– మంత్రి సత్యకుమార్ యాదవ్
రాజమహేంద్రవరం: రాజానగరంలో ఆర్ అండ్ బి శాఖ ద్వారా 15 వ ఆర్థిక సంఘం నిధులు రూ.50 లక్షలతో నిర్మించనున్న నూతన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనానికి రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ భవనాన్ని సంవత్సర కాలంలో పూర్తి చేస్తాం. ఇప్పటికే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అనుసంధానంగా పనిచేస్తుందన్నారు. కోవిడ్ సమయంలో పరీక్షలు నిర్వహించేందుకు ఈ భవనాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. దానిలో భాగంగా మొదటి విడతలో 166, రెండో విడతలో 162, మూడో విడతలో 102 మంజూరు అయ్యాయన్నారు.
ఆర్ అండ్ బి శాఖ ద్వారా త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు తీసుకువస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మంజూరు అయ్యాయని తెలిపారు. ఇవి కాకుండా రాష్ట్రంలో 100 పీహెచ్సీలను అదనంగా మంజూరు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో వైద్య సంబంధిత పనులను పట్టించుకోలేదని మంత్రి విమర్శించారు. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో 14 రకాలా డయాగ్నోస్టిక్ పరీక్షలు చేస్తూ మందులను ఉచితంగా అందిస్తున్నాం.
వీటికి చాలా చోట్ల భవన నిర్మాణాలు లేకపోవడం వలన కేంద్ర ప్రభుత్వం 3500 విలేజ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల కోసం నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందిస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దెందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం బీజేపీ ఇన్ఛార్జి నీరుకొండ వీరన్న చౌదరి, తదితరులు పాల్గొన్నారు.