Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం?:చంద్రబాబు

అమరావతి: హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించాలని నిర్ణయించడం జగన్‌ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

ఈ నిర్ణయాన్ని తెదేపా పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మారుస్తూ బుధవారం సవరణ బిల్లును శాసనసభలో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ (2022) బిల్లును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ట్వీట్‌ చేశారు..

ఏ ముఖ్యమంత్రీ ఈ ఆలోచన చేయలేదు..
”వైద్యవిద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 1986లో ఈ హెల్త్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో మా ప్రభుత్వ హయాంలో ఆ సంస్థకు ఆయన పేరు పెట్టాం. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యూనివర్సిటీ పేరును మార్చాలని వైఎస్‌ఆర్‌తో సహా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయలేదు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ ఆలోచనలతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు తొలగించి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టడం అర్థరహితం. మూడున్నరేళ్లలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్‌ ప్రభుత్వం.. ఉన్న వాటికే పేర్లు మార్చుతోంది.

మీకు పేరు రాదు కదా.. ప్రజలు ఛీ కొడతారు!
ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి చెందిన రూ.450కోట్ల నిధులను సైతం బలవంతంగా కాజేసిన జగన్‌ ప్రభుత్వం.. ఏ హక్కుతో వర్సిటీ పేరు మార్చుతోంది? కనీసం స్నాతకోత్సవం నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన వీళ్లు ఇప్పుడు పేరు మార్చుతారా? అసలు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి వైఎస్‌ఆర్‌కు ఏం సంబంధం ఉంది? దశాబ్దాల నాటి సంస్థలకు పేర్లు మార్చి కొత్తగా మీ పేర్లు పెట్టుకుంటే మీకు పేరు రాదు సరికదా.. ప్రజలు మీ దిగజారుడుతనాన్ని ఛీకొడతారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించండి. ఇకనైనా ప్రభుత్వం పిచ్చి ఆలోచనలు మానుకుని హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును యథావిధిగా కొనసాగించాలి” అని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE