– మంచి జరిగిందని భావిస్తే జగన్ కు తోడుగా నిలవండి
– ఎంపీ విజయసాయి రెడ్డి
“రానున్నది కురుక్షేత్రం, ఈరోజు జరుగుతున్నది కులాల మధ్య యుద్దం కాదు, క్లాస్ వార్. పేదలంతా ఒకవైపు ఉంటే పెత్తందార్లు మరోవైపు ఉన్నారు. మనందరి ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు అండగా నిలవండి” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన పలు అంశాలు వెల్లడించారు. పేదల ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్న జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు తమకు మంచి జరిగిందని భావిస్తే ఈ మహా సంగ్రామంలో జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలవాలని ఆయన కోరారు.
అమరావతిలో పేదలకు ‘పట్టా’భిషేకం
అమరావతిలో నేడు పేదలకు పట్టాభిషేకం జరగనుందని, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా సీఆర్డీఏ పరిధిలో నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ జరగనుందని విజయసాయి రెడ్డి అన్నారు. సీఆర్డీఏ పరిధిలో 1402.58 ఎకరాల్లో 25 లేఅవుట్లు సిద్దమైనట్లు తెలిపారు. అలాగే ఇదే వేదికపై 5024 టిడ్కో ఇళ్లు సైతం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
నూతన పార్లమెంటు ప్రారంభోత్సవంలో పాల్గొననున్న వైకాపా
నూతన పార్లమెంటు భవన సముదాయం దేశంలో ఏ ఒక్క పార్టీకి గానీ, ఏ ఒక్క పార్టీ భావజాలానికి గానీ సంబంధించింది కాదని, ఇది దేశ ప్రజలందరి కొరకు, అందరి చేత ఏర్పడిన ప్రజలందరి యొక్క సంస్థ అని విజయసాయి రెడ్డి అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి సంఖ్యాపరంగా (ఎంపీ స్థానాలు) దేశంలో 5వ అతిపెద్ద పార్టీగా గుర్తింపు పొందిన వైకాపా నూతన పార్లమెంటు భవన సముదాయం ప్రారంభోత్సవంలో పాల్గొంటుందని అన్నారు.
ఇండియా సూపర్ కంప్యూటర్ తయారీకి చర్యలు తీసుకోవాలి
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ తయారీకి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇందు కోసం శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలని విజయసాయి రెడ్డి కోరారు. కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ కి సంబంధించిన ప్రతి ఒక్కటీ భారతదేశంలో తయారీ చేస్తే, భారతదేశం అన్ని రంగాల్లో త్వరిత గతిన అభివృద్ధి చెందుతుందని, ప్రజలు అనేక విధాలుగా లాభపడతారని ఆయన అన్నారు.