– ఆవకాయ్ అమరావతి, మాగాయ మంగళగిరి, కాకరకాయ కుప్పం పబ్లిసిటీ
– పీపీపీ విధానంలో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి
– ఏపీఐఐసీ కట్టాల్సిన పారిశ్రామిక పార్కులూ ప్రైవేటుకు
– పీపీపీ విధానంలో రాష్ట్రంలో 22 ఎంఎంస్ఈ పార్కులు
– అన్నీ ప్రైవేటుకు ఇస్తే సీఎంగా చంద్రబాబు ఎందుకు?
– ఇక రాష్ట్ర ప్రభుత్వాన్నీ ప్రైవేటుకు ఇచ్చేస్తారా?
– వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం: రాష్ట్రంలో ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు.. ఇప్పుడు పారిశ్రామీకరణకు మూల కేంద్రమైన ఏపీఐఐసీలోనూ అదే పంథాకు తెర లేపారని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. రాష్ట్రంలో 22 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ఏపీఐఐసీని కాదని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు పనులు అప్పగించడమే ఇందుకు నిదర్శమని ఆయన వెల్లడించారు.
ఇలా అన్నీ ప్రైవేటుకు అప్పగిస్తే ఇక సీఎంగా చంద్రబాబు ఎందుకు? మంత్రివర్గం ఎందుకు? అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రా? లేక కార్పోరేట్ శక్తుల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రా? అన్నదీ అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో ప్రధాన రంగాలన్నింటినీ పూర్తిగా ప్రైవేటు పరం చేసే ప్రక్రియ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతోంది.
రాష్ట్రంలో అత్యంత బలమైన, ధనిక కార్పొరేషన్లలో ఒకటి రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ). ఉమ్మడి ఏపీలో, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఎన్నో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేసి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తుల్ని తీసుకొచ్చి, వారి ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించి తద్వారా ఆదాయాన్ని సమకూరుస్తోంది ఆ సంస్థ. రాష్ట్రంలో 550కి పైగా పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ది చేసిన ఘనత ఏపీఐఐసీకి ఉంది. ఆ మేరకు సంస్థ భూములు సేకరించి, అభివృద్ధి చేసింది.
మొదటిసారిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా కాకుండా, పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల ద్వారా రాష్ట్రంలో 22 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కుల్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. భూమి కొనుగోలు చేసే ప్రక్రియలో ఇబ్బందులు ఉంటే పరిష్కరించుకోవచ్చు. భూముల సేకరణకు నిధులు లేకపోతే, ఏ విధానంలో అయినా సేకరించొచ్చు. కావాలంటే, రెవెన్యూ భూములను కూడా ఆ సంస్థకు బదలాయించవచ్చు. ఇలా ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిని ప్రైవేటుకు అప్పగించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?.
పీపీపీ కింద ఇస్తామని చెబుతున్న 22 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుల్లో అసైన్డ్ భూములు ఉన్నాయి. గతంలో అనేకమంది దళితులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన భూములు అవి. సహజంగా ఏపీఐఐసీ కేటాయించిన భూములు, వారు అభివృద్ధి చేసే ఇండస్ట్రియల్ పార్కుల్లో 22 శాతం ప్లాట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలనే నిబంధన ఉంది. ఇప్పుడు పీపీపీ కింద ఇస్తామంటున్న విధానంలో అవేవీ లేవు. అంటే ఆ విధంగా కూడా దళితులకు అన్యాయం చేస్తున్నారు. భూములు ప్రైవేటు వారి చేతుల్లో పెడతాం. అందులో వాళ్లు సినిమా హాళ్లు కట్టుకోవచ్చు. రెసిడెన్షియల్ హౌసింగ్ కట్టుకోవచ్చు. లేఅవుట్లు వేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్ కట్టుకోవచ్చు అంటున్నారు.
ఏపీఐఐసీ అనేది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు అక్కడి వనరుల్ని వాడుకుని అభివృద్ది చెందాలనుకునేందుకు ఏర్పాటు చేసిన సంస్థ. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ది పేరుతో పీపీపీ విధానంలో భూములు కేవలం రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించడానికి చేస్తున్న స్కాం ఇది. ఒక ఇండస్ట్రియల్ పార్కుకు 100 ఎకరాలు, 50 ఎకరాలు ఉదారంగా ఇస్తున్నారు. విశాఖపట్నంలో గోపాలపట్నం, ముదసరలోవ, అనకాపల్లి జిల్లాలో పరవాడ వంటి అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ ఎకరం రూ.50 కోట్ల వరకూ ఉంది. అలాంటి చోట ప్రభుత్వ సంస్థ ప్రైవేటు వారికి, నచ్చిన పనులు చేసుకునేందుకు అప్పగించాలని నిర్ణయించడం దారుణం.
విద్య, వైద్యం, పరిశ్రమలు, చివరికి రోడ్లు కూడా పీపీపీ అంటున్నారు. ప్రైవేటు వాళ్లు రోడ్లు వేసుకుని, డబ్బులు వసూలు చేసుకుంటారని చెప్తున్నారు. అలా అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎందుకు?. 24 మంది మంత్రులెందుకు?. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు?. ప్రజామోదంతో పరిపాలన చేస్తారని, ప్రజలకు అవకాశాలు కల్పిస్తారని, విద్య, వైద్యం గొప్ప లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తారని, పారిశ్రామికాభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించారు. ఇవన్నీ ప్రైవేటు వాళ్ల చేతుల్లో పెడితే మీరు ఎందుకు?. రేపు పరిపాలన కూడా సింగపూర్లో మా ఈశ్వరన్ ఉన్నాడు. ఆయన చేతిలో పెడతాను అనేలా ఉన్నారు. దాదాపు ఐదు వేల కోట్ల పైచిలుకు ఫీజు రీయింబర్స్మెంట్, రూ.4500 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారు. కేవలం ప్రైవేటు వాళ్లు బాగుండాలనే వీటిని నీరు గారుస్తున్నారా?.
విశాఖ ఏఐ సిటీ, కర్నూలు డ్రోన్ సిటీ, అమరావతి క్వాంటం సిటీ, తిరుపతి ఫ్యూచర్ సిటీ, అనంతపురం డిఫెన్స్ సిటీ అన్నారు. 20 మాసాల్లో ఏదీ పూర్తి కాలేదు. చంద్రబాబు పబ్లిసిటీ మాత్రమే మిగిలింది. విశాఖ అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ ఇస్తే ఆ దారిలోనే ప్రభుత్వం ఇవాళ నడుస్తోంది. పేరుకు మాత్రం ఏవేవో సిటీలు అని చెప్పి ఏ ఊరుకెళ్తే ఆ సిటీలు అని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కొత్తగా విశాఖలో ఆవకాయ్ అమరావతి పేరుతో కొత్త పబ్లిసిటీ, మాగాయ మంగళగిరి, కాకరకాయ కుప్పం అని పబ్లిసిటీ చేసుకోవాల్సిందే.