– నల్లమల బిడ్డను అంటావు….అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పడావ్ పెట్టావు
– చంద్రబాబుకు గురు దక్షిణగా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు
– రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
అచ్చంపేట: ఈ నెల 28న అచ్చంపేటలో జరిగే కె.టి.ఆర్ బహిరంగ సభ సభా స్థలి,కార్యాచరణ ప్రణాళిక పర్యవేక్షించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాత్రికేయ సమావేశములో మాట్లాడుతూ.. సి.ఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్రతినిధిగా పని చేస్తూ, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఆంధ్రా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
కె.సి.ఆర్ ప్రభుత్వం కృష్ణా,గోదావరికి వచ్చే వరద ప్రతిఒక్క నీటి బొట్టును ఒడిసిపట్టి సాగు నీరు అందించిందని కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వరదలు వచ్చిన 45రోజుల పాటు నీళ్లను సముద్రం పాలు జేసిందని వాపోయారు.
కర్ణాటక ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును ధిక్కరిస్తూ ఆల్మట్టి డ్యాం ఎత్తు సముద్ర మట్టానికి 519మీటర్ల నుండి 524 మీటర్లకు పెంచడానికి 70వేల కోట్లతో ఒక లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అందించాలని కుట్రలు పన్నుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఎవరి ప్రయోజనాలకోసం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నిజంగా నీవు నల్లమల బిడ్డవు అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన 75వేల ఎకరాలకు నీళ్లు అందించే అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పడావ్ పెట్టావు అని ప్రశ్నించార. అదేవిధంగా బల్మూర్ రిజర్వాయర్,మున్నానూరు చెన్న కేశవ రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేస్తలేవు అని విమర్శించారు.
గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే కేసులు వేసి అడ్డుకున్నది మీరు కాదా? ప్రజలు మీకు అధికారం ఇచ్చి తప్పు చేశామని బాధపడుతున్నారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అసంపూర్తిగా ఉన్న ఎత్తి పోతల పథకాలు,రిజర్వాయర్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అచ్చంపేటలో కె.టి.ఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.