Suryaa.co.in

Andhra Pradesh

ఏకగ్రీవ పంచాయతీలకు రూ.134.95 కోట్లు

– 2,001 పంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవం
– ఆయా గ్రామాలకు ప్రోత్సాహక నిధులు మంజూరు
– ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

అమరావతి : ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో 13వేలకుపైగా గ్రామాల్లో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అందులో 2,001 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 358 పంచాయతీలు, తర్వాత గుంటూరు జిల్లాలో 245, వైఎస్సార్‌ జిల్లాలో 248, ప్రకాశం జిల్లాలో 192 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 36 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.

ఆయా గ్రామాలకు రూ.134.95 కోట్ల ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నాలుగు రోజుల కిందట ఉత్తర్వులు జారీచేసింది. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ వివాదాల జోలికి పోకుండా ప్రజలంతా ఏకతాటిపై కొనసాగుతూ ఎన్నికను ఏకగ్రీవం చేసుకునే పంచాయతీలకు వాటి స్థాయినిబట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమైతే రెండువేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.5 లక్షలు, 2,000–5,000 మధ్య జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు, 5,000–10,000 మధ్య జనాభా ఉన్నవాటికి రూ.15 లక్షలు, 10 వేలకుపైన జనాభా ఉన్న గ్రామాలకు రూ.20 లక్షల వంతున ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేసింది.

LEAVE A RESPONSE