– నక్సల్స్ రహిత దేశంగా తీర్చిదిద్ది న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
– ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్
– విజయవాడ సత్యనారాయణ పురం లో శివాజీ వర్థంతి వేడుకలు
విజయవాడ: మొగల్ సామ్రాజ్యంపై విరుచుకుపడి, హైందవ స్వరాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి భారతీయుడికి నిత్యం స్ఫూర్తిదాయకమని ఏపీ బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ.. తల్లి జిజియాబాయి అందించిన స్ఫూర్తితో శివాజీ మహారాజ్ అప్రతిహాతమైన శక్తితో అనేక కోటలను నిర్మించి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించారని గుర్తుచేశారు.
రాయగడలో ఆయన పట్టాభిషిక్తుడైన నాటి నుంచి హైందవ చైతన్యం వెల్లివిరిసిందని, ఆయనను సాక్షాత్తు శివుని అవతారంగా ప్రజలు భావిస్తారని తెలిపారు.
ఆంధ్ర ప్రాంతంతో శివాజీ మహారాజ్‌కు ఉన్న విడదీయరాని అనుబంధాన్ని వివరిస్తూ, ఆయన జైత్రయాత్ర విశాఖపట్నం వరకు సాగిందని, శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఆయన తపస్సు చేశారని మాధవ్ వివరించారు. నేటి తరుణంలో దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న విజాతీయ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్వధర్మం పట్ల అభిమానం కలిగి ఉండాలని మాధవ్ పిలుపునిచ్చారు
మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా వామపక్ష హింసావాద ఉగ్రవాదాన్ని (నక్సలిజం) అణచివేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన విజయాన్ని అద్భుతమని మాధవ్ అభివర్ణించారు. ప్రస్తుతం ప్రపంచమంతా మతోన్మాదంతో యుద్ధాలు (ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-ఇరాన్ వివాదాలు) చేసుకుంటున్న తరుణంలో, ‘సర్వధర్మ సమభావన’ కలిగిన శివాజీ మహారాజ్ ఆశయాలే భారతదేశాన్ని ‘విశ్వగురు’ స్థానంలో నిలబెడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు
శివాజీ మహారాజ్ ఆశయాలను ప్రతి వాడవాడలా తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ ఆయనలా దేశ రక్షణకు కంకణబద్ధులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో విగ్రహ స్థాపనలో కీలక పాత్ర పోషించిన నిర్వాహకులను, కార్యవర్గ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్, ఆర్ ఎస్ ఎస్ ప్రతినిధి కృష్ణ నాగలింగంశివాజీ తదితరులు పాల్గొన్నారు