(నవీన్)
ఒకవైపు అంతర్జాతీయ స్థాయి హంగులతో, అధునాతన జీవనశైలికి చిరునామాగా నిలిచే ‘నోవాటెల్’ హోటల్. దాని పక్కనే, ఘుమఘుమలాడే తెలుగు రుచులతో , మన సంస్కృతికి అద్దం పట్టే ఓ చిన్న ‘పాక ఇడ్లీ’ హోటల్. విజయవాడ నడిబొడ్డున కనిపించే ఈ దృశ్యం కేవలం రెండు భిన్నమైన హోటళ్ల కలయిక కాదు, ఇది నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైవిధ్యానికి, అందులో దాగి ఉన్న అంతర్గత బలానికి ఒక ప్రబల నిదర్శనం. ఈ స్ఫూర్తితోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం జరిగితే అందులో మన సంస్కృతి కూడా అంతర్లీన మైన సహజప్రవాహంగా ఉండిపోతుంది.
నోవాటెల్ ఇచ్చే విలాసవంతమైన అనుభూతి ఎంత గొప్పదో, పక్కనే ఉన్న పాక హోటల్లో రకరకాల ఆధరువులతో లభించే వేడివేడి ఇడ్లీ ,రుచి అంతకంటే గొప్పది. అది మన నేల రుచి, మన అమ్మ చేతి వంట రుచి. ఈ రుచిలోనే మన సంప్రదాయం, మన ఆప్యాయత దాగి ఉన్నాయి.
రుచుల ఘుమఘుమలను తరతరాలుగా కొనసాగిస్తున్న కర్నూలు రెడ్డి హొటల్, తిరుపతి భీమాస్, నెల్లూరు కోమలా విలాస్, గుంటూరు ఆనంద భవన్, శంకర విలాస్, విజయవాడ బాబాయి హొటల్, రామయ్యమెస్ రాజమండ్రి లలితా మెస్, గంగరాజు పాలకోవా, రాజానగరం వద్ద గోదావరి రుచులు (తూ గో on the go) ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కోటయ్య కాజా, తాపేశ్వరం మడతకాజా, కాకినాడ సుబ్బయ్య హొటల్, విశాఖ పట్టణం వెంకటాద్రి వంటిల్లు, సాయిరామ్ హొటల్, మాడుగుల హల్వా మొదలైన ఎన్నెన్నో పాకశాలలు ప్రతి జిల్లాలో వున్నాయి. మూడు నాలుగు తరాలుగా కూడా ప్రత్యేకమైన రుచులు దెబ్బతినకుండా వ్యాపార పరంగా ఆహారసేవలు అందజేస్తున్నారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి ఎన్నెన్నో సాంప్రదాయిక రుచులు సాంస్కృతిక వారసత్వ పరంపరగా అమరావతిలో అందజేయడానికి రాష్ట్ర రాజధాని నిర్మాణ ప్రణాళికలోనే చోటు వుంచాలి
సింగపూర్ నుండి మనం మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని నేర్చుకోవచ్చునేమో కానీ, మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని, మన జీవన విధానాన్ని ఏ దేశం నుండీ దిగుమతి చేసుకోలేం.
అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయం. ఇందుకోసం సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రణాళికలను అధ్యయనం చేయడం, వారి సహకారం తీసుకోవడం హర్షణీయ పరిణామం. ఆకాశహర్మ్యాలు, విశాలమైన రహదారులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఒక నగరానికి అవసరమే.
అయితే, ఈ అభివృద్ధి క్రమంలో మన అస్తిత్వాన్ని, మన మూలాలను మరచిపోతే ఆ అభివృద్ధి నిరర్థకం. అభివృద్ధి అంటే మన మూలాలను విస్మరించి పాశ్చాత్య పోకడలను గుడ్డిగా అనుకరించడం కాదు. మన సంప్రదాయమనే పునాదిపై ఆధునిక సౌకర్యాలనే సౌధాన్ని నిర్మించుకోవడమే నిజమైన అభివృద్ధి. నోవాటెల్ వైభవాన్ని ఆస్వాదిస్తూనే, పాక హోటల్ రుచిని మర్చిపోని వాళ్ళే నిజమైన ఆంధ్రులు. అమరావతి నగరం కూడా అదే విధంగా ప్రపంచానికి ఒక ఆదర్శ నగరంగా, ఆధునికతకు, సంప్రదాయానికి వారధిగా నిలవాలని ఆశిద్దాం.
సమతుల్య అభివృద్ధి ప్రణాళిక అవసరం
కాబట్టి, అమరావతి నిర్మాణంలో ఈ రెండు అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రణాళికలు కేవలం భవనాల నిర్మాణానికే పరిమితం కాకూడదు.
అమరావతి భవనాల డిజైన్లలో మన చారిత్రక వాస్తుశైలి, శిల్పకళ, సాంప్రదాయిక ఆహారసేవతో వంటశాలల వైభవం, ఉట్టిపడేలా చూడాలి. కళలు, చేతివృత్తుల ప్రదర్శన, అమ్మకాల కోసం ప్రత్యేకంగా ‘కళా గ్రామాలను’ ఏర్పాటు చేయాలి.
మన సంస్కృతిని ప్రతిబింబించేలా మ్యూజియంలు, సాంస్కృతిక కేంద్రాలు, వేదికలను నిర్మించాలి.
( రచయిత సీనియర్ పాత్రికేయులు)