విశాఖ బిడ్ రాజకీయాలపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య వ్యాఖ్య
అర్ధ దశాబ్దం క్రితం 32 మంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న ‘ విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ను రక్షించ లేకపోతే, ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఆత్మహత్య చేసుకోవటం మేలు అని, పరిపాలన నుంచి దిగిపోవటం ఉత్తమం అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కుపై అమ్మకానికి పెట్టిన బిజెపి, కొనుగోలు చేస్తామంటున్న బిఆర్ఎస్, ప్రేక్షక పాత్ర పోషిస్తున్న వైసిపి పార్టీలు ఇప్పటికైనా తుక్కు డ్రామాలు ఆపాలని మండి పడ్డారు. విశాఖ ఉక్కుకు గనులను దూరం చేసి, ఉత్పత్తిని నిర్వీర్యం చేసి, నష్టాల పేరు చెప్పి తమాషాలు చేస్తున్నట్లు ఆరోపించారు. 2లక్షల కోట్లకు పైగా ఉన్న పరిశ్రమను, దాని అనుబంధ ఆస్తులను, స్థలాలను పావలా, అర్థ రూపాయికి ఎగరేసుకు పోయోందుకు గోతి కాడి నక్కల్లా పోంచి ఉన్నట్లు ఆరోపించారు.
ప్రైవేటీకరణ చేస్తానంటున్న కేంద్ర ప్రభుత్వంను ఎదిరించడం, లేకపోతే ఎపీ ప్రభుత్వం పరిశ్రమ నిర్వహణ బాధ్యతలను స్వీకరించటం ఒకటే పరిష్కారం అన్నారు. బిడ్ పై రాజకీయాలు చేయటం మానుకోవాలి అని కుహనా మేధావులకు కూడా సూచించారు. 800 రోజులుగా విశాఖ కార్మికులు ఆందోళనలు చేస్తున్నా, మూడు ప్రాంతాల ప్రజలు ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా, అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లలేని ఏపీ ప్రభుత్వం, పార్లమెంట్లో కనీస నిరసన తెలపలేని వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారు? ఢిల్లీ పార్లమెంట్ ఆవరణలో గడ్డి పీకుతున్నారా? అని ప్రశ్నించారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలు వంటివి అని అభివర్ణించారు. ఏపీకి హోదాను గుంజుకొస్తామని నమ్మించి మోసం చేసినట్లే, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయనివ్వమంటూ ప్రైవేటుకరించేందుకు వైసీపీ సాయం చేస్తున్నట్లు ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం బిడ్ ను ఆహ్వానిస్తున్నట్లు కొందరు కుహనా మేధావులు, రాజకీయం కోసమే బిడ్ అంటూ ఇంకొందరు మేథావులు బిడ్ రాజకీయాలు చేయడం దుర్మార్గం అన్నారు. కుటుంబ యజమాని సమర్థవంతంగా లేకపోతే, ఆ కుటుంబం నవ్వుల పాలైనట్లు,వీధుల పాలైనట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్థ కారణంగానే ఏపీ నవ్వుల పాలవుతోందని, చులకన అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా కార్మిక లోకం చిత్తశుద్ధితో ఉద్యమించాలని, ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని, అప్పుడే ఉక్కు పై రాజకీయ నాయకుల కుట్రలు, కుయుక్తులు అరికట్టవచ్చని విశాఖ ఉక్కు కార్మికులను ఉద్దేశించి హితవు పలికారు. అప్రమత్తంగా లేకపోతే, ఆంధ్రుల భవిష్యత్తు అంధకారమే అని, చరిత్రలో విశాఖ ఉక్కు ఒక గుణ పాఠం గా మిగిలిపోతుందని బాలకోటయ్య హెచ్చరించారు