Suryaa.co.in

National

బీబీసీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారుల సర్వే

ఆదాయపన్ను శాఖ అధికారుల బృందాలు సోమవారం బీబీసీ భారత కార్యాలయాల్లో సర్వే చేపట్టాయి. ముంబై, ఢిల్లీలోని కార్యాలయాలను ఈ బృందాలు సందర్శించాయి. ఈ సందర్భంగా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం కార్యాలయాన్ని వీడి వెళ్లిపోవాలని ఉద్యోగులను కోరినట్టు తెలిసింది.

మధ్యాహ్నం షిఫ్ట్ చేసే బీబీసీ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసుకోవాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సర్వే సమాచారంపై కాంగ్రెస్ సహా విపక్షాలు స్పందించాయి. తాము అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం బీబీసీ వెంట పడుతోందంటూ కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది.

‘‘భారత్ జీ-20 దేశాలకు నాయతక్వం వహిస్తున్న సమయంలో.. భారత్ నిరంకుశ్వం, నియంతృత్వంలోకి జారిపోయిందని ప్రధాని నిరూపిస్తున్నారు. బీబీసీపై దాడులు, అదానీకి క్లిన్ చిట్, సంపన్నులకు పన్ను తగ్గింపులు..’’అంటూ కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ‘‘నిజమా? ఊహించనే లేదు’’అంటూ టీఎంసీ నేత మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. పన్ను చెల్లింపుదారుల వాస్తవ ఆదాయం వివరాలను తేల్చేందుకు ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తుంటారు.

LEAVE A RESPONSE