-మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించకుండా అవమానిస్తుందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించిన విషయం తెలిసిందే. గవర్నర్ తమిళిసై.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారు. కాగా.. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా.. గవర్నర్ వ్యాఖ్యలపై దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. గవర్నర్ బీజేపీ సభ్యురాలిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గవర్నర్ పరిధి దాటి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఇంద్రకరణ్ ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
నిన్న హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత గవర్నర్ తమిళిసై వక్రబుద్ధి బయటపడిందంటూ మండిపడ్డారు. ఎక్కడ అవమానం జరిగిందో గుర్తుచేసుకోవాలంటూ సూచించారు. ఉగాది రోజున యాదాద్రికి వస్తున్నట్టుగా 20 నిమిషాల ముందు చెప్తే ప్రోటోకాల్ ఎలా పాటిస్తారంటూ నిలదీశారు. రాజ్యాంగ బద్దంగా ఇవ్వాల్సిన గౌరవం, ప్రొటోకాల్ ఇస్తున్నామని.. నోరు పారేసుకోవడం మానుకోవాలంటూ గవర్నర్‌కు ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.తాను అసెంబ్లీని రద్దు చేసేదాన్ని అంటూ తమిళిసై చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీని రద్దు చేసిన రామ్ లాల్‌కు ఏం జరిగిందో తమిళిసై గుర్తుకు తెచ్చుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ సూచించారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగిన తమిళిసై.. ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.