– హైదరాబాద్‌లో లేని రేట్లు ఇప్పుడు వైజాగ్‌లో ఉన్నాయి
– తెలంగాణలో ఒక హైదరాబాద్‌ను పట్టుకుని తెలంగాణ అంతా ఏదో అయిపోతుందని ప్రజలకు చెప్పే ప్రయత్నం
– మీ రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలను కించపరచడం సరికాదు
– దయచేసి జాగ్రత్తగా మాట్లాడాలనేది మా విన్నపం
– చంద్రబాబు మాటలను కేసీఆర్ ఎలా నమ్మారో..?
– నాలుగేళ్లలో ఏపీలో ఎన్ని రోజులున్నావో చెప్పు పవన్…?
ఉపవాసాలు చేస్తే ముఖ్యమంత్రి అయిపోతావా పవన్..?
– నేను గెలవను అని పవన్ ఒప్పుకుంటున్నాడు
– కానీ నిన్ను ప్రజలే గెలిపించరు
– రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
మీ రాజకీయ అవసరాల కోసం పక్క రాష్ట్రాలను కించపరచడం సరికాదు:
కేసీఆర్ తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చని అన్నారు. వైజాగ్‌లో ఒక ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు. హైదరాబాద్‌లో లేని రేట్లు ఇప్పుడు వైజాగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో ఒక హైదరాబాద్‌ను పట్టుకుని తెలంగాణ అంతా ఏదో అయిపోతుందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా చంద్రబాబు చెప్పాడని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పందంగా ఉంది. చంద్రబాబు మాటలను ఆయన ఎలా నమ్మారో..? దయచేసి మీ అవసరాల కోసం పక్క రాష్ట్రాలను, ప్రభుత్వాలను, ప్రాంతాలను కించపరచడం సమంజసం కాదు. దయచేసి జాగ్రత్తగా మాట్లాడాలనేది మా విన్నపం.
జగన్ ని పంపించేద్దాం కాదు…ప్రజలు మిమ్మల్నే హైదరాబాద్ తరిమేశారు:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులమీదుగా దాదాపు రూ.1400 కోట్ల విలువైన పెట్టుబడులకు ఈరోజు మూడు శంకుస్థాపనలు, ఒక ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దూసుకుపోతోంది. కానీ ప్రతిపక్షాలకు జరుగుతున్న అభివృద్ధి ఏదీ కనిపించడం లేదు. కనీసం ఇక్కడేం జరుగుతుందో కూడా తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడం లేదు.
చంద్రబాబు ఒకపక్క, ఆయన దత్తపుత్రుడు మరో పక్క ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. 2014 నుంచి 19 మధ్య పవన్ కళ్యాణ్‌కి పారిశ్రామిక విధానాలు, పరిశ్రమలను ఇబ్బంది పెట్టిన అంశాలు గుర్తుకురాలేదా..?దత్తపుత్రుడు అనే పేరును చాలా సముచితంగా పెట్టారు. ఆయన తల్లిదండ్రులు కూడా ఇంతటి సముచితమైన పేరు పెట్టలేరేమో..?
జగన్మోహన్‌రెడ్డి పవన్ పద్దతులను చూసి సరైన పేరు పెట్టారు.జగన్‌ను పంపించేద్దాం అంటున్నారు..ఎక్కడికి పంపించేస్తారు..? మేం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాకముందు కూడా ప్రజల మధ్య పోరాటం చేసిన వ్యక్తి జగన్ .నువ్వూ నీ దత్తతండ్రి ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లో దాక్కుంటారు.మిమ్మల్నే ప్రజలు హైదరాబాద్ కు పంపించేశారు.
నాలుగేళ్లలో ఏపీలో ఎన్ని రోజులున్నావో చెప్పు..పవన్ ?
ఇక్కడేం జరుగుతుందో ఆయనకు కనిపించదు. దత్తతండ్రికి ఇంటికి వెళ్లి సీట్లు, ప్యాకేజీ బేరం అడుకోవడమే సరిపోయింది.ఇప్పుడు ఏం మాట్లాడాలో చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఒక రోజు ఎమ్మెల్యేని చేయమంటాడు..మరుసటి రోజు ముఖ్యమంత్రిని చేయమంటాడు. నిన్నేమో ఏకంగా ఈసారి మనం గెలవలేం అంటాడు. గెలవకపోయినా మీ కోసం పోరాటం చేస్తానంటాడు. నువ్వు గెలవను అని నీకు నువ్వే చెప్పుకుంటున్నావ్..కానీ నీకు తెలియని వాస్తవం ఏంటంటే…ప్రజలే నిన్ను గెలిపించరు.
చంద్రబాబు వల్లే పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని
ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ప్రాణహాని అనేది ఉంటే అది ఒక్క చంద్రబాబు వల్లనే. ఈ మాట నేను చెప్పడం లేదు. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గడచిన ప్రభుత్వంలో మాట్లాడిన మాటలు అదే చెబుతున్నాయి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం వల్ల నీకు ప్రాణహాని ఉంటుందా..?
ఏనాడైతే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని ఎన్టీఆర్ వద్ద నుంచి లాక్కున్నాడో ఆనాటి నుంచి జరిగిన సంఘటనలు ఒక సారి పరిశీలించాలి.టీడీపీలో చంద్రబాబు తర్వాత ఒక వ్యక్తి ఫోకస్‌లోకి వచ్చాడంటే ఆ వ్యక్తి ఎలిమినేట్ అయిన సందర్భాలు చూశాం.
మాధవరెడ్డి చనిపోయనప్పటి నుంచీ జరిగిన పరిణామాలు జాగ్రత్తగా గమనించాలి.వీళ్లంతా సాధారణంగా చనిపోయిన వారు కాదు. ఒకరు నక్సలైట్‌ల దాడిలో చనిపోయారు.హెలికాఫ్టర్ యాక్సిడెంట్‌లో బాలయోగి, కారు ప్రమాదంలో ఎర్రంనాయుడు, లాల్‌జాన్‌బాషా, నందమూరి హరికృష్ణ.. ఇలా వేర్వేరు ఘటనల్లో చనిపోయారు.వీళ్లంతా టీడీపీలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న తరుణంలో అనుమానాస్పదంగా మృతి చెందిన వ్యక్తులు.నువ్వు ఎవర్ని అనుమానించాలి…పవన్ కళ్యాణ్..? నీ దత్త తండ్రినే అనుమానించాలి.
వంగవీటి రంగాను చంపించిన వ్యక్తి చెప్పినట్లు ఆడుతున్నావ్:
మరో పక్క వంగవీటి మోహనరంగాని చంపేసి, ముద్రగడను చంపేద్దామనుకున్న వ్యక్తి చెప్పినట్లు నువ్వు ఆడటం విడ్డూరం.రాష్ట్రం ఏమైనా పర్లేదు..నా దత్తతండ్రి చెప్పిందే వల్లిస్తానంటూ తిరుగుతున్నావు. ప్రజల మనోగతం తెలుసు కాబట్టే నేను ఓడిపోయినా పర్లేదు అంటున్నావు. నేను ఓడిపోయినా పర్లేదు..చంద్రబాబు కోసం జగన్ పై పోరాటం చేస్తానంటున్నావు.
ఉపవాసాలు చేస్తే ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు అయిపోతారా..?
ప్రజల అభిమానం, నాయకుడిగా మా కోసం నిలబడతాడనే ధైర్యం పెంపొందిస్తే ప్రజలు నమ్ముతారు. జగన్ లో ఒక ఫైటర్‌ని ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టే ఆయన వెంట నడిచారు. సోనియా గాంధీ, చంద్రబాబు ఏకమై తనను ఇబ్బంది పెట్టాలని చూసినా ప్రజల కోసం అడ్డంగా నిలబడి పోరాడిన జగన్‌ని చూసి నేర్చుకో.
నీ సినిమాలు, డాన్సులు, ఫైట్లు చూసి జనం గెంతుతున్నారనుకుంటే పొరపాటు.ఆ లాజిక్ నీకు కూడా తెలుసు. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు కళ్లు విప్పి చూడు. ఇవన్నీ 2024లో జగన్‌ని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయి. ముఖ్యమంత్రిరాష్ట్ర ప్రజల కోసం అవసరమైతే పనితీరు బాగాలేనటువంటి వారిని పక్కన పెట్టడానికి కనీసం ఆలోచన కూడా చేయనని చెప్పారు.
రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం రానుంది:
క్రిబ్‌కో సంస్థ మొదటి దశలో రూ.310 కోట్లతో చేపట్టిన బయోఇథనాల్ ప్లాంటుకు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. విశ్వ సముద్ర సంస్థ బయోఇథనాల్ ప్లాంటుకు రూ.315 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఇన్‌స్టంట్ కాఫీ సీసీఎల్ సంస్థ రూ.400 కోట్ల పెట్టబడులతో ప్రారంభించనున్న శంకుస్థాపన చేశారు. ప్రతిష్టాత్మకమైన గాద్రెజ్ సంస్థ ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీని ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం చేశారు.
ఇవన్నీ మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో చేసుకున్న ఎంఓయూల్లో భాగంగా ముందుకు వచ్చిన సంస్థలే.గాద్రెజ్ సంస్థ ఏడాది క్రితం ప్రారంభించిన ఈ ప్లాంటు ముఖ్యమంత్రి ఇచ్చిన సహకారంతోనే 9నెలల్లోనే పూర్తి చేశామని చెప్పారు. తాము ఏ రాష్ట్రంలో ఇంత త్వరగా ప్లాంటు నిర్మాణం పూర్తి చేసుకోలేదని వారు నేరుగా ముఖ్యమంత్రి కే చెప్పారు.
పరిశ్రమల స్థాపన కోసం అన్ని రకాల అవకాశాలు, మౌలిక వసతులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి.రాబోయే కాలంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ ద్వారా మనం చేసుకున్న ఒప్పందాలు గ్రౌండింగ్ కోసం త్వరగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.దీనిపై నిరంతరం సమీక్షిస్తూ ముఖ్యమంత్రి గారు పరిశ్రమల ప్రగతికి బాటలు వేస్తున్నారు.
రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం రానుంది. పెద్ద పెద్ద గ్రూపులకు సంబంధించిన పరిశ్రమలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వారి కార్యకలాపాలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు. ఏడాది క్రితం ఆదిత్యా బిర్లా గ్రూపు, నేడు గాద్రెజ్ కంపెనీ, బద్వేలులో సెంచురీ ఫ్లైవుడ్ వారు వస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థ అయిన యోకోహోమా టైర్ కంపెనీ రాష్ట్రంలోనే అతిపెద్ద టైర్ మాన్యు ఫ్యాక్చరింగ్ కంపెనీ.
ప్రపంచంలోనే 20 దేశాలకు టైర్లు సరఫరా చేసేవిధంగా ఏర్పడిన కంపెనీ విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటైంది.ఎలక్ట్రానిక్స్ రంగంలో తిరుపతిలో టీసీఎల్, ఫాక్స్‌లింక్స్, డిక్సన్ వంటి సంస్థలు ఉత్పత్తులు చేస్తున్నాయి. ఐటీరంగంలో ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు విశాఖ వేదికగా కార్యకలాపాలు ప్రారంభించాయి.
జగన్ పై అక్కసుతో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నారు:
ఇవన్నీ జరుగుతున్నా నెగిటివ్ ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయి. రాష్ట్రం నుంచి పరిశ్రములు వెళ్లిపోతున్నట్లు, పరిశ్రమలు పెట్టడానికి రాష్ట్రానికి రావడం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏ సుజనా చౌదరి, సీఎం రమేశ్ లాంటి వారు కూడా పరిశ్రమలు రాష్ట్రంలో పెడతామంటే స్వాగతించాం.కే వలం రాజకీయ అంశాలను తీసుకుని వారు బురదజల్లే ప్రయత్నంచేస్తున్నారు.
చంద్రబాబుకు సంబంధించిన సొంత సంస్థ హెరిటేజ్ కూడా రాష్ట్రంలో నడుపుకుంటున్నారు. చంద్రబాబును హెరిటేజ్‌ను ఏం ఇబ్బంది పెట్టామో చెప్పమనండి..ఎందుకు ఇక్కడ సరైన వాతావారణం లేదని అంటున్నారో చంద్రబాబు చెప్పాలి. మీరు మళ్లీ తిరిగి అధికారంలోకి రావడానికి పోరాటం చేయడాన్ని మానేసి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నారు.
ఎల్లో మీడియా, ఎల్లో పార్టీలను చూస్తే జాలేస్తోంది
మీరెన్ని చేసినా జగన్ బ్రాండ్‌ను చూసి, రాష్ట్రంలో ఉన్న అవకాశాలను చూసి పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు రానున్నాయి.మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు, 50 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నాం.మౌలిక వసతుల కల్పనలో మొదటి స్థానంలో ఉన్నాం.గత ఏడాది పరిశ్రమల ఆకర్షణలో 2022లో వచ్చిన పెట్టుబడుల్లో 18 శాతం ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయి.