– బస్తాకు రూ.800 ఇద్దాం
– రాష్ట్రానికి కేంద్రమిచ్చే ప్రోత్సహాకాలను రైతులకే ఇద్దాం
– సెంటు పట్టా తీసుకోవడానికి ముందుకురాని వారికి ప్రత్యామ్నాయం చూపండి
– నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్
– కలెక్టర్ల సదస్సులో ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి: కలెక్టర్ల కాన్ఫరెన్స్ తొలిరోజు సమావేశంలో ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులు, యూరియా వినియోగం, ఆక్వా రైతులు, సెంటు పట్టా లబ్ధిదారులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకున్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో సోమవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. జీఎస్డీపీ పెంపునకు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు.
సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన వివిధ అంశాలపై చర్చించారు. వ్యవసాయంపై చర్చ సందర్భంగా యూరియా సరఫరా గురించి ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో యూరియా కొరత లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరింత పక్కా ప్రణాళికతో వెళ్లాలని సీఎం అధికారులకు, కలెక్టర్లకు సూచించారు. ఈ క్రమంలో యూరియా వినియోగం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందనే అంశం సదస్సులో చర్చకు వచ్చింది. యూరియా వినియోగం పెరిగితే.. క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
యూరియా వినియోగం ఎక్కువైతే… ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందోననడానికి పంజాబ్ రాష్ట్రం ఓ కేస్ స్టడీ అని సీఎం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం క్యాన్సర్ కేసుల్లో టాప్-5లో ఉందని… యూరియా వినియోగం మరింతగా పెరిగితే.. టాప్-1కు వెళ్లిపోతుందని చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో యూరియా వాడకం తగ్గించే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించారు. ఇదే సందర్భంలో యూరియా వినియోగం తగ్గించిన రైతులకు ప్రొత్సహకాలిచ్చే విధానం తీసుకురావాలని చంద్రబాబు సూచించారు.
యూరియా వినియోగం తగ్గిస్తే… పీఎం ప్రణామ్ కింద బస్తాకు రూ. 800ను ప్రొత్సాహకంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది కానీ… రైతులకు ఇవ్వడం లేదని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ఆ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం కంటే… రైతులకు ఇవ్వడం ముఖ్యమమన్నారు. రాష్ట్రానికి వచ్చే సబ్సిడీని రైతులకే ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
బలభద్రపురంపై అధ్యయనం చేయండి
బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల నమోదు అవుతున్న అంశాన్ని మంత్రి నాదెండ్ల ప్రస్తావించారు. ఆ గ్రామంలో ఎరువులు, యూరియా వినియోగం కూడా ఎక్కువగా ఉందనే రీతిలో అధికారులు చెబుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించారు. బలభద్రపురంలో క్యాన్సర్ కేసుల నమోదు కావడంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా..? అనే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం సూచించారు.
రసాయన ఎరువుల కారణంగా మన మిరపను చైనా తిరస్కరించిందని, ప్రజలు తినే వెరైటీలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు. డిమాండ్, సప్లైకి అనుగుణంగా పంటలు పండించేలా రైతులను చైతన్య పరచటంలో కలెక్టర్లు కీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఉద్యాన ఉత్పత్తులు, ఎగుమతుల విషయంలో క్లస్టర్ అప్రోచ్ ఉండాలని చెప్పారు. కోనసీమ కంటే అనంతపురం తలసరి ఆదాయం, జీఎస్డీపీ ఎక్కువ ఉందని గుర్తు చేశారు. వివిధ వాణిజ్య, ఉద్యాన పంటల కారణంగా ఆయా జిల్లాల్లో పరిస్థితి మారుతుందని వివరించారు.
ఆయిల్ పామ్ తోటల సాగు ఉమ్మడి గోదావరి జిల్లాలకు గేమ్ ఛేంజర్ గా మారిందని చెప్పారు. ఇక ఏజెన్సీలో కాఫీ కంటే మిరియాలు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సమస్యలతో కొన్ని పంటలపై ప్రభావం పడుతోందని అన్నారు. హెచ్డీ బర్లీ పొగాకు 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేశామని చెప్పారు. మామిడికి కిలో రూ.4 చొప్పున రూ.200 కోట్ల వరకూ రైతులకు చెల్లించామన్నారు.
ఉల్లి పంట కొనుగోలు విషయంలో ప్రతిపక్షం డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటాను రూ.1200తో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఏం చేస్తే రైతులకు లాభం వస్తుందో అధ్యయనం చేసి ఆయా మార్గాలు రైతులు అనుసరించేలా చైతన్యపర్చాలని సీఎం చెప్పారు. రైతులకు నష్టం రాకుండా రవాణా ఛార్జీలు భరించి ప్రాసెసింగ్ కు పంపించేందుకు అవకాశం ఉందని.. ఈ తరహాలోనే కలెక్టర్లు ఆలోచనలు చేయాలని చంద్రబాబు సూచించారు.
ఆక్వా పరిశ్రమను ఆదుకుంటాం… పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తాం
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ఆదుకునేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశామని చెప్పారు. ఏపీలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ ఉందని… ఇప్పటికే రూ. 1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రాయితీ విద్యుత్ అందించేందుకు జోన్-నాన్ జోన్ కింద విభజించారని… రిజిస్ట్రేషన్ చేయించుకోని వారికి ఇంకా రాయితీ విద్యుత్ అందడం లేదని.. నెల రోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయించాలని చంద్రబాబు ఆదేశించారు.
ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబులిటీ, సర్టిఫికేషన్ తప్పకుండా ఉండాలని స్పష్టం చేశారు. సర్టిఫికేషన్ లేకుండా ఆక్వా సాగు చేస్తే… వాటికి డిమాండ్ ఉండదని చెప్పారు. అలాగే పౌల్ట్రీ వేస్ట్ ఇష్టానుసారంగా పడేయకుండా చూసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.
గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోందని చెప్పారు. జీఎస్డీపీ కాంట్రిబ్యూషనులో పశు సంవర్ధక శాఖదేనని ముఖ్యమంత్రి చెప్పారు. పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుందని… దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే వారికి మంచి ఆదాయం వచ్చేలా చేయగలమని ఆ దిశగా ఆలోచన చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
పేదలకు ఇల్లు… ఇంటి స్థలం ఇదే ప్రయార్టీ
వచ్చే నాలుగేళ్లల్లో ప్రతి అర్హుడికీ ఇల్లు లేదా ఇంటి స్థలం ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీన్ని హై ప్రయార్టీగా తీసుకోవాలని ఆదేశించారు. పేదలకు ఇల్లు లేదా ఇంటి స్థలం అందించే అంశంపై అందుబాటులో ఉన్న డేటాను వినియోగించుకుని… అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇంటి స్థలం అందించాలన్నారు. అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు ఇచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ మేరకు భూమిని గుర్తించాలని సూచించారు.
అర్బన్ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అవలంభించాలని చెప్పారు. ఇక కొన్ని చోట్ల సెంటు పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని అధికారులు, మంత్రులు చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం… సెంటు పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్దిదారులకు ప్రత్యామ్నాయం చూపాలని స్పష్టం చేశారు. సెంట్ పట్టా భూమి నిరుపయోగంగా ఉంటే… ఆ భూమిని ఎంఎస్ఎంఈలు వంటి వాటికి కేటాయించాలని సూచించారు.
పోర్టులు, ఎయిర్ పోర్టుల వద్ద పర్యాటకం పెరిగేలా ఎకోసిస్టం రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఆర్ధిక లావాదేవీల కేంద్రంగా టౌన్ షిప్లను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటక ప్రాజెక్టుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.