-అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు
-లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను దోచుకునేది జగన్ బంధువులు
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
విజయవాడ: రాష్ట్రంలో మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను రెచ్చగొట్టటానికి ప్రయత్నిస్తే సహించేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడ దాసరి భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ 3 రాజధానుల బిల్లు హైకోర్టు తీర్పునకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఆ తదుపరి అమరావతి రాజధాని అభివృద్ధిపై హైకోర్టు తీర్పు తర్వాత వివాదం సమసిపోయిందని భావించామన్నారు. అయితే మళ్లీ ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ప్రజల మధ్య అంతరాలు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
అమరావతి రైతులు చేపట్టదలచిన ‘అమరావతి టు అరసవెల్లి’ పాదయాత్రకు రాష్ట్ర డిజిపి అనుమతి నిరాకరిస్తే, హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు అనుమతించిందన్నారు. అసలు రాజ్యాంగం మన రాష్ట్రానికి వర్తించదా? పాదయాత్ర చేసుకోనివ్వరా? ధర్నాలు చేయకూడదు. .. ర్యాలీలు చేయకూడంటూ ఈ నిర్బంధాలేమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఉత్తరాంధ్ర మంత్రులతో మాట్లాడించటం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అన్నారు.
విశాఖ ఒక్కరోజులో అభివృద్ధి కాలేదన్నారు. విశాఖ చేపలు పట్టుకునే చిన్న గ్రామమని అక్కడ స్టీల్ ప్లాంట్, పోర్టు ఇతర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయటం వల్ల అభివృద్ధి చెందిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరిస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడని ప్రశ్నించారు. గంగవరం పోర్టు వేలకోట్ల ఆస్తిని అదాని ఇస్తున్న కమీషన్లకు కక్కుర్తిపడి ఇచ్చేస్తున్నారని విమర్శించారు. విశాఖ అభివృద్ధికి అడ్డుగా ఉన్నారని మంత్రుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా మాట్లాడించటం మానుకోవాలన్నారు.
రైతుల పాదయాత్రకు ఏదైనా ఆటంకం జరిగితే దానికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పక్కాగా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని వైసీపీ చూస్తుందన్నారు. కపడ జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి అభివృద్ధి చేస్తే వద్దనేవాళ్లు ఎవరూ లేరన్నారు. గండికోట ప్రాజెక్టుకు ఒక్క కాలువ తొవ్వలేదన్నారు. అభివృద్ధి చెందిన విశాఖపట్నం ప్రాంతాన్ని వైసీపీ నాయకులే దోచుకుంటున్నారని విమర్శించారు.
తన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వస్తే మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని జగన్మోహన్ రెడ్డి నిలదీయటం సిగ్గుచేటన్నారు. జగన్ దోపిడీ గురించి మంత్రులు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఏమి మాట్లాడాలో కూడా మంత్రులకు చీటి రాసిస్తున్నారని చెప్పారు. మద్యపాన నిషేదం అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ సొంత బ్రాండ్లు అమ్మి వేలకోట్ల రూపాయలు దోచుకుంటున్న దానికి సమాధానం ఏమిటి? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అని చెప్పి దానిపై డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తి ప్రపంచం జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని అన్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో లేపాక్షి నాలెడ్జి హబ్ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. కడప-బెంగళూర్ హైవే ప్రక్కన ఉన్న 8వేల ఎకరాలకు పైగా ఉన్న భూములను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లేపాక్షి భూముల్ని తీసుకుని, వాటిని బ్యాంకులో తనఖా పెట్టి దివాళీ పిటిషన్ వేయించేలా చేసేది మీరెనని ఎద్దేవా చేశారు. వేలానికి తీసుకువచ్చి మళ్లీ కొనేది కూడా మీరే అని వివరించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ మేనమామ కొడుకు రామాంజనేయరెడ్డి లేపాక్షి భూముల్ని కొంటున్నాడని తెలిపారు.
మంత్రి అంజాద్ బాషాని లేపాక్షి భూములపై మాట్లాడమని చెపితే ఆయన ఏమి చేస్తాడన్నారు. రామాంజనేయరెడ్డి జగన్ మేనమామ కాదని చెప్పుతాడా? అని ప్రశ్నించారు. లేపాక్షి భూములపై సీఎం పేషీలో లీగల్ రికార్డు ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధం భూములను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 2013 భూసమీకరణ చట్టం ప్రకారం తీసుకున్న భూములను అభివృద్ధి చేయకపోతే వెనక్కు ఇచ్చేయాలన్నారు. లేపాక్షి భూముల అంశంపై సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబరు నెలలో రిలే నిరాహార దీక్షలు చేయనున్నట్లు తెలిపారు.
అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. రైతులతో కలిసి నడుస్తామన్నారు. పాదయాత్రకు ప్రభుత్వం అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అరాచకాలు సృష్టించాలని ప్రయత్నిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు. పాల్గొన్నారు.