– వైఎస్ జగన్ మండిపాటు
తాడేపల్లి: ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి, ఇప్పుడు లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్దన్నల్లా లాయర్లు పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కలియుగం అంటే ఏమిటన్నది ఈ 14 నెలల చంద్రబాబు పాలన చూస్తే అర్ధమవుతుందన్న జగన్, ఈ కాలంలో ఎక్కడా న్యాయం, ధర్మం లేదని తేల్చి చెప్పారు.
వైయస్సార్సీపీ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల లీగల్‌సెల్ ప్రతినిధుల సమావేశంలో జగన్ మంగళవారం మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు. ఈ సందర్భంగా మీరు పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరు పార్టీకి అన్ని విధాలుగా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అడగకపోతే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్నట్లుగా.. కోరకపోతే దేవుడు కూడా దేవుడు కూడా వరిమివ్వడు అన్నట్లుగా.. పిటిషన్లు వేసి, మీరు న్యాయస్థానంలో నిలబడకపోతే, న్యాయం కూడా దక్కదు. అందుకే మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ఎక్కడా న్యాయం లేదు. ధర్మం లేదు.
తమకు గిట్టని వారు, నచ్చని వారు ఎవరైనా ఉంటే, ఎవరైనా తమ స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకుని, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకుని పోయి వారిని జైల్లో వేయాలి. ఎలాగైనా వారిని తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టాలి. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి ఈరోజు చూస్తున్నాం. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే తన పరువు, ప్రతిష్టతో ఆడుకోవడం.
అవన్నీ తెలిసి కూడా, ఏ తప్పు చేయకపోయినా కూడా బరద జల్లుతున్నారు. తప్పు చేశాడు అని చెప్పి, దాని కోసం దొంగ సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. కేసులు పెడుతున్నారు. వాటికి అసలు అసలు ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. ఏ కేసు చూసినా మోడస్ ఆపరెండి ఒక్కటే. తొలిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం.