– ఇదేనా చంద్రబాబు సుదీర్ఘ పాలనా అనుభవం
– మండిపడ్డ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
కాకినాడ: రైతుల విషయంలో కూటమి సర్కార్ రాక్షసత్వం ప్రదర్శిస్తోందని, కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమిదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఆయన పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సుదీర్ఘ పాలనా అనుభవం ఉందని పదేపదే చెప్పుకునే చంద్రబాబుకు వ్యవసాయ సీజన్లో రైతులకు ఏ మేరకు ఎరువులు కావాలో ముందుగానే ప్రణాళికను సిద్దం చేసుకోవాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, యూరియా కొరత, పంటలకు మద్దతు ధరలపై అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి, డిమాండ్ పత్రాలను సమర్పించనున్నట్లు తెలిపారు. ఇంకా ఆయనేమన్నారంటే…
అనుభవం ఉన్న సీఎంగా చెప్పుకునే చంద్రబాబుకు రాష్ట్రంలో ఏ సీజన్లో ఎంత పంట సాగు చేస్తారు, దానికి ఎటువంటి అవసరాలు ఉంటాయి, ముందుచూపుతో దానికి తగినట్లుగా ఎలాంటి ప్రణాళికను రూపొందించుకోవాలనే ఆలోచన ఉండదా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి యూరియా కొరత లేదు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీలో మాత్రం యూరియా కొరత ఎందుకు ఏర్పడిందంటే, దాని గురించి ఆలోచించే తీరిక చంద్రబాబుకు లేదని అర్థం. రైతుల పక్షాన వైయస్ఆర్సీపీ ఈనెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులు, ప్రజాసంఘాలతో కలిసి డిమాండ్ పత్రాలను ఇవ్వనున్నాం. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడటాం.
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు నినాదంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు కూడా పోరాటానికి వైయస్ఆర్సీపీ సిద్దంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో స్లీల్ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. 32 డిపార్ట్మెంట్లను ప్రైవేటుపరం చేస్తూ టెండర్లు కూడా పిలిచారు. దశల వారీగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోంది.