* అవినీతి.. కుటుంబ పాలనలో ఒకేలా కేసీఆర్.. విజయన్ కుటుంబాలు
* కేంద్ర నిధులు మోదీ కరుణ కాదు ప్రజల హక్కు
* యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కొచ్చి: యూడీఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి.. తమ ట్రాక్ రికార్డు పరిశీలించుకోవచ్చని ఆయన సూచించారు.
కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ఆయన మంత్రులు తెలంగాణకు వస్తే తాము గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా చూపుతామని సీఎం తెలిపారు. కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి యూడీఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో గురువారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళంలో పినరాయి విజయన్ హయాం ముగిసిందని, ఇక యూడీఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందన్నారు.
* మోదీ బ్రదర్స్… పినరాయి.. కేసీఆర్‌ల మధ్య పోలికలు..
ముఖ్యమంత్రి పినరాయి విజయన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని, కేరళంనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ.. విజయన్ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. దేవుడి స్వంత రాష్ట్రంలో దేవుడి ఆస్తికీ రక్షణ లేదంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని సీఎం లేవనెత్తారు.
కేరళంలో గత పదేళ్లుగా పినరాయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతోందని, అలాగే 2014 నుంచి సుమారు పదేళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను పాలించారన్నారు. పినరాయి కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరాయి విజయన్, కేసీఆర్‌ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 2023లో తెలంగాణలో మాదిరి మార్పే ఈసారి కేరళంలో చోటుచేసుకుంటుందని సీఎం అన్నారు.
పినరాయి విజయ్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపుతారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. “పో మోనే విజయా” వ్యాఖ్యపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… విజయన్ తమకు రాజకీయ ప్రత్యర్థి అని, మోదీలా మాట్లాడటం తనకు సాధ్యం కాదని, విమర్శించకుండా ఉండటం తన స్వభావం కాదని స్పష్టం చేశారు.
* అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ట వినియోగం, రాష్ట్రానికి రావలసిన నిధుల సాధన.. తమ ప్రాధాన్య అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరుణ కాదని.. అది ప్రజల హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని సీఎం తెలిపారు. యూడీఎఫ్ కార్మికుల కూటమి అని, కూటమిలో నిజాయితీగల నాయకులు ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు.
* తొలి క్యాబినెట్ నుంచే హామీల అమలు…
కేరళంలో యూడీఎఫ్ గ్యారంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామని సీఎం తెలిపారు.
67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో పాటు ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని సీఎం వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని సీఎం తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047 ప్రకారం తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కేపీసీసీ ప్రెసిడెంట్ సన్నీ జోసెఫ్, కేరళ సీఎల్పీ నేత వి.డి.సతీషన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీప్ దాస్ మున్షీ, యూడీఎఫ్ కన్వీనర్ ఆదూర్ ప్రకాష్, ఐయూఎంఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.కె.కున్హాలికుట్టి తదితరులు పాల్గొన్నారు.
* కేరళం లో ఇందిరా ఐదు గ్యారంటీలు…
కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోలోని ఇందిరా ఐదు గ్యారంటీలు
1. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్టీసీ) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
2. కాలేజీ చదువుతున్న బాలికలకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం
3. సంక్షేమ పింఛన్లు నెలకు రూ.3 వేలకు పెంపు
4. మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాండీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
5. యువతకు స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
* ఐదు గ్యారంటీలతో పాటు సముద్ర, విమానయాన రంగాలకు సంబంధించి ఐదు డ్రీమ్ ప్రాజెక్టులు, వయనాడ్‌లో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు వాగ్దానాలు ఉన్నాయి.