– ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా ?
-రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఓటుఎటో తేల్చాలి?
-2014 నుంచి 19వరకు చంద్రబాబు హయాంలో కూడా హామీలపై చేతులెత్తేశారు
– కాంగ్రెస్ పార్టీ తోనే ప్రత్యేక హోదా సాధ్యం
– హోదా ఇవ్వదు.. హామీలు నెరవేర్చదు..అయినా ఎన్డీఏకే జగన్ మద్దతు పలుకుతారా ?
– బీజేపీపై ఒత్తిడికి జగన్ రెడ్డికి ఇదే చాన్సు
– అలాగైతేనే హోదా.. పోలవరం.. రైల్వే జోన్, ఇతర హామీల సాకారం ఖాయం
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
న్యూ ఢిల్లీ : ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి రాష్ట్ర ప్రయోజనాలు పట్టడంలేదని, రాష్ట్రపతి అభ్యర్ధికి వైసీపీ మద్దతు పలికితే ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ పాలనే సాగుతుందని భావించాల్సి వస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ఆరోపించారు. రాష్ట్రానికి హోదా ఇవ్వని, హామీలు నెరవేర్చని ఎన్డీఏకే జగన్ మద్దతు పలుకుతారా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ల దాటినా మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, రెవెన్యూ లోటు భర్తీ, రైల్వే జోన్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, పోలవరం తుది అంచనా వ్యయం రూ.55548.87 కోట్లకు ఆమోదం, విశాఖ రైల్వే జోన్ వంటి అనేక విభజన హామీలను నెరవేర్చలేదని, అయినా సీఎం జగన్ రెడ్డి కేంద్రాన్ని పల్లెత్తు మాట అనక పోవడాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం న్యూ ఢిల్లీ నుంచి డాక్టర్ సాకే శైలజనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
పార్లమెంటులో అవసరమైనప్పుడల్లా బేషరతుగా మద్దతిచ్చేస్తున్నారని, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నెల 15న బిజెపి కి వ్యతిరేకంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రతిపక్షాల భేటీకి రమ్మని జగన్‌కు లేఖ రాసినా ఆయన పట్టించుకోలేదన్నారు. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతివ్వాలంటే కొన్ని షరతులు విధించాలని, అవి నెరవేరిస్తేనే అనుకూలంగా ఓటేస్తామని జగన్ రెడ్డి బీజేపీ పై ఒత్తిడి తేవాలని అన్నారు.
జగన్ ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలేమిటో చెబుతూ యువతను రెచ్చగొట్టారని, హోదా కోసం దీక్ష చేపట్టి ప్రత్యేక హోదా వస్తే పన్ను రాయితీలు ఉబ్బడిముబ్బడిగా ఉంటాయని, రాష్ట్రానికి పరిశ్రమలు తామరతంపరగా వచ్చేస్తాయని, రాష్ట్రంలో యువతకు నిరుద్యోగమన్నదే కనిపించదని ఊదరగొట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు కేంద్రం మెడలు ఎందుకు వంచడంలేదని డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు.
2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు సీఎం పదవి చేపట్టకముందే జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉందని, ఇతర పార్టీల మద్దతు దానికి అవసరం లేదని, హోదా కావాలని అడుగుతూ పోవడం తప్ప ఒత్తిడి తీసుకురాలేమని చెప్పారని, అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ గెలవాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరని.. అందుచేత రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరణ వంటి డిమాండ్లు మోదీ ముందు పెట్టాలని, అప్పుడు తప్పకుండా వాటిని నెరవేరుస్తారని పేర్కొన్నారు.
రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నిటినీ నెరవేర్చాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు జగన్ రెడ్డి ఈరోజే బహిరంగ లేఖ రాయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున జగన్ రెడ్డి ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. జగన్ ఇదేమీ చేయకుండా మౌన ముద్ర దాల్చడం, దీనిపై మాట్లాడకుండా వైసీపీ ముఖ్య నేతలను సైతం కట్టడి చేయడం చూస్తుంటే రాష్ట్ర ప్రయోజనాలను కాదని స్వీయ ప్రయోజనాల కోసం మరోసారి ఎన్డీఏకి బేషరతుగా మద్దతు తెలిపేందుకు సిద్ధమైపోయారని ప్రజలు భావించాల్సి ఉంటుందని అన్నారు. గతంలో రామ్‌నాథ్ కోవింద్‌ను ఎన్డీఏ అభ్యర్థిగా నిలబెట్టిన సమయంలోనూ షరతుల్లేకుండా మద్దతిచ్చారని, ఇప్పుడూ అదే పరిస్థితి కనబడుతోందని శైలజనాథ్ పేర్కొన్నారు.