– నీ కొడుకులా నా కొడుకు గంజాయి వ్యాపారం చేయడం లేదు
– మా సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు
– ఐదేళ్లు అరాచకాలకు పాల్పడి.. ఇప్పుడు కులాల మధ్య కుంపట్లకు ప్లాన్
– రప్పా రప్పా నరుకుతాం.. చీకట్లో నరికి తెల్లారితే పరామర్శించడం సైకోల తత్వం
– అవినీతి ఆరోపణలు నిరూపించకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవు
– బీసీ కార్డు వాడుకుని రాష్ట్రంలో అల్లర్లకు ప్లాన్ చేయడం సిగ్గుచేటు
– అడ్డగోలుగా మాట్లాడితే.. ఊరుకునేది లేదు
– పేర్ని నానికి మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
మచిలీపట్నం: అచ్చోసిన ఆంబోతుల్లా వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని, వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. పేర్ని నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారసత్వంగా వచ్చిన వ్యాపారాలను అవినీతి సంపాదన అని చెప్పడానికి వైసీపీ నేత పేర్ని నానికి సిగ్గుండాలన్నారు. తల్లిని, తండ్రిని రోడ్డున పడేశాడు. కొడుకుతో గంజాయి వ్యాపారం చేయించి నియోజకవర్గంలో యువత జీవితాలను బుగ్గి చేసిన నీచుడు పేర్ని నాని అన్నారు. కొడుకుని అందలం ఎక్కించాలని అక్రమ సంపాదనను కుమ్మరించినా.. ప్రజలు ఈడ్చి తన్నారు. అయినా సిగ్గులేకుండా పోయిందన్నారు.
మా తాత, ముత్తాతల నుండి ఉన్న ఆస్తుల్ని చూపించి.. నేను అవినీతి సొమ్ము కూడబెట్టుకున్నానని చెప్పడంపై మండిపడ్డారు. ఐదారు దశాబ్దాల క్రితమే వందలాది మందికి మా నాన్న ఉపాధి కల్పించారు. వారు కష్టార్జితంతో ఎంతో మందికి ఉపాధి కల్పించిన చరిత్ర మా కుటుంబానిది. ఇసుకలో దోపిడీ చేశానని చెబుతున్న పేర్ని నాని.. రామాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా? మా నాన్న రాసిన వీలునామా ప్రకారం ఆస్తులు పంచుకున్నాం. దాన్ని కూడా రాద్దాంతం సృష్టించి కుటుంబాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు. లంకిశెట్టి భూములకు 2016లో రిజిస్ట్రేషన్ చేయించి రూపాయికి మూడు రూపాయలు కట్టించింది మీరు కాదా? ఇళ్లు కట్టుకోవాలనుకున్నవారికి పర్మిషన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు డిమాండ్ చేసిన పేర్ని నాని కూడా మాట్లాడడం హాస్యాస్పదం.
మచిలీపట్నంలో రెడీ మిక్స్ ప్లాంట్స్ లేకపోవడంతో మేఘా నుండి కాంక్రీట్ తెప్పించుకుంటే కాంక్రీట్ తిన్నానని అనడానికి సిగ్గుండాలి. రాజారత్నపురం ప్రాంతంలో మా నాన్న, తాత భూములు సేకరించి అక్కడ రైస్ మిల్లు ఏర్పాటు చేశారు. చెరువుల కారణంగా ఇబ్బంది ఎదురైతే వాటిని ఐస్ ఫ్యాక్టరీగా మార్చారు. వాటిని మా అన్న, వారి కుమారులు నడుపుతున్నారు. దాన్ని కూడా రాద్దాంతం చేయాలని ప్రయత్నించడం పేర్ని నాని నీచ మనస్తత్వానికి నిదర్శనం. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తా. నా కుటుంబం గురించి గానీ, కుటుంబ సభ్యుల గురించి గానీ తేడాగా మాట్లాడితే క్షమించేది లేదు. మచిలీపట్నంలో చిన్న పరిశ్రమ పెట్టుకుని పది మందికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్న నా కొడుకు గురించి తేడాగా మాట్లాడుతావా? నీ కొడుకులా నా కొడుకు గంజాయి వ్యాపారం చేయడం లేదు. మర్యాదగా మాట్లాడినపుడు మర్యాదగా వ్యవహరిస్తాం.. తేడాగా మాట్లాడితే నాలుక చీరేస్తాం. నేను సంపాదించే ప్రతి రూపాయికి, ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్క ఉంది. అవినీతి చేస్తున్నామని మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
సివిల్ సప్లైస్ మినిస్టర్‌గా ఉన్న కొడాలి నానిని అడ్డం పెట్టుకుని, రవాణా శాఖ మంత్రిగా రేషన్ వాహనాల కొనుగోలులో కమిషన్లు దండుకోవడం వాస్తవం కాదా? రేషన్ బియ్యం బొక్కేయడం వాస్తవం కాదా. నేను కట్టించిన రామాలయం గురించి మాట్లాడుతున్న పేర్ని నానికి బుర్ర పని చేస్తుందా అన్నారు. వైసీపీ ఐదేళ్ల అరాచకాలను చూసిన ప్రజలు గెలిపించడం కష్టమని తెలిసి.. కొడుకుని నిలబెట్టాడు. భార్య పేరుతో గోదాము కట్టించి.. 8000 బస్తాల బియ్యం దారి పట్టించి దొరికిపోవడంతో డబ్బు చెల్లిస్తానన్నాడు. దొంగ పట్టాల పంపిణీతో ప్రజల్ని నిండా ముంచాడు. ఇప్పుడు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే తాట తీస్తాం.
బియ్యం కేసులో గోడ దూకి పారిపోయిన నీవు కూడా చంద్రబాబు గురించి మాట్లాడేవాడివేనా అని ప్రశ్నించారు. గుడివాడ వెళ్తే ప్రజలు తంతారనే భయంతో ఇంట్లో దాక్కుని కులం, మతం, ప్రాంతం పేరుతో కుట్రలకు ప్లాన్ చేశాడు. బీసీ మహిళ పేరుతో రాజకీయం చేస్తున్న పేర్ని నాని.. దుట్టా రామచంద్రరావు కుమార్తెను జెడ్పీ ఛైర్మన్ చేయడానికి ప్రయత్నించడం వాస్తవం కాదా? మీపై నమ్మకం లేక గుడ్లవల్లేరు నుండి హారికను గెలిపించి ఛైర్మన్ చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు.
మీ అరాచక పాలన కారణంగా మిమ్మల్ని 151 సీట్ల నుండి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే జీరో చేయడం తథ్యం. మహిళ గురించి అడ్డగోలుగా మాట్లాడడమే కాకుండా.. సమర్ధించినందుకు ఆమె నాకు మూటలు పంపిస్తోందనడానికి సిగ్గు పడాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఆడబిడ్డను తల్లిగా, చెల్లిగా భావించే సంస్కృతి మాది. ఆడ బిడ్డల గురించి అడ్డగోలుగా మాట్లాడితే తోలు వలిచేస్తామని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు జవాబుదారీగా, ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకుంటున్నాం కాబట్టే మీరు రోడ్లపై తిరుగుతున్నారు. మాకు చేతకాక కాదు.. చేవ జచ్చి కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ప్రజాస్వామ్యబద్దంగా నడచుకుంటున్నాం.
అక్రమ కేసు పెట్టినా, ఇంటిపైకి పోలీసుల్ని పంపించినా మౌనంగా ఉన్నామంటే అది కేవలం మా సంస్కారం. నీ అరాచకం కారణంగా మా మావయ్యను కోల్పోయాం. మీ దుర్మార్గాలు, అక్రమ కేసుల కారణంగా మానసికంగా కుంగిపోయి మాకు దూరమయ్యారు. చిన్నప్పటి నుండి కష్టబడి పైకి వచ్చిన వ్యక్తిని ఎన్ని రకాలుగా దూషించావో మరిచిపోయావా? మీరు అడ్డగోలుగా వాగుతూ పోతే చూస్తూ ఊరుకుంటున్నామని, తిరబడటానికి ఎంతో సమయం పట్టదని గుర్తుంచుకోవాలన్నారు.
