Suryaa.co.in

Andhra Pradesh

నిరుద్యోగితతో విదేశాలకు పరుగులు తీస్తున్న భారత యువతీయువకులు

– వస్తూత్పత్తి–తయారీ రంగం పుంజుకుంటే పెరిగే ఉపాధి అవకాశాలు
– ఎంపి విజయసాయిరెడ్డి

భారతదేశం నుంచి గత పదేళ్లకు పైగా విదేశాలకు ఉపాధి, విద్యావకాశాల కోసం వెళ్లిపోతున్న యువతీయువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాకు ఈ వలసల వల్ల భారతీయులు తాము పనిచేస్తూ జీవిస్తున్న దేశాల నుంచి పంపే డబ్బు కూడా విపరీతంగా పెరుగుతున్న మాట వాస్తవమే. మాతృదేశంలో తగినన్ని ఉపాధి అవకాశాలు పెరగపోవడంతో చదువుకున్న, అనేక రకాల నైపుణ్యాలున్న యువతీ యువకులు పశ్చిమాసియా, ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌ తదితర దేశాలకు వలసపోతున్నారు. ప్రపంచంలో స్వదేశం నుంచి ఇతర దేశాలకు పోయి పనిచేస్తున్న జనం ఎక్కువ మంది భారతీయులే. అందుకే ఈ రంగంలో ఇండియా ప్రథమ స్థానం ఆక్రమించింది. ఐక్యరాజ్య సమితి సంస్థల అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఒక కోటీ 80 లక్షల మంది భారతీయులు ఉపాధి సంపాదించి జీవిస్తున్నారు.

2022లో ఈ ప్రవాస భారతీయులు దాదాపు 100 బిలియన్‌ డాలర్ల సొమ్ము స్వదేశానికి పంపి ఉంటారని అంచనా. ప్రవాసులు స్వదేశానికి భారీ మొత్తంలో డబ్బు పంపడంలో కూడా భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. ఇలా విదేశాల్లో లభించే అవకాశాలను భారతీయులు ఉపయోగించుకోవడంలో తప్పులేదు. అలాగే, మాతృదేశానికి విలువైన విదేశీ మారకద్రవ్యం పంపడం కూడా మంచిదే. కాని ఇండియాలో తగినన్ని ఉపాధి అవకాశాలు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ)లో పై స్థాయిల్లో ఉద్యోగాల సంఖ్య ఆశించినంతగా లేకపోవడం వల్లనే విదేశాలకు భారత యువత వలసలు పెరిగిపోతున్నాయి. సంపద, టెక్నాలజీ, వనరులు విషయంలో అగ్రరాజ్యమైన అమెరికాలో నిరుద్యోగం ఎన్నో దశాబ్దాలుగా చాలా తక్కువ.

ఇప్పుడు ప్రపంచానికి ‘ఫ్యాక్టరి’గా మారిన చైనాలోనూ నిరుద్యోగం తక్కువే. చైనాలో ఉపాధి అవకాశాలు అంత పెద్ద జనాభాకు తగినన్ని ఉండడానికి కారణం అక్కడ వస్తూత్పత్తి–తయారీ రంగాల్లో నిరంతరం పెట్టుబడులు వచ్చిపడుతూ ఉండడమే. అక్కడ ఉత్పాదక కార్యకలాపాలు భారీ స్థాయిలో సాగుతున్నాయి.
ఇండియాలో కూడా మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగం బలోపేతం కావాలి. పైన ముందే వివరించినట్టు భారతదేశం నుంచి వలసలకు అడ్డుకట్టవేయాల్సిన అవసరం లేదు గాని చదువుకున్న, శిక్షితులైన యువతకు దేశంలోనే ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉందని ఎందరో ఆర్థికవేత్తలు ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. సేవారంగం దేశంలో కొన్ని నగరాలకే పరిమితం కావడం, అందులో బాగా నైపుణ్యం ఉన్నవారికే ఉపాధికి అవకాశాలు ఉండడం వల్ల ఈ రంగంలో ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో సృష్టించడం అంత తేలిక కాదు.

అందుకే వస్తూత్పత్తి–తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు వంటి ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో భారతదేశం ఎలాంటి పరిస్థితుల్లోనూ శ్రీలంక, పాకిస్తాన్‌ వంటి చిన్న దేశాల మాదిరిగా సంక్షోభాలు ఎదుర్కొనే అవకాశాలు లేవని వారు భావిస్తున్నారు. కాని, వ్యవసాయరంగంలో పైకి కనిపించని నిరుద్యోగం ఉందని, సాగురంగం నుంచి గ్రామీణ యువతను బయటకు తీసుకురావడానికి ఇండియాలో మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాన్ని విస్తరించడమే ఏకైక మార్గమని వారు గట్టిగా నమ్ముతున్నారు. కొవిడ్‌–19 మహమ్మారి ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్నాక దేశంలో ఆర్థికాభివృద్ధి కనిపిస్తోందిగాని ఉపాధి అవకాశాలు అవసరమైన స్థాయిలో పెరగడం లేదు.

అందుకోసమే పెట్టుబడి వ్యయం హెచ్చించి, యువతకు ఉద్యోగావకాశాలు పెంచే ప్రయత్నం చేయాలంటున్నారు. ఇండియాలో తమకు భవిష్యత్తు లేదనే భావన ఉన్నత విద్యావంతుల్లో లేకుండా చేయాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ కృషి త్వరలోనే సత్ఫలితాలు ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

LEAVE A RESPONSE