా కృష్ణా బేసిన్ లో లేని హాంద్రి నీవా, పెన్నా బేసిన్ , గాలేరు నగరి కి తరలిస్తున్నది. ఇప్పుడు బనకచర్లతో ముందుకు గోదావరి జలాలు కృష్ణాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 45 రోజులు ఆలస్యంగా ఎత్తిపోతల పంపులు ప్రారంభించారు. ఈ ఏడాది అత్యధికంగా కృష్ణా నదికి వరదలు వచ్చాయి.
సాగునీరు ఎత్తిపోసుకోకపోవడమే కాకుండా.. ఏపీ జలదోపిడీని నిరోధించలేకపోయారు. రెండు వారాల ముందే హెచ్చరించినా ఈ ప్రభుత్వం మేలు కోలేదు. సాగునీటి దోపిడీని అడ్డుకోకుండా ఇప్పుడు పంటలు ఎండిపోయే ఉన్నప్పుడు ఇప్పుడు శ్రీశైలం వద్ద తీరిగ్గా ధర్నా చేస్తున్నారు.
ఎస్సెల్బీసి కూలిపోతే కనీసం అందులో ఇరుక్కున్న శవాలను బయటకు తీయలేదు.. వట్టెం పంప్ హౌస్ నీట మునిగితే ఒక్క రోజు కూడా వెళ్లి పరిశీలించలేదు. వట్టెం పంప్ హౌస్ పర్యటన పెట్టుకున్న నీటిపారుదల శాఖ మంత్రి అక్కడి వరకు రాకుండా మధ్యలోనే వెళ్లిపోయారు.
10 శాతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఆరు నెలల్లో రూ.1200 కోట్లతో పూర్తి చేసి ఉంటే నేడు జిల్లాలోని రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది. నీళ్లు మలుపుకునే చేతగాక, వెళ్లిపోయిన నీళ్ల కోసం శ్రీశైలం డ్యాం వద్ద ధర్నా చేస్తున్నారు.
మీకు దమ్ముంటే, మీకు ప్రజలు, రైతుల ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, మీకు పదవీలాలస లేకుంటే మిగిలిపోయిన పాలమూరు పనులు చేపట్టాలని రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి .. లేదంటే పదవులు వదులు కోవాలి. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ ను పనులు ఎందుకు చేయడం లేదు, తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని నిలదీయాలి?
సీఎంకు, మీకు పెళ్లిళ్లు, పేరంటాలు, ఢిల్లీ ప్రయాణాలు తప్ప ఏపీకి వెళ్లి ఎందుకు ప్రశ్నించలేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం డిమాండ్ చేసేందుకు ఢిల్లీకి ఎందుకు వెళ్లలేదు. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ధర్నా పేరుతో షో చేస్తున్నారు. కేఎల్ఐ ఎత్తిపోతలను సక్రమంగా వాడితే 5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
రిపేరులో ఉన్న రెండు పంపుల మరమ్మతులకు రూ.10 కోట్లు ఇవ్వకుండా రెండేళ్లుగా పెండింగులో పెట్టారు .. 5 పంపులు నడిపితే సమృద్ధిగా నీరు వాడుకోవచ్చు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా భీమా, జూరాల ఆయకట్టుకు కూడా వాడుకునేలా డిజైన్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాల్వలు రద్దు చేసి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలను తీసుకువచ్చారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కొడంగల్, నారాయణపేట ప్రాంతాల్లో లక్ష 30 వేల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చేందుకు కేసీఆర్ డిజైన్ చేస్తే .. రేవంత్ రెడ్డి 60 వేల ఎకరాలకు ఒక్క పంటకు నీటికి తెచ్చేలా డిజైన్ చేశారు.
ఉన్న నీళ్లను వాడుకోకుండా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేయకుండా పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి రైతులకు ఈ సర్కారు తీవ్ర అన్యాయం చేశారు. పాలమూరు డీపీఆర్ వెనక్కి పంపి రెండేళ్లయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆంధ్రాలో గురువు, తెలంగాణలో శిష్యుడు సీఎంలుగా ఉన్నారు. శిష్యుడికి సలహాదారు ఆంధ్రా నుండి వచ్చిన ఆదిత్యనాథ్ దాస్.
ఇక జెన్ కో, రెడ్కో, ట్రాన్స్ కో కు కూడా ఆంధ్రా అధికారులను తీసుకువచ్చి వారికింద తెలంగాణ ఉద్యోగులను పనిచేయిస్తున్న దుస్థితి నెలకొంది.పాలమూరు అవసరాల కోసం 55 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో కనీసం 20 నుండి 25 టీఎంసీలకు సరిపడా రిజర్వాయర్లు నిర్మించలేదు.35 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్న పాలమూరుకు కాంగ్రెస్ చేసిన పాపం ఇది
పాలమూరు ఎత్తిపోతల కింద కేసీఆర్ 70 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు నిర్మించారు. పనికిరాదన్న పాలమూరు ఎత్తిపోతలకు రేవంత్ రెడ్డి తన మామ జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నాడు .. దాని నుండి చేపట్టనున్న రూ.1800 కోట్ల డిండి పనులు రేవంత్ తమ బావమరిదికి ఇచ్చుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టు దగ్గర ధర్నా చేయడం విచిత్రం చేతనైతే ఢిల్లీలో, అమరావతిలో ధర్నా చేయండి .. ఇక్కడ డ్రామాలు ఆపండి. పాలమూరు రంగారెడ్డి పనులను వెంటనే పూర్తి చేయాలి.
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.