గత ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని సంపాదించిన ఆస్తుల వివరాలు బయటపెట్టమంటావా? అవినీతికి పాల్పడిన వారిని ఎవరూ ప్రోత్సహించబోరు అని గుర్తుంచుకో. మాట్లాడిన ప్రతి మాటకు, చేసిన ప్రతి చర్యకూ ప్రతిచర్య ఉంటుంది. అసెంబ్లీలో చంద్రబాబును అవమానించినందుకు ఒకడికి రంగు వెలిసింది. మరొకడికి గుండెపోటు వచ్చింది. ఇక పేర్ని నాని గోచితో తిరగాల్సిందే. మీలా మేము వ్యవహరించినట్లైతే.. తొలి రోజునే నిన్ను జైల్లో పెట్టేసే వాళ్లం. బియ్యం దొంగతనం, నకిలీ పట్టాల కేసులన్నీ చట్టబద్దంగా విచారణ జరుగుతోందే తప్ప.. ఎక్కడా మేం అడ్డగోలుగా వ్యవహరించలేదు. పోతేపల్లిలో గౌడ సోదరులను కొట్టినపుడు బీసీ కార్డు ఏమైంది? సుల్తానగరంలో అక్రమ కేసులు పెట్టింది బీసీలపై కాదా? నీలాంటి బీసీ ద్రోహులు బీసీల గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్ రెడ్డి బాబాయిని గొడ్డలి వేటు వేసి.. వేటేసినోడిని వెనకేసుకు తిరుగుతున్నాడు. వారిని ఆదర్శంగా తీసుకుని వైసీపీ నేతలు కూడా రాత్రి గొడ్డలితో వేసేసి తెల్లారే సరికి పరామర్శలకు ప్లాన్ చేస్తున్నారన్నారు.
మీ నాయకుడు పల్నాడులో సింగయ్య అనే దళితుడిని కారుతో తొక్కించి చంపారు. రప్పా రప్పా ప్రజల్ని నరుకుతాం అన్నవాడిని సైకో అంటే తప్పేంటి? రాత్రి చంపేసి తెల్లవారాక పరామర్శించాలన్న వాడిని సైకో అంటే తప్పేంటి? పేర్ని నానీ.. వయసు ముఖ్యం కాదు అందుకు తగ్గట్లుగా వ్యవహరించడం ముఖ్యమని తెలుసుకో. అడ్డగోలుగా వ్యవహరించి అరెస్టైతే.. సింపతీ కొట్టేయవచ్చని పేర్ని నాని ప్రయత్నిస్తున్నాడు.
దేశంలో ఇంత విచ్చలవిడితనం ఏ రాజకీయ పార్టీలో కూడా లేదు. మా పార్టీ నాయకుల్ని మేము అదుపు చేస్తున్నాం కాబట్టే వైసీపీ నాయకులు విర్రవీగుతున్నారు. జగన్ రెడ్డి సైకో కాబట్టే.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేసినోడికి, చంద్రబాబు ఇంటిపై దాడి చేసినోడికి, పల్నాడులో దాడి చేసిన వారికి పదవులు కట్టబెట్టారు. ప్రశాంతి రెడ్డి గురించి తప్పుగా మాట్లాడిన వారిని అదుపు చేయాల్సింది పోయి.. సమర్ధించబట్టే వైసీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. ఇలాంటి అరాచక శక్తుల్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి. అరాచకాన్ని, దాడుల్ని, హత్యల్ని ప్రోత్సహించే వారిని ప్రోత్సహించడమంటే.. మన భవిష్యత్ తరాలను నాశనం చేసుకోవడమేనని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు