Suryaa.co.in

Andhra Pradesh

కక్షతో అవినీతి చేయని నిజాయితీపరులైన అధికారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు

– జగన్ రెడ్డి నిజాయితీ పరులైతే కోర్టు వాయిదాలకు ఏళ్ల తరబడి ఎందుకు ముఖం చాటేస్తున్నారు?
– మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

జగన్ రెడ్డి అధికారాన్ని పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని చేయని అవినీతికి నిజాయితీపరులైన మాజీ అధికారుల్ని జైలు పాలు చేస్తున్నారు, అక్రమ కేసుల్లో ఇరికిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.241 కోట్లకు అవినీతికి పాల్పడ్డారని లక్ష్మీనారాయణ, ఘంటా సుబ్బారావులపై కేసులు బనాయించారు. రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలకు అన్నిరకాల పరికరాలు సరఫరాచేసినట్టు ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారులే ఒప్పుకొని సంతకాలు పెట్టాక, అవినీతికి ఎక్కడ జరిగిందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి.

తమ భారీ అవినీతిని కప్పి పెట్టుకునేందుకు ఎదుటి వారిపై లేని అవినీతిని ఉన్నట్లుగా నీలి మీడియా తప్పుడు కథనాలు అల్లి నిజాయితీగా వ్యవహిరించిన అధికారులపై అవినీతి మరకలు అంటించే కుట్రకు దిగారు. ఈఎస్ఐ స్కాం జరిగిందంటూ తప్పుడు కేసులతో అచ్చెన్నాయుడుని అక్రమంగా రెండు నెలలు జైల్లో పెట్టారు. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయని దూళ్లిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారు. రూ.700 కోట్ల ఫైబర్ నెట్ ప్రాజెక్టులో రూ.2వేల కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారు.

రూ.43 వేల కోట్లు అవినీతి జరిగిందని సీబీఐ చెప్పినా ఏమీ లేదని బుకాయిస్తున్నారు. జగతి సంస్థలో జగన్ రెడ్డి కుటుంబం రూపాయి పెట్టుబడి పెట్టకుండానే రూ.1,246 కోట్లు పెట్టుబడిగా ఎలా వచ్చిందని తెలంగాణ సీబీఐ కోర్టు ప్రశ్నించింది? ఇందుకోసం తండ్రి అధికారాన్ని ఉపయోగించుకున్నారని నవంబర్ 7, 2021న తెలంగాణ హైకోర్టులో సీబీఐ వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 13, 2021న విజయసాయిరెడ్డి హెటిరోపై ఐటీ దాడులు చేయగా రూ.1200 కోట్లు అక్రమ ఆస్తులను గుర్తించి సీజ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడి 19 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉన్నారు. ఇవన్నీ కప్పిపెట్టుకోవడానికే దక్షిణాది అబ్దుల్ కలాం అయిన గంటా సుబ్బారావుపై అక్రమ కేసు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టించారు. మీరు నిజాయితీ పరులైతే కోర్టు వాయిదాలకు ఏళ్ల తరబడి ఎందుకు ముఖం చాటేస్తున్నారు? మీరు చెబుతున్నవన్నీ సాకులు కాదా?

LEAVE A RESPONSE