– కూటమిపై జనం నమ్మకం మరోసారి నిజమయింది
అనంతపురం: సూపర్‌సిక్స్-సూపర్‌హిట్ కార్యకమ్రానికి తరలివచ్చిన ప్రజలు, కూటమి కార్యకర్తల స్పందన అపూర్వం.. అనిర్వచనీయం.. అద్భుతమని ఆ కార్యకమ్రాన్ని ఆది నుంచి తుది వరకూ పర్యవేక్షించిన రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.
కూటమిపై తాము పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతగా సభకు తరలివచ్చిన ప్రజానీకానికి శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు మంత్రి అనగాని చెప్పారు. ఒకప్పుడు కరవుసీమగా ఉన్న అనంతపురం జిల్లాను కియా లాంటి సంస్థలు తెచ్చి రత్నాలసీమగా మార్చిన సీఎం చంద్రబాబుపై జిల్లా ప్రజలు పెట్టుకున్న ఆశలు ఈ సభతో స్పష్టమయిందన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరదించి, ప్రజలకు ఉపాథి అవకాశాలు కల్పించిన ప్రజల కళ్లలో ఆశలు, కృతజ్ఞత ఈ సభలో స్పష్టంగా చూశామన్నారు. కూటమి విజయపరంపర కొనసాగుతుందని అనంతపురం ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాలే తమకు మరింత ఉత్సాహం ఇచ్చాయన్నారు.
దటీజ్ అనగాని!
నిజానికి అనంతపురంలో జరిగిన ఈ భారీ సభ ఏర్పాట్ల పర్యవేక్షణ-విజయవంతానికి, మంత్రి అనగాని వారం ముందు నుంచే జిల్లాలో తిష్ఠ వేశారు. మంత్రులు-ఎమ్మెల్యేలు-నియోజకవర్గ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకుని, సభ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. నియోజకవర్గాల వారీగా జనసమీకరణ, వారికి ఏర్పాట్లు, సభకు హాజరయ్యే కార్యకర్తలు-ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంత్రి అనగాని చూపిన చొరవ, చేసిన సమన్వయం ఫలించింది.
దానితో ఆశించిన దానికంటే ఎక్కువమంది హాజరరయ్యారు. యువనేత, మంత్రి లోకేష్ తనపై పెట్టిన నమ్మకాన్ని మంత్రి అనగాని నిలబెట్టుకున్నట్లు, సభ సక్సెస్ అయిన తీరు స్పష్టం చేసింది. ఆయన ప్రతిరోజూ సభా స్థలి వద్దకు వెళ్లి ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. సభ ఏర్పాట్లలో చిన్న ఫిర్యాదు కూడా లేకుండా చూడటం.. అటు పార్టీ-ఇటు అధికార యంత్రాంగంతో నెరిపిన సమన్వయం సక్సెస్ కావడంతో అనగాని సత్తా మరోసారి స్పష్టమయింది.