– ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఎందుకు?
– పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడి దాడుల గురించి కేంద్రం గానీ, ఆయన గానీ ఎందుకు మాట్లాడటం లేదు?
– ఆ దాడుల్లో దొరికిన డబ్బులు ఎన్నో ఎవరూ చెప్పలేదు
– పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యాడా?
బీజేపీతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డితో పొంగులేటి కలిసిపోయడా?
– తెలంగాణ భవన్ లో భద్రాచలం నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– హాజరైన బిఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు, పలువురు బిఆర్ఎస్ ముఖ్య నాయకులు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నైజం మోసమే పునాది. అబద్ధాల పునాదుల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి చేతిలో ప్రజలు మోసపోవడంలో వారి తప్పు లేదు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. పాతకాలపు కాంగ్రెస్ రోజులను తిరిగి తీసుకువచ్చింది.
కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో పార్టీగా మేం విఫలమయ్యాం. మనం చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. ఆ రోజే కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ అని ప్రజలకు వివరిస్తే బాగుండేది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనను నడిపించే సత్తా లేదు. అందుకే ప్రతిసారీ పాత ప్రభుత్వంపై నెపం నెట్టివేస్తున్నది.
తమ చేతగానితనాన్ని గతం చాటున దాచిపెడుతున్నది. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవు. కాంగ్రెస్కు ఓటమి ఖాయం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు అంత పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలి. నిజంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్కు దమ్ముంటే, ‘వారు మా కాంగ్రెస్లో చేరారు, ఉప ఎన్నికలకు పోదాం’ అని చెప్పాలి.
మంత్రి పొంగులేటిపై విమర్శలు
తంతే గారెలు బుట్టలో పడినట్టు, లక్కీ లాటరీలో పడ్డట్టు మంత్రి అయిన పొంగులేటి పెద్దగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో అహంకారంతో ఎగిరితే తిప్పికొడతారు. మళ్ళీ పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దాం. ఏడాది క్రితం పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడి దాడుల గురించి కేంద్రం గానీ, ఆయన గానీ ఎందుకు మాట్లాడటం లేదు? ఆ దాడుల్లో దొరికిన డబ్బులు ఎన్నో ఎవరూ చెప్పలేదు.
మరి పొంగులేటి బీజేపీతో కుమ్మక్కయ్యాడా? లేదా బీజేపీతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డితో పొంగులేటి కలిసిపోయడా? బతికినంత కాలం ధైర్యంగా బతకాలి కానీ ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఎందుకు?