– 20 నెలల కాలంలో ముగ్గురు మార్పు
– నాలుగో కమిషనర్ విజయరామరాజు
అమరావతి: రాజధాని నిర్మాణం కీలకదశలో ఉన్న సమయంలో సిఆర్డిఎ కమిషనర్ల మార్పు చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ విభాగంలోనూ జరగనన్ని మార్పులు సీఆర్డీఏలో చేశారు. అత్యంత కీలకమైన రాజధాని విషయంలో ఇలా వరుసగా మార్చుకుంటూపోతే అభివృద్ధిపై ప్రభావం పడుతుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చే అధికారి అర్ధం చేసుకొని పూర్తిస్థాయిలో పనిలో దిగేందుకు కనీసం ఆరునెలలు పడుతుంది. ఈ వేసవిలో పనులు మరింత వేగంగా జరగాల్సి ఉంది. సీఆర్డీఏకు కొత్తగా వచ్చిన విజయరామరాజు నాలుగో కమిషనర్ కావడం విశేషం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి వివేక్ యాదవ్ కమిషనర్ గా ఉన్నారు.
ఆయనస్థానంలో కాటంనేని భాస్కర్ ను నియమించారు. నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసే అధికారిగా ఆయనకు పేరుంది. అయితే అతి తక్కువ సమయంలోనే అతన్ని బదిలీచేసి కన్నబాబును నియమించారు. ఈయన కూడా అంతోఇంతో రైతులను కలుపుకుపోతూ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ వెళుతున్నారు.
గ్రామాల వారీగా సభలు ఏర్పాటుచేసి ప్రజలు వ్యక్తంచేసే అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. మరోవైపు రైతులు వ్యక్తం చేసే సమస్యలపై ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. అమరావతిలో జరిగే పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు నిధులు జమచేసేందుకు వీలుగా ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటుచేసి వర్కు రియాలిటీ ఆధారంగా బిల్లులు చెల్లిస్తున్నారు.
పనులపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. రైతు జెఎసితో చర్చలు జరుపుతున్నారు. ప్రతివారం సమావేశాలు ఏర్పాటుచేసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఎకనామిక్ ప్రాజెక్టులనూ వేగవంతం చేశారు. త్రీమెన్ కమిటీ ఇచ్చే సూచనలను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నపళంగా కన్నబాబును మార్చి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఉన్న విజయరామరాజును తీసుకువచ్చారు.
రైతు జెఎసి నాయకులు కూడా.. త్రీమెన్ కమిటీలో సమస్యలు పరిష్కారం కావడం లేదనే ఉద్దేశంతోనే ఉన్నారు. కొత్త కమిషనర్ ఈ పనులను అర్ధం చేసుకుని, కార్యాచరణ ఎప్పుడు ప్రారంభిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పెద్ద ప్లాట్లను విభజించాలనే అంశం ముందుకు వచ్చింది. ఇలా విభజిస్తే అమరావతి రాజధాని మాస్టర్ ప్లాను అమలు కష్టమవుతుందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కమిషనర్ మార్పునకు ఇది కూడా ఒక కారణమని తెలిసింది. ఇటీవల మంత్రి నారాయణ కూడా ఓ సమావేశంలో కన్నబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వీటితో పాటు కాంట్రాక్టర్లు కూడా కమిషనర్‌ను మార్చాలని పై స్థాయిలో పట్టుబట్టినట్లు తెలిసింది.
అలాగే ప్రస్తుతం సి ఆర్ డి ఏ పరిధిని తగ్గించేశారు. పనులన్నీ ఏజిఐసిఎల్ కు బదలాయించారు. కొత్తగా వచ్చే ప్రాజెక్తులన్ని అదే చేపడుతుంది. సి ఆర్ డి ఏ బిల్లులు చెల్లింపులకే పరిమితం అవుతుంది.
– వల్లభనేని సురేష్
అమరావతి రాజధాని సమగ్ర అధ్యయనవేత్త, విశ్లేషణ నిపుణులు
9010099208