Suryaa.co.in

Editorial

తగ్గాను.. ఇక తగ్గేదేలే!

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆశలావు పీక సన్నం అనే సామెతకు అర్ధమేమిటో కొన్నేళ్ల నుంచి ఎంత బుర్ర బద్దలుకొట్కున్నా నిన్నటివరకూ తెలియలేదు. కానీ జనసేనాధిపతి పవన్‌కల్యాణ్‌బాబు ప్రసంగం విన్న తర్వాత దాని అర్ధమేమిటో తెలిసింది. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలి పోకుండా, భవిష్యత్తు రాజకీయ చిత్రముఖాన్ని కల్యాణ్‌బాబు తనదైన శైలిలో ఆవిష్కరించిన వైనం ముచ్చటేసింది.

ఇప్పటిదాకా.. పవన్‌కు రాజకీయాలు తెలియని, బోళాశంకరుడని, రాజకీయాల్లో ఆయన సినిమా మహేష్‌బాబులా చాక్లెట్‌బాయ్ అనుకున్నారు. కానీ ఇంత అమాయకుడని, ఆ అమాయకత్వంలో కూడా అత్యాశ ఉందని ఇప్పుడే అందరికీ అర్ధమయింది.

ఇంతకూ కల్యాణ్‌బాబు తేల్చేసిదేమిటంటే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఇప్పటికి చాలా సార్లు తగ్గాను. ఇకపై తగ్గేదే లే. ఆ తగ్గేదేదో చంద్రబాబునాయుడు తగ్గాలి. ఆయన తగ్గితే తాను బీజేపీ, టీడీపీ సాయంతో
pavan-babu-vekaiah సీఎం అవుతా. ఈ విషయంలో ఇక ఆలోచించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు తప్ప నేను కాదు. దానికోసం ఆయన బైబిల్ కొని, అందులో ‘తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడ’న్న సూక్తి కూడా నేర్చుకున్నారు.

అంతేనా? రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ముచ్చటగా మూడు ఫార్ములాలు ‘విడుదల’ చేశారు. అందులో ఒకటి బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం. రెండోది జనసేన, బీజేపీ, టీడీపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటుచేయడం. ముచ్చటగా మూడోది జనసేన ఒక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోవడం. ఈ మూడు ఫార్ములాలలో తాను ఏది ఎంచుకోవాలన్నది ఆయన టీడీపీ ‘విజ్ఞత’కే వదిలేశారు. అంటే కల్యాణ్‌బాబు ఎన్నిసార్లు తిప్పి చెప్పినా దానర్ధం.. ఈసారి నేను సీఎం అవుతా. మీరు నాకు సహకరించండి. లేకపోతే నేనే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటా అని చెప్పడమన్నమాట.
మంచిదే. కొన్ని డజన్ల దేశాధ్యక్షులతో వితవుట్ అపాయింట్‌మెంట్ కలసి, వారితో లంచ్-బ్రేక్‌ఫాస్ట్-డిన్నర్ చేసి, కేసీఆర్-జగన్ ఒప్పుకుంటే లక్షల డాలర్లు రెండు రాష్ట్రాలకూ తీసుకువస్తానంటున్న ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ కూడా.. తెలంగాణకు తానే కాబోయే సీఎం అని నొక్కి వక్కాణిస్తున్నారు. పైగా అమిత్‌షాతో బోలెడన్ని సార్లు భేటీ వేసి బ్లెస్సింగులిచ్చారు. మరి అలాంటప్పుడు.. బోల్డెంత సినీ ఇమేజ్, వేలాదిమంది యూత్ ఇమేజ్ ఉన్న పవన్ కల్యాణ్ కూడా సీఎం పదవి ఆశించడంలో తప్పేమిటి? నిస్సందేహంగా తప్పేమీ లేదు.

అయితే.. దేశంలో ఎక్కడైనా ఎక్కువ శాతం ఓట్లున్న పార్టీ, అత్యల్పమైన ఓటు శాతం ఉన్న పార్టీతో జతకలిసినప్పుడు.. ఆ అత్యల్ప శాతం ఓట్లున్న పార్టీకే సీఎం పదవి ఇచ్చేందుకు, ఒడంబడిక కుదుర్చుకున్న సంఘటనలు ఉన్నాయా అన్నది.. తన పార్టీలో ‘రాజకీయ ఉద్దండుడు’, ‘రాజకీయ భీష్మాచార్యు’డయిన నాదెండ్ల మనోహర్‌ను అడగకపోవడమే ఆశ్చర్యం. వెనకటికి.. ‘ఆయనే ఉంటే మంగలెందుకని’ సామెత చెప్పినట్లు, అంత గెలిచే నమ్మకం ఉంటే, పెద్ద పార్టీతో పొత్తు లెందుకు? నేరుగా పోటీ చేసి ఆ ప్రభుత్వమేదో కల్యాణ్‌బాబే ఏర్పాటుచేయవచ్చు కదా అన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

పోనీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే తన తపన అన్న కల్యాణ్‌బాబు లాజిక్కు ప్రకారం చూసుకున్నా.. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేసినా, వైసీపీనే గెలిచింది. అందులో టీడీపీ ఓటు షేర్ 40 శాతమయితే, మిగిలిన పార్టీల ఓటు శాతం పదికూడా లేదు కదా? మరి ఆ లాజిక్కు నిజమయితే జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేసి, ఒక్కటంటే ఎందుకు మాత్రమే గెలిచినట్లు? అసలు సీఎం కావలసిన పవన్ రెండు చోట్లా ఎందుకు ఓడినట్లు? రెండు చోట్లా కాపులు దండిగా ఉన్నా పవన్ ఎందుకు ఓడిపోయారు?

ఆ లెక్కన విశ్లేషించినా, కల్యాణ్‌బాబు త్రిసూత్రం ప్రకారం మళ్లీ వైసీపీనే అధికారంలోకి రావాలి కదా? మరి తాను ప్రవచిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీల్చివేత సూత్రం అటకెక్కినట్లే కదా? అన్నది బుద్ధిజీవుల మరో లా పాయింటు. ఈ లాజిక్కు , లా చదివిన ‘తమ్ముడన్నయ్య’ నాగేంద్రబాబు, నాలుగయిదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా పసిగట్టకపోవడమే వింత.

సరే.. ఇప్పుడు పవనన్నయ్య చెప్పే లాజిక్కేమేటంటే.. ఆరేడు శాతం ఓటు బ్యాంకు ఉన్న తన పార్టీని, నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ చచ్చినట్లు ఒప్పుకుని తీరాలి. అది కుదరకపోతే.. పాయింట్ సిక్స్ శాతం ఓటు బ్యాంకు ఉన్న బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటుచేసుకోవాలా? లేక తన ఆరేడు శాతం బలంతోనే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలా? అన్నది కల్యాణ్‌బాబు అడిగిన ప్రశ్న. నిజానికి ఇది టీడీపీకి వేసినట్లు కనిపించినా, బుర్రపెట్టి ఆలోచిస్తే.. పవనన్నయ్య అద్దం ముందు నిలబడి, తనకు తాను వేసుకున్న ప్రశ్నలాగే కనిపిస్తుంది.

నిజానికి ఏపీలో వైసీపీపై జనంలో ఎంత వ్యతిరేకత ఉందో, ఆ పార్టీకి పరోక్షంగా మద్దతునిస్తున్న బీజేపీపై , అంతకుమించిన వ్యతిరేకత ఉంది. ఇంకా జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల కొన్ని వర్గాలు ఆయనను బలపరుస్తున్నాయి. జగన్ సర్కారు వల్ల లబ్ధిపొందుతున్న కులాలు, మతాలు ఆయనకు దన్నుగా నిలుస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఒక చాన్సు ఇద్దామనుకుని ఓట్లేసిన మధ్య తరగతి, తటస్తులు, విద్యావంతులు, అగ్రకులాలు, మరికొన్ని బీసీ కులాలు మాత్రం జగన్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్నాయి.

కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై, దాదాపు అన్ని వర్గాలూ వ్యతిరేకతతో ఉన్నాయి. పెరిగిన ధరలే దానికి కారణం. వైసీపీతో బీజేపీ తెరచాటు బంధం కొనసాగిస్తోందన్న భావన మెడ మీద తల ఉన్న అందరికీ అర్ధమయింది. పక్కనే ఉన్న తెలంగాణకు నిధులివ్వని బీజేపీ సర్కారు, వైసీపీ సర్కారు ఎప్పుడు కష్టాల్లో పడినా ‘నిర్మల’ హృదయంతో ఆదుకుంటోందన్న నిజం, బుర్రబుద్ధి ఉన్న అందరికీ తెలిసిపోయింది. పైగా.. ప్రత్యేక హోదా, పోలవరం, విభజన హామీలు నెరవేర్చకపోవడంతోపాటు, విశాఖస్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, ఏపీలో భూములు, పోర్టులను అదానీకి ధారదత్తం చేయడం వెనుక బీజేపీ దన్ను ఉందన్న విషయం పత్రికలు, చానెళ్లు చూసే అందరికీ తెలిసిపోయింది. యూట్యూబ్ చానెళ్ల రాకతో, ఇప్పుడివి ఏపీలో ఎంత మాత్రం రహస్యం కాదు. ఈ పరిస్థితిలో కూడా బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనటం కల్యాణ్‌బాబుకే చెల్లింది. కాబట్టి ఆయన సాహసాన్ని మెచ్చుకోకపోతే కళ్లు పేలిపోతాయ్!

సరే.. టీడీపీ, బీజేపీని కాసేపు పక్కనపెట్టి ముందు జనసేన బలం చూసినా, ఆ పార్టీకి ఇప్పటిదాకా రాజకీయ పార్టీ నిర్మాణం లేదు. వ్యవస్థ లేదు. అన్ని రీళ్లలోనూ పవనే కనిపిస్తుంటారు. మధ్యలో నాగబాబు ఎంట్రీ ఇచ్చి, పవన్ అభిమానులు ఆయన దూకమంటే నిప్పుల్లో దూకడానికయినా రెడీగా ఉండాలంటారు. ఇక మహానాయకుడైన నాదెండ్ల మనోహర్ ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పవన్‌ది చిన్న పిల్లల మనస్తత్వం అని చెబుతుంటారు. అలాగే ఆయనకు లక్షలాదిమంది చిన్నపిల్లలు అభిమానులుగా ఉన్నప్పటికీ, వారికి ఓట్లు లేవు. ఇదో పెద్ద సమస్య. ఇక కాపులంతా ఆయన వెనుక ఉంటారా అంటే అదీ డౌటనుమానమే. అన్నయ్య ప్రజారాజ్యం ప్రయోగంతో, ఎంతమంది తమ్ముడి వెంట నడుస్తారన్నది సందేహమే. గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ, ఇతర బీసీ, ఎస్సీలను ఎంత దువ్వినా వారంతా కాపులతో కలసేది కష్టమే. మరి ఏ లెక్కన పవన్ సీఎం అవుతారు? ఇతర పార్టీలు ఆయనను ఏ లెక్కన సీఎంగా అంగీకరిస్తారన్నది ప్రశ్న. మన గురించి మనకు స్పష్టత అవసరం కదా?

అయితే.. ముందు బీజేపీతో కలసి పోటీ చేస్తామా? విడిగా పోటీ చేస్తామా? కలసి ప్రభుత్వం ఏర్పాటుచేస్తామా? లేక బీజేపీతో కలసి చేస్తామా? అన్నది కాలమే నిర్ణయిస్తుందన్న ఆయన.. మళ్లీ కొద్దిసేపటి తర్వాత బీజేపీతో కలసి కార్యక్రమాలు ఉంటాయని, కచ్చితంగా బీజేపీతో కలసి తన ప్రయాణం ఉంటుందని ప్రకటించడమే గందరగోళం. ఈ రెంటిలో ఏది నిజం? ఏది ఊహాజనితం?

కల్యాణ్‌బాబు మాటలు వింటే.. బీజేపీ ఆయనను ఆడేసుకుంటోందని మాత్రం అర్ధమవుతుంది. గతంలో తనకు ఇంకా బీజేపీ నుంచి రోడ్‌మ్యాప్ రాలేదని పవన్ చెబితే, సరిగ్గా రెండురోజుల తర్వాత బీజేపీ
pavan-modi అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం.. తమకు 3 నెలల క్రితమే రోడ్‌మ్యాప్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడేమో తాను ఇంకా ఉమ్మడి సీఎం అభ్యర్ధినని బీజేపీ జాతీయ నాయకులు ఇప్పటివరకూ చెప్పలేదని పవన్ చెబుతున్నారు. అంటే.. దీన్నిబట్టి బీజేపీ నాయకత్వం పవన్‌ను నమ్మకుండా, ఏమీ చెప్పకుండా, ఆయన రాజకీయ పరిపక్వతకు ఇంకా పరీక్ష పెడుతుందనుకోవాలేమో?

ఏదేమైనా .. పవన్ కోరికను మన్నించి, ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించి, చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పదవికి పరిమితమవడం, ‘రాష్ట్ర ప్రయోజనాల’ దృష్ట్యా టీడీపీకే మంచిది. లేకపోతే తెలుసు కదా? పవన్‌కో తిక్కుంది. దానికో లెక్కుంది. ఆయనకు కోపం వచ్చి సింగిల్‌గా పోటీ చేసి, ఆయనే సీఎం అయిపోతారు. ఆ తర్వాత టీడీపీ ఇష్టం. అదే కదా మంగళగిరిలో పవన్ విప్పిన కవి హృదయం?!

LEAVE A RESPONSE