-గెలుపు సిబిఐ దా? వైయస్ కుటుంబానిదా??
-ఇది సిబిఐ, వైఎస్ కుటుంబానికి మధ్య జరుగుతున్న యుద్ధమే…
-కేంద్ర బలగాల సహకారం ఉంటేనే సీ బీ ఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయగలరు… లేకపోతే కష్టమే
-అవినాష్ రెడ్డి అరెస్ట్ కు ఆయన తల్లి అనారోగ్యానికి సంబంధమే లేదు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
తమ ప్రభుత్వం పోర్టుల యజ్ఞం చేస్తుంటే, ప్రతిపక్షాలు రాక్షసుల్లా భగ్నం చేస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. పోర్టుల యజ్ఞం చేస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, రెండు పోర్టులను ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు కట్టబెట్టింది. పోర్టుల కోసం తమ పార్టీలోని వారు దేవుళ్ళలా యజ్ఞాలు చేస్తున్నారని చెబుతో న్న జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా దేవుళ్ళు ఎవరు, రాక్షసులు ఎవరని ఒక ఒపీనియన్ పోల్ పెట్టాలి. అందులో నూటికి 99 శాతం మంది మన పార్టీ ప్రజా ప్రతినిధులైన బాలశౌరి , పేర్ని నానితో పాటు జగన్మోహన్ రెడ్డిని రాక్షసులనే అంటారు. కర్నూలులో మన పార్టీ ఎమ్మెల్యేలు, గుండాలు కలిసి ఎంపీ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయడానికి వీలు లేదని సిబిఐ అధికారులనే రాక్షసులపై తిరగబడుతున్నారా?, మీ దృష్టిలో సాధారణ ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, సిబిఐ అధికారులు కూడా రాక్షసులే మీరు మాత్రం అమృతం తాగిన దేవతలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైఎస్ కుటుంబానికి, సిబిఐ అధికారులకు మధ్య జరుగుతున్న ఈ దేవ, దానవ యుద్ధంలో ఎవరు నెగ్గుతారో చూడాలి. గెలుపు వైయస్ కుటుంబానిదా?, సిబిఐ దా??. కర్నూలుకు చెందిన మా పార్టీ ప్రజా ప్రతినిధులు, పులివెందుల రౌడీలు మారణాయుధాలతో కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రి ఆవరణలో మాటు వేసి ఉన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటూ, విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయాలంటే, సిబిఐ అధికారులకు కేంద్రబలగాలు సహకరించవలసిందే. లేకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు, ఎంతో చెడ్డ పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం లేదు. అయినా జగన్ మోహన్ రెడ్డి తన ప్రయత్నాన్ని తాను చేస్తూనే ఉంటాడని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
అవినాష్ తల్లికి నిజంగానే ఆరోగ్యం బాగా లేకపోతే హైదరాబాద్ కు తరలించేవారు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లికి ఆయన చెబుతున్నట్లుగా ఆరోగ్యం బాగా లేకపోతే హైదరాబాదుకు తరలించి చికిత్స అందించి ఉండేవారు. సుప్రీం కోర్టులో అప్పియరెన్స్ కోసం 15 లక్షల రూపాయల ఖర్చు చేయగలిగిన అవినాష్ రెడ్డి తన తల్లిని హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రులకు ప్రత్యేక విమానంలో తరలించడానికి ఐదు లక్షలు, ఆసుపత్రి ఖర్చులకు మరో పది లక్షల రూపాయలు వెచ్చించలేరా?. అయినా అవినాష్ రెడ్డి అంటే ఎంతో పరి తపించే జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి ఆరోగ్యం బాగా లేకపోతే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆ మాత్రం చేయరా?. అనారోగ్యం పాలైన ఎమ్మెల్యేలనే ప్రత్యేక విమానంలో తరలించిన మహా మనిషి జగన్మోహన్ రెడ్డి, అటువంటిది తనకు వరసకు సోదరుడైన అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే, ప్రత్యేక విమానంలో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాదుకు తరలించలేరా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రిలో అయితే తాము చెప్పినట్లుగా వైద్య నివేదికలను ఇస్తారని ఉద్దేశంతోనే అవినాష్ రెడ్డి తల్లిని అక్కడే ఉంచి, వైద్య చికిత్స అందజేస్తున్నట్లుగా డ్రామా కొనసాగిస్తున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాదుకు తరలించకుండా, తన సమీప బంధువుల ఆస్పత్రిలో పెట్టి ఆమెకు వైద్య చికిత్స జరిపిస్తున్నారంటేనే పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన అవినాష్ రెడ్డి తల్లిని వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులు పరామర్శించిన దాఖలాలు లేవు. అంటే ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని వారందరికీ కూడా తెలుసు. కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రి చుట్టూ పులివెందుల ఆకు రౌడీలు మారణాయుధాలతో పహారా కాస్తున్నారు. సిబిఐ అధికారులను ఏమి చేయగలమని వారు అనుకుంటున్నారో తెలియదు. ఇంకా రాజనాల, నాగభూషణం మార్క్ రౌడీయిజం చెల్లదు. కొంతమంది చోటామోటా నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం సిబిఐ ని హెచ్చరికలు చేయడం విడ్డూరంగా ఉంది. ఇన్నాళ్లు అడిగినప్పుడల్లా సమయం ఇచ్చి ఉదాసీన వైఖరిని ప్రదర్శించిన సిబిఐ, ఇప్పుడు ఆగ్రహంగా ఉంది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని కర్నూలు జిల్లా ఎస్పీకి సమాచారం అందించిందన్నారు.
సుప్రీంకోర్టులో అవినాష్ కు చుక్కెదురు
ఒకవైపు కర్నూలు విశ్వ భారతి ఆసుపత్రి ఆవరణలో ఆకు రౌడీలను పెట్టుకుని సిబిఐ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న అవినాష్ రెడ్డి, సుప్రీం కోర్టులోను పిటిషన్ మెన్షన్ చేయగా చుక్కెదురయ్యింది. జస్టిస్ సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ బెంచ్ ముందు మెన్షన్ చేసే ప్రయత్నం చేయగా, నాట్ బిఫోర్ అన్నారు. జస్టిస్ సంజయ్ కరోల్ తనయుడు, డాక్టర్ వైయస్ సునీత తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సిద్ధార్థ లూత్రా వద్ద అప్రెంటీస్ గా పనిచేస్తుండడం వల్ల నాట్ బిఫోర్ అని పేర్కొన్నారు. జస్టిస్ నరసింహ, జెకె మహేశ్వరి బెంచ్ ముందు మెన్షన్ చేయడానికి లేదు. అయినా, మెన్షనింగ్ రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి మెన్షన్ చేయించాలని ధర్మాసనం సూచించింది. అయితే ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాల్సిందేమీ లేదని, సెకండ్ వీక్ ఆఫ్ వెకేషన్ కోర్టులో పోస్ట్ చేయమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. ఒక వైపు సుప్రీంకోర్టులో పిటిషన్ మెన్షన్ చేసిన అవినాష్ రెడ్డి, మరొకవైపు తన తల్లికి ఆరోగ్యం మెరుగుపడితే పది రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని సిబిఐ కి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది. అలాగే సుప్రీం కోర్టులో మెన్షన్ చేశామని, రేపు కోర్టులో విచారణకు వస్తుందని తన లేఖలో ఆయన పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది.
కోర్టులో ఎప్పుడు విచారణకు వస్తుందో చెప్పడానికి అవినాష్ రెడ్డి ఎవరు?. అయినా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని పేర్కొంటే, సిబిఐ అధికారులు ఊరుకుంటారా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. తొలుత మూడు, మూడు రోజులు వాయిదాలను అడిగిన అవినాష్ రెడ్డి ఇప్పుడు ఏకంగా, ఏడు రోజులు వాయిదా అడుగుతున్నారని అపహాస్యం చేశారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని , అవినాష్ రెడ్డి చెప్పింది నిజమని అనుకున్నా తల్లి అనారోగ్యానికి అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సంబంధం ఏమిటి?. ముద్దాయిని అరెస్టు చేసే ముందు ఆసుపత్రిలో ఆయన కు మాత్రమే వైద్య పరీక్షలు చేపిస్తారు కానీ, ఆయన ఇంటిల్లిపాదికి వైద్య పరీక్షలు చేయించారు. గతంలో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అరెస్టు చేసిన సిఐడి పోలీసులు, తీవ్ర రక్తస్రావం జరిగి సీటు పూర్తిగా రక్తంతో తడిచిపోయిన విజయవాడకు తరలించి, హింసించారు. అవినాష్ ప్రస్తుతం కత్తిలా ఉన్నారు. ఆయన్ని అరెస్టు చేసిన తరువాత ఆయన తల్లికి ఆపరేషన్ జరిగితే ఫెరోల్ పై వచ్చి పరామర్శించవచ్చు. అవినాష్ రెడ్డి తల్లికి అనారోగ్యంగా ఉన్నదన్న మాట ఉత్తిదేనని ఆయన బంధువులకు తెలుసు. తుచ్చమైన రాజకీయాల కోసం డమ్మీ ఆపరేషన్ చేస్తే ఆవిడ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. క్షుద్ర రాజకీయాల కోసం కుట్ర చేసి తన భార్యకు ప్రాణాపాయ పరిస్థితి తీసుకువస్తే, వై.ఎస్ భాస్కర్ రెడ్డి సహించే వ్యక్తి కాదన్నారు.
