Suryaa.co.in

Andhra Pradesh

చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి…వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదు

  • ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత
  • ప్రజోపయోగ అంశాలపై బలంగా మాట్లాడండి
  • అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 

మీడియా సమావేశాలు, టీవీ చర్చల్లో పాల్గొనే జనసేన ప్రతినిధులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి పాలనాపరమైన విధివిధానాలు, ప్రజోపయోగ అంశాల మీద మాత్రమే మాట్లాడాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ అధికార ప్రతినిధులతో సమావేశం అయ్యారు. సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పార్టీ నిర్దుష్ట అభిప్రాయాలను వారికి తెలియచేశారు.

ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి. కులాలు, మతాలు గురించి మాట్లాడవలసినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలి. అన్ని మతాలను ఒకేలా గౌరవించాలని, దేవాలయం లేదా చర్చి లేదా మసీదులపై దాడులు జరిగినప్పుడు ఒకేలా స్పందించాలి. ఒక మతం పట్ల ఉదాసీనంగా, ఒక మతం పట్ల నిర్లక్ష్యంగా, మరో మతాన్ని ఎక్కువగా చూడటం వంటి చర్యలకు పాల్పడే నాయకులను, పార్టీలను గట్టిగానే నిలదీయాలి.

నిరంతర అధ్యయనం అవసరం

ముఖ్యంగా టీవీ చర్చలకు వెళ్లే వారు రాజకీయాలు, సమకాలీన అంశాలు, ప్రజా సమస్యలు మొదలగు ముఖ్యమైన అంశాలన్నింటిపైనా లోతుగా అధ్యయనం చేసి తగిన సమాచారం సిద్ధం చేసుకోవాలి. జనసేన ప్రతినిధుల వల్ల టీవీ చర్చలు ఉన్నత విలువలతో జరిగేలా చర్చను ముందుకు వెళ్ళేలా చూడండి. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హానిచేసే విధంగా చర్చలు ఉండకూడదు. టీవీల్లో జరిగే చర్చా కార్యక్రమాలు పిల్లలతో సహా కుటుంబ సభ్యులు చూసే అవకాశం ఉన్నందున సంస్కారవంతంగా అవి ఉండాలి.  మాట్లాడేటప్పుడు ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా చూసుకోవాలి. చర్చలో పాల్గొనే ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదా తూలనాడినా సంయమనం పాటించాలి. ఆ క్షణంలో మనం తగ్గినట్టు కనబడినా ప్రేక్షకులు, సమాజం దృష్టిలో పెరుగుతామనే విషయాన్ని  గుర్తుపెట్టుకోండి. గతంలో కొన్ని పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ వివిధ కులాలు, మతాలను ఓటు బ్యాంకుగా మలచుకోవడానికి ఎత్తుగడలు వేసేవి. వాస్తవాలు చెబుదాం.

రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిధిలో రూల్ ఆఫ్ లాకి అనుగుణంగా మన మాట, మన ప్రవర్తన ఉండాలి. చర్చల్లో వ్యక్తిగత విషయాలను గురించి మాట్లాడకపోవడంతో పాటు అవతలి వారి ఆహార్యం గురించో, బాడీ షేమింగ్ చేసే విధంగానో ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడకూడదన్న నియమాన్ని పాటించండి. సోషల్ మీడియాకు అనవసరమైన ఇంటర్వూలు ఇవ్వొద్దు. వాటివల్ల కొన్నిసార్లు లేనిపోని అనుమానాలకు తావిచ్చే ప్రమాదం ఉంది. అదే విధంగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక సమాచారాన్ని నిర్ధారించుకోకుండా మరొకరికో లేదా పార్టీ కార్యాలయానికి పంపడమో, దానిపై హడావిడి చేయడమో వద్దు.  పార్టీ ప్రతినిధిగా ఉంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టవద్దు. పార్టీ ప్రతినిధులు కేవలం పార్టీ కోసం మాత్రమే మాట్లాడాలి. మరెవరికో మద్దతుగా మాట్లాడవలసిన అవసరం లేదు. నా సినిమాలు, కుటుంబ సభ్యులపై వచ్చే విమర్శలపై కూడా స్పందించవద్దు. అలా స్పందించుకుంటూ వెళ్తే మన లక్ష్యం పక్కదారి పట్టే అవకాశం ఉంది.

సుహృద్భావ వాతావరణంలో చర్చించాలి

జీరో బడ్జెట్ రాజకీయాలు అనే అంశం మీద నేను అభిప్రాయాలు చెప్పలేదు.  అదెలా పుట్టిందో తెలియదుగాని నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ప్రచారం చేశారు. నేను అన్నది ఓట్లను నోట్లతో కొనే వ్యవస్థను మార్చే విధానం గురించి. అంతేగానీ ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలకు మంచినీళ్లు, టీ కూడా ఇవ్వకుండా పని చేయించుకోవడం గురించి కాదు.  ఈ వ్యవస్థలో మార్పు ఇప్పటికప్పుడు సంభవిస్తుందని అనుకోవడం లేదు. రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. మన పార్టీ కమ్యునిస్టులతో కలసినా, బీజేపీతో కలసినా, టీడీపీతో పొత్తు ఉన్నా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే విషయాన్ని చర్చల్లో అవసరం అయిన సందర్భాల్లో ప్రస్తావించాలి. ఇతర పార్టీలతో జత కట్టకుండా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు ఉండవన్న విషయాన్ని మరచిపోవద్దు. అదే విధంగా ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకుడికీ నేను వ్యతిరేకం కాదు. వ్యక్తిగతంగా వారు నన్ను దూషించినా శత్రువుగా పరిగణించను. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు కలవాల్సి వస్తుందో కూడా మనం చెప్పలేం. ఒక్కోసారి మన ప్రత్యర్ధి పార్టీ నాయకుల్ని కూడా కలవాల్సిన సందర్బాలు కూడా రావచ్చు. అందువల్ల చర్చల్లో పాల్గొనే వారు కూడా సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేసి, చర్చలు ముగిశాక మంచిగా పలుకరించుకునే వాతావరణం ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, పార్లమెంటులకు ఎన్నికల గడువు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధుల పాత్ర మరింత ఎక్కువగా ఉంటుంది. పార్టీ అభిప్రాయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సింది అధికార ప్రతినిధులే. ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి వచ్చే నెలలో ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేస్తామ”న్నారు. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధులతోపాటు ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ తదితరులు పాల్గొన్నారు. అధికార ప్రతినిధులకు సంబంధించిన వర్క్ షాప్ నిర్వహణకు టి.శివశంకర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. వేములపాటి అజయ్, బుర్రా నాగ త్రినాథ్, కోటంరాజు శరత్ సభ్యులుగా ఉంటారు.

LEAVE A RESPONSE