– మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైయస్సార్సీపీ పోరాటం కొనసాగుతుంది
– బాపట్ల జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున
తాడేపల్లి: వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పార్టీ చేస్తున్న ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని బాపట్ల జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో నిరసన చేపడితే తనతో పాటు 77 మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు.
పేదవారికి ఉచితంగా అందాల్సిన వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మార్చొద్దని నినదిస్తూ చంద్రబాబుకి కనువిప్పు కలిగేలా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తేనే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోయిందని చెప్పారు. నిరసన తెలిపే హక్కును ఈ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు.
తమపై ఎందుకు కేసులు పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. కేసులు పెట్టినంత మాత్రాన వైయస్సార్సీపీ శ్రేణులు భయపడిపోతాయనుకోవడం చంద్రబాబు అవివేకమని, పేదల పక్షాన వైయస్సార్సీపీ పోరాటం ఆపే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం కాకుండా చేసే ఉద్యమంలో వెనకడుగు వేయడం జరగదని బదులిచ్చారు.