పోలీసుల సహకారం లభించదనే హైదరాబాద్ కు తరలించలేదు
వైయస్ అవినాష్ రెడ్డి తల్లిని హైదరాబాదుకు తరలించకుండా, కర్నూలులోని తమ బంధువుల ఆసుపత్రిలో పెట్టి వైద్య చికిత్స చికిత్స అందిస్తున్నట్లు డ్రామా నడిపించడానికి కారణాలు లేకపోపోలేదు. హైదరాబాదులో అయితే ఇంత బహిరంగంగా పోలీసుల మద్దతు లభించదని వారికి తెలుసు. ఏదో నన్ను అరెస్టు చేసినప్పుడు లభించినట్లుగా లోపాయకారి మద్దతు మాత్రమే ఉంటుందని భావించి, అవినాష్ తల్లిని కర్నూలులోని విశ్వ భారతి ఆసుపత్రిలో పెట్టి చికిత్స అందిస్తున్నట్టుగా అందర్నీ భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసులు పేర్కొనగానే, ఆయన అనుచరులు ఆసుపత్రి ముందు ధర్నాలు, సత్యాగ్రహాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉంది. ధర్నాలు, సత్యాగ్రహాలు నిర్వహిస్తే హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తిని సిబిఐ అరెస్టు చేయకుండా ఉంటుందా?. సిబిఐ అంటే అంత అలుసయిపోయిందా జగన్మోహన్ రెడ్డి… నాలుగేళ్లుగా న్యాయ విచారణకు హాజరు కాకపోయినా ఊరుకుంద నేనా మీకు సిబిఐ అంటే ఇంత అలసత్వం అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు.
అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ఎస్పీ స్థాయి వ్యక్తి పేర్కొన్నారంటే అనుభవ రాహిత్యం వల్ల అని ఉంటారని సరి పెట్టుకోవచ్చు. కానీ రిటైర్మెంట్ దగ్గర్లో ఉన్న రాష్ట్ర డిజిపి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎందుకని అరెస్టుకు సహకరించడం లేదు. వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ ని కాపాడేందుకు కడప జిల్లాకే చెందిన ముఖ్యమంత్రి, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు లు సహకరిస్తున్నారనడంలో సందేహం లేదు. కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తల్లిని పెట్టి అరెస్టు కాకుండా, పోలీసులను పహారా పెట్టడం విష్మయాన్ని కలిగిస్తోంది. ఒక సాధారణ ఎంపీకి పోలీసులు సలాం కొట్టాల్సిన పనిలేదు. సాధారణ ఎంపీ అని ఎందుకు అంటున్నాను అంటే, ఒక మామూలు పోలీసు అధికారి వచ్చి సిఆర్పిఎఫ్ భద్రతా బలగాల రక్షణ కలిగిన నన్ను అరెస్టు చేయగ లేనిది, ఆకు రౌడీలను పెట్టుకున్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేరా?. నన్ను అరెస్టు చేసే సమయంలో తెలంగాణ పోలీసులు కూడా జీ హుజూర్ అన్నట్లుగా, ఆంధ్ర సిఐడి పోలీసులకు సహకరించారు .
మరి ఇప్పుడు, సిబిఐ అధికారులకు ఆంధ్ర పోలీసులు ఎందుకు సహకరించడం లేదు. రేపో, మాపో రిటైర్డ్ అయ్యే రాజేంద్రనాథ్ రెడ్డి, జవహర్ రెడ్డిలు కూడా ఒక గుండాకు మద్దతునిస్తూ, తామేమి చేయలేమని చేతులెత్తేయడం దారుణం. ముఖ్యమంత్రికి వరుసకు తమ్ముడైన వ్యక్తిని అరెస్టు చేయడానికి చట్టపరమైన ప్రతిబంధకాలు లేకపోయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని నేను అనుకోవడం లేదు. అవినాష్ రెడ్డి ఉత్తరం రాయగానే కర్నూలుకు వెళ్లిన సిబిఐ అధికారులు తోకముడిచి వెనక్కి వస్తారని భావించడం లేదు. ఈరోజు సాయంత్రం వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని నేను భావిస్తున్నాను. ఈనెల 27 వరకు అవినాష్ రెడ్డి కోరినట్లుగా వాయిదా నిచ్చి సిబిఐ తన పరువు తానే తీసుకుంటుందని సోషల్ మీడియాలో నెటిజనులు చేస్తున్న విమర్శలతోను ఏకీభవించడం లేదు. ఎవరెన్ని కుట్రలు చేసినా అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని నేను భావిస్తున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
నెమ్మదిగా తాడేపల్లి ప్యాలెస్ ను చేరుతున్న కథ
వైఎస్ వివేక హత్య జరిగిన రోజు నాలుగున్నర గంటలకు జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చింది తానేనని వైయస్ అవినాష్ రెడ్డి , సిబిఐ అధికారుల విచారణలో ఎక్కడ అంగీకరిస్తారో నన్న భయం ముఖ్యమంత్రిని పట్టుకున్నట్లు కనిపిస్తోంది. సిబిఐ విచారణలో ప్రభుత్వ ప్రధాన మాజీ కార్యదర్శి అజయ్ కల్లం ఈ విషయాన్ని చెప్పేసి, చెప్పలేదని అంటున్నారేమో. నెమ్మదిగా ఈ కథ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. బందర్ పోర్టుకు గతంలో ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించగా, తాజా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రారంభించడం అదేదో సినిమాలో చెప్పినట్టుగా నా చెల్లికి జరగాలి మళ్ళీ మళ్లీ పెళ్లి అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.