September 24, 2026

పారిశ్రామిక వికాసమా? కార్పొరేట్ ఫాసిజమా?

  • కూటమి ప్రభుత్వం కూడా నేడు వాటికి కేటాయించిన భూముల్లో మార్పులు చేర్పులు చేయడమే తప్ప కేటాయింపులను రద్దు చేయలేదు
  • అలా చేయకపోవడం చంద్రబాబు నాయుడి దార్శనికతకు సవాలు
  • పెట్టుబడిదారులు ప్రభుత్వ అండతో భూములను ఆక్రమించుకుంటున్నారే తప్ప కొనుగోలు చేయడం లేదు
  • మన భూముల ద్వారా లబ్ధి పొందిన కంపెనీలు మాత్రం విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి
  • ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లు, ఫండింగ్ లేదా ‘క్విడ్ ప్రో కో’ రూపంలో రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం

( ఇంద్రాణి )

పీవీ నరసింహారావు భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానాలకు తెర తీశారు. అయితే అనుకున్నంతగా ఫలితాలు సాధించలేదు, ఆశించినంత స్థాయిలో పెట్టుబడులు రాలేదు. ఆ విషయమై ఒక ఇంటర్వ్యూలో లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ గారిని అడిగితే—విదేశీ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాకపోవడానికి ప్రధాన కారణం భారతదేశంలో అప్పటికి అమలవుతున్న కార్మిక చట్టాలు కాగా, మరొక కారణం భూమి విలువ అని చెప్పారు.

ప్రపంచంలోనే భూమి విలువ ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. పరిశ్రమ స్థాపించడానికి అయ్యే పెట్టుబడిలో సింహభాగం భూమికే కేటాయిస్తే, లాభాల బాట పట్టడానికి చాలా సమయం పడుతుందనే ఆలోచన వారిని ముందుకు సాగనీయలేదనేది దాని సారాంశం. దానికితోడు కొద్దిగా సోషలిస్టు తరహా కార్మిక చట్టాలు; కార్మికుల హక్కుల పోరాటాలు అంటే పెట్టుబడిదారులకు ఎప్పుడూ భయమే.

కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక విధానాలను సరళీకరించాయి కానీ, భూములు కేటాయించి అయినా పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచనపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. అయితే పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి; ఉపాధి ఉన్నచోట జనసాంద్రత పెరుగుతుంది, సైబరాబాద్ లాంటి నగరాలు ఏర్పడతాయి, తద్వారా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. భూములు కొని మరీ పెట్టుబడులు పెట్టడం భారమని అర్థం చేసుకున్న చంద్రబాబు నాయుడు, పెట్టుబడిదారులకు భూములు కేటాయించి అయినా పెట్టుబడులను ఆకర్షించాలనుకున్నారు.

ఆ ఆలోచనలలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన రెండు పద్ధతులలో భూములను కేటాయించారు. మొదటి విధానంలో రాయితీ ధరలకు అమ్మడం జరిగింది. అందులో భాగంగా ఐటీ రంగానికి, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకు మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు ఏపీఐఐసీ ద్వారా ఉమ్మడి హక్కులతో భూములను విక్రయించారు. దానితో హైదరాబాద్‌లో ఐటీ రంగం ఊపందుకుంది. విద్యాసంస్థలకు, ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్న ప్రాజెక్టులకు, మౌలిక వసతుల కోసం భూములను 33, 66 లేదా 99 సంవత్సరాల దీర్ఘకాలిక లీజు పద్ధతిలో కేటాయించారు. అలాంటి విద్యాసంస్థల్లో ఐఎస్‌బీ వంటి సంస్థలు ఉన్నాయి. హైటెక్ సిటీ కోసం పీపీపీ పద్ధతిని అనుసరించారు.

కేటాయింపు ప్రాతిపదిక నిర్ణయం వెనుక సంస్థ రకం, కల్పించే ఉద్యోగాల సంఖ్య, తీసుకొచ్చే పెట్టుబడి పరిమాణం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు. ఒక్క శంషాబాద్ విమానాశ్రయానికి మాత్రమే వేల ఎకరాల భూమిని కేటాయించారు. మిగిలిన సంస్థలన్నింటికీ వందల్లో, యాభైల్లో మాత్రమే ఎకరాలను కేటాయించారు. ఆ రోజుల్లో కేటాయించబడిన భూముల్లోకి ఆ సంస్థలన్నీ వచ్చి చేరి, నేడు హైదరాబాద్ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

ఆ తరువాత వచ్చిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి తన కుమారుడి స్వంత లాభం కోసం ఒక్కో సంస్థకు వేలాది ఎకరాల భూమిని కేటాయించారు. వాన్‌పిక్ సంస్థకు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 28,000 ఎకరాలు, బ్రాహ్మణి స్టీల్స్‌కు కడప జిల్లా జమ్మలమడుగు వద్ద 14,000 ఎకరాలు, కాకినాడ సెజ్‌కు 10,000 ఎకరాలు, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు 8,844 ఎకరాలు, తన కుమారుడి సంస్థ అయిన భారతి సిమెంట్స్‌కు లైమ్‌స్టోన్ గనుల కోసం 2,038 ఎకరాలు కేటాయించారు. అందులో ఒక్క సంస్థ కూడా పనులు ప్రారంభించలేదు, ఉపాధి కల్పించనూ లేదు. అలా అధికార దుర్వినియోగం చేసి రాజకీయాలను, రియల్ ఎస్టేట్‌ను దొడ్డిదారిన ముడిపెట్టారు.

తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు 2014-2019 మధ్య కాలంలో ప్రముఖ విద్యాసంస్థలకు, కియా మోటార్స్ లాంటి సంస్థలకు భూములు కేటాయించారు కానీ, అవి వందల ఎకరాలకే పరిమితమయ్యాయి. అయితే 2019-2024 మధ్య కాలంలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అదానీ గ్రూపుకు, ఇండోసోల్ సంస్థకు వేల ఎకరాలు కేటాయించారు. ఆ సంస్థలు కల్పించే ఉపాధికి, వాటికి కేటాయించిన భూమికి పొంతనే లేదు.

ఇండోసోల్‌కు కేటాయించిన 8,000 ఎకరాలలో వారి ప్రతిపాదిత ప్లాంటుకు 500 ఎకరాలే ఎక్కువ. అదానీలకు కేటాయించిన భూమి విషయంలోనూ అంతే. భవిష్యత్తులో విస్తరిస్తామని ప్రతిపాదించినందువల్లనే ఇన్ని వేల ఎకరాలు అవసరమని చెబుతారు; కానీ ఇది పూర్తిగా అవాస్తవం. వారు కల్పించే ఉపాధి కూడా లెక్కల గారడీ మాత్రమే; ప్రాజెక్టుల నిర్మాణ దశలో లభించే తాత్కాలిక ఉపాధి మాత్రమే దొరుకుతుంది.

ఈ విషయాలు ఇప్పటి కూటమి ప్రభుత్వానికీ తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఈ కేటాయింపులను ఎత్తిచూపినవారే. కానీ ఆ కంపెనీల వెనుక ఉన్న బలీయమైన శక్తి ఏమిటనేది చెప్పకుండా, కూటమి ప్రభుత్వం కూడా నేడు వాటికి కేటాయించిన భూముల్లో మార్పులు చేర్పులు చేయడమే తప్ప కేటాయింపులను రద్దు చేయలేదు. అలా చేయకపోవడం చంద్రబాబు నాయుడి దార్శనికతకు సవాలుగానే మిగులుతుంది.

దేశంలో కార్పొరేట్ శక్తులు బలమైన రాజకీయ అండదండలను అడ్డుపెట్టుకుని భూమిని చెరపట్టడం సర్వసాధారణమైపోయింది. కార్పొరేట్ శక్తులు తాము స్థాపించబోయే తయారీ సంస్థల విస్తీర్ణం కన్నా రెట్టింపు కంటే ఎక్కువ భూమిని సేకరిస్తున్నాయి. అదే సమయంలో వ్యవసాయదారులు తమ భూములను కోల్పోయి కూలీలుగా మారుతున్నారు. ఒకనాడు మన దేశంలో భూమిని కొని పెట్టుబడి పెట్టడానికి సంకోచించి వెనక్కి తగ్గిన పెట్టుబడిదారులు, నేడు ప్రభుత్వ అండతో భూములను ఆక్రమించుకుంటున్నారే తప్ప కొనుగోలు చేయడం లేదు.

ప్రభుత్వ రంగాన్ని తొక్కిపట్టేసిన ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులకు పన్ను మినహాయింపుల నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల రద్దు వరకు రాయితీలు, ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్స్) అందిస్తున్నాయి. 140 కోట్ల ప్రజలకు హక్కు ఉన్న భూమిని కొద్దిమంది కార్పొరేట్లకు కట్టబెడుతూ ప్రజలను దివాలా తీయిస్తున్నారు. పరిశ్రమ పెడతామన్న పేరుతో చౌకగా వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను పొంది, ఆ తరువాత ఆ భూముల విలువ పెరిగిన కొద్దీ వాటిపై బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ఇతర వ్యాపారాలకు మళ్లిస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మన దేశానికి రాకపోయినా, మన భూముల ద్వారా లబ్ధి పొందిన కంపెనీలు మాత్రం విదేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి.

ఈ కేటాయింపుల ద్వారా లబ్ధి పొందిన కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లు, ఫండింగ్ లేదా ‘క్విడ్ ప్రో కో’ రూపంలో రాజకీయ పార్టీలకు ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఈ విధానం వలన సంపద కొద్దిమంది పారిశ్రామికవేత్తల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది. వేలాది మంది చిన్న, సన్నకారు రైతులు భూములు కోల్పోయి కూలీలుగా మారుతుంటే, పదేళ్ల క్రితం ఏమీ లేని కంపెనీలు వేల కోట్ల ఆస్తులకు అధిపతులవుతున్నాయి.

సమాజంలో పేద, ధనిక వ్యత్యాసాలు విపరీతంగా పెరగడానికి ఇది కారణమవుతోంది. పారిశ్రామికీకరణ, సాంకేతిక పురోగతి, ఉద్యోగాల కల్పన అనేవి రాష్ట్ర ప్రగతికి అత్యంత ఆవశ్యకం. అయితే సముచితమైన భూపరిమితి, పారదర్శకమైన ప్రజాభిప్రాయ సేకరణ లేనప్పుడు అది పారిశ్రామిక వికాసం కాకుండా కేవలం కార్పొరేట్ అనుకూల విధానంగా మారిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, దీనిని ‘కార్పొరేట్ ఫాసిజం’ అని భావించక తప్పదు.!

Total Visitors: 2,763